Chandrababu : నాడు మెచ్చుకున్న బాబు, ఈనాడు .. నేడు ప్లేటు తిప్పేశారు..!
Qubetvnews - May 6, 2024 / 11:24 AM IST
Chandrababu : ఆయనకు అవసరం అనుకుంటే తప్పును ఒప్పు అని ప్రచారం చేస్తారు.. అవసరం లేదు అనుకుంటే ఒప్పును కూడా తప్పు అని ప్రచారం కల్పించేస్తుంటారు. అదే చంద్రబాబు నైజం అని వైసీపీ పదే పదే ఆరోపిస్తోంది. ఇప్పుడు తాజాగా ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది ల్యాండ్ టైట్లింగ్ చట్టం విషయంలో కూడా చంద్రబాబు ఇలాంటి మాటలే మాట్లాడుతున్నారు. మొన్నటి వరకు ఆయన చేసిన కామెంట్లను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రజలను మెప్పించేందుకు చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా మొత్తం నానా పాట్లు పడుతోంది. అప్పట్లో ఇదే ల్యాండ్ టైట్లింగ్ చట్టం మీద చంద్రబాబు ఓ పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చారు.
ల్యాండ్ టైట్లింగ్ చట్టంతో మీ భూములకు ఎలాంటి హాని జరగదు. మీ భూములు చాలా సేఫ్ గా ఉంటాయి. భూ యజమానులు ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పుకొచ్చారు చంద్రబాబు. అదే ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చేసరికి మాత్రం అది చట్టం కాదు పెద్ద భూతం అన్నట్టు కొత్త రాగం అందుకున్నారు. చంద్రబాబుకు అవసరం అనుకుంటే రాజ్యాంగాన్ని సైతం రద్దు చేసేస్తామంటారేమో అని వైసీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు తలచుకుంటే తిమ్మని బమ్మి అని నమ్మించగలరు. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో.
గతంలో టీడీపీ నేతలు అసెంబ్లీలో మాట్లాడుతూ ల్యాండ్ టైట్లింగ్ చట్టం సూపర్…అలాంటి చట్టం దేశంలో గతంలో రానేలేదు… అలాంటి చట్టాలు ఉంటే ప్రజలకు నిశ్చింత..భూములకు భద్రతా అంటూ టీడీపీ ఎమ్మెల్యే పబ్లిక్ ఎకవుంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కూడా అసెంబ్లీలో అన్నారు. అప్పట్లో ఎల్లో మీడియా కూడా ఈ చట్టం చాలా గొప్పది అంటూ ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు వ్యూహంలో భాగంగా ఈనాడు మీడియా సైతం ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని ఓ భూతం అన్నట్టు చూపిస్తోంది. గతంలో ఇదే ఈనాడు మీడియాలో ల్యాండ్ టైట్లింగ్ చట్టం గొప్పది అంటూ వీడియోలు చేసింది. కానీ తీరా ఇప్పుడు ఆ వీడియోలను డిలీట్ చేసింది. ఆ చట్టం మంచిది కాదు అంటూ చర్చలు పెడుతోంది.
చంద్రబాబు నాయుడు గతంలో చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. చంద్రబాబు నాయుడు అప్పుడు ఒక మాట చెప్పేసి.. ఇప్పుడు మాత్రం మాట మారుస్తున్నారంటూ నిగ్గు తేలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు కోసం ఇప్పుడు అన్నీ మీడియాల్లో ఇలాంటి కథనాలే అల్లుతున్నారు. అంతెందుకు పురంధేశ్వరి కూడా గతంలో ఈ చట్టం మంచిదని చెప్పుకొచ్చారు.
కానీ ఇప్పుడు చంద్రబాబు కోసం సైలెంట్ అయిపోతున్నారు. ఒక చట్టంచుట్టూ ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారంటే వారి తత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవాలంటూ కోరుతున్నారు వైసీపీ నేతలు. దీన్ని బట్టి చంద్రబాబు కేవలం ఓట్ల కోసమే ఈ చట్టం మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారనేది అర్థం అవుతోందని ఏపీ ప్రజలు అంటున్నారు.



