acham naidu : అరుపులు ఒకరివి, ఆక్రోశం ఒకరిది.. వీరు చిక్కుల్లో పడతారా..?

Qubetvnews - June 26, 2024 / 09:31 AM IST

acham naidu : అరుపులు ఒకరివి, ఆక్రోశం ఒకరిది.. వీరు చిక్కుల్లో పడతారా..?

acham naidu : తన కోపమే తన శత్రువు… తన శాంతమే తనకు రక్ష… అని ఊరికే అనలేదు పెద్దలు. కోపంలోనో, ఆవేశంలోనో, ఆక్రోశంలోనో మనం చేసే పనులు మనతోపాటు మనవారిని, పార్టీని కూడా ప్రమాదంలోకి నెట్టివేస్తాయి. తాజాగా ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విధంగానే ప్రవర్తిస్తున్నారు. పలు సందర్భాల్లో నోరు జారుతున్నారు. నోటికి ఎంతోస్తే అంత మాట అనేస్తున్నారు. ఈ పరిస్థితి వారికి, వారి పార్టీకి చేటు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గత ప్రభుత్వంలోని పలువురు వైసీపీ నాయకులు ఓ రకంగా ఓడిపోవడానికి వారు ఇష్టారీతిన మాట్లాడిన మాటలూ ఒక కారణంగా చెప్పుకోవచ్చు.

రీసెంట్ గా జరిగిన ఎలక్షన్ లో భారీ విజయం సొంతం చేసుకున్న కూటమి నేతలు అదే దారిని అనుసరిస్తే ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంయమనం పాటిస్తూ, కోపాన్ని, ఆవేశాలను అదుపులో ఉంచుకోకపోతే వారికి, వారి ప్రభుత్వానికి చిక్కులు తప్పవు.‌ ‌టీడీపీ సీనియర్ నేత, ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తన నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన మాటలు దుమారం రేపాయి. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో తమ టీడీపీ నాయకులు, కార్యకర్తలు అణచివేతకు గురయ్యారని ఆక్రోశం ప్రదర్శించారు. నేడు పరిస్థితులు మారాయని, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడాల్సిన రోజులు పోయాయని వెల్లడించారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.

ఆయన మాట్లాడుతూ… “మీరందరూ టీడీపీ బిళ్ళలు పెట్టుకొని ఆఫీసులకు వెళ్ళండి. అధికారులు మీకు కుర్చీ వేసి, టీ ఇచ్చి మరీ… మీ పనులు చేస్తారు. అలా చేయకపోతే అధికారులకు ఎలాంటి గతిపడుతుందో వారే చూస్తారు” అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియో ఇంటర్నెట్ లో దుమారం రేపింది. మరో టీడీపీ సీనియర్ నేత, నర్సీపట్నం ఎమ్మెల్యే అయిన అయ్యన్న పాత్రుడు అధికారులపై విరుచుకుపడ్డారు. స్పీకర్ పదవి రేసులో ఉన్నట్లు చెప్పుకుంటున్న ఈయన మున్సిపల్ అధికారులపై నోరు జారారు. విజయవాడ నుంచి నర్సీపట్నం వస్తున్న క్రమంలో మార్గమధ్యలో కారు నిలిపారు. అక్కడికే మున్సిపల్ అధికారులను పిలిపించుకొని రోడ్లకు సంభందించిన రిపోర్ట్ అడిగారు. రోడ్లు, కాల్వల పరిస్థితి ఏమంత భాగలేదని వారిపై అసభ్యకరమైన పదజాలం ఉపయోగించారు. దీనికి సంబందించిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.

ప్రభుత్వంలోని సీనియర్ నాయకులు, బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వీరు తమ కోపాన్ని అణుచుకోలేక అసభ్య పదజాలంతో నోరు జారితే ఎలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి? తమ ఇతర నాయకులకు, కార్యకర్తలకు మార్గనిర్దేశకంగా ఉండాల్సిన సీనియర్ నాయకులు గాడి తప్పడం ఎంత వరకు సమంజసం? సంయమనం పాటిస్తూ ప్రభుత్వ అధికారులను, ఇతర ముఖ్యమైన వాళ్ళను కలుపుకొని పనులు సాగిస్తేనే ప్రజల్లో పేరు, ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతాయి.

 

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News