Chandrababu : మోసపూరిత హామీలు ఇస్తున్న చంద్రబాబు.. ప్రజలు నమ్ముతారా..?
Qubetvnews - April 11, 2024 / 06:31 PM IST
Chandrababu : చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చి తర్వాత వాటిని పక్కన పెట్టడంలో ఘనుడు అని వైసీపీ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఎందుకంటే చంద్రబాబు గతంలో కూడా అనేక హామీలు ఇచ్చారు. కానీ వాటిని అమలు చేసిన పాపాన పోలేదని చెబుతోంది. గతంలో 2014 ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు చాలానే హామీలు ఇచ్చారు. మరి వాటిని అమలుచేసి ఉంటే.. ఈ ఎన్నికల్లో వాటి గురించి ఎందుకు చెప్పుకోవట్లేదు అని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఒకవేళ చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేసి ఉంటే కచ్చితంగా వాటి గురించి చెప్పుకునేవారనే అంటున్నారు వైసీపీ.
గతంలో చంద్రబాబు ఉచితాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంకలా అప్పులపాలవుతుందని విమర్శించారు. కానీ ఇప్పుడు అధికారం కోసం అవే ఉచితాలను చంద్రబాబు అండ్ కో ప్రకటిస్తున్నారు. దీన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలని అంటున్నారు. అంటే అధికారం కోసం ఏమైనా చెప్పేస్తారా అని అడుగుతున్నారు. ఇక చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ఇచ్చిన పెన్షన్ కేవలం రూ.వెయ్యి మాత్రమే. ఎన్నికలకు కొన్ని నెలల ముందు దాన్ని రూ.2వేలకు పెంచి ఓట్ల కోసం తాయిలాలు ప్రకటించారు. ఇప్పుడు అదే చంద్రబాబు ఏకంగా నాలుగు వేలు, దివ్యాంగుల పెన్షన్ రూ.6వేలు ఇస్తానని చెప్తే ఎవరైనా నమ్ముతారా అని అడుగుతున్నారు.
ఇక వాలంటీర్ల విషయంలో కూడా చంద్రబాబు ఇలాంటి అబద్దాలే ఆడారు. మొన్నటి వరకు వారిని ఎంతలా తిట్టారో అందరికీ తెలిసిందే. గోనె సంచులు మోసుకునే వారని, ఇంట్లో ఎవరూ లేనప్పుడు వెళ్లి మహిళలను వేధిస్తున్నారని చెప్పారు. కానీ ఇప్పుడు అదే వాలంటీర్లను కొనసాగిస్తానని వారి వేతనం రూ.10వేలకు పెంచుతానని హామీ ఇచ్చాడు. ఈ చంద్రబాబు రాజకీయ అవకాశవాద వైఖరి అందరికీ తెలుసు అని విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు. అంటే ప్రతిపక్షంలో ఉన్నంత కాలం జగన్ ఏం చేసినా వాటిని తిట్టేవారు. అవి మంచి పథకాలు అని చంద్రబాబుకు కూడా తెలుసు.
తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి మాత్రం అవే పథకాలకు ఇంకొంచెం ఎక్కువ ఇస్తానని నమ్మబలుకుతున్నారు. ఆయన ఇదివరకు హామీలు ఇచ్చి అమలు చేయకుండా తమను మోసం చేశారని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.బాబును నమ్మి మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేమని అంటున్నారు.
జగన్ ఏదైనా ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటారని.. అది చిన్నదైనా, పెద్దదైనా జగన్ చెబితే నమ్మగలం అంటున్నారు. ప్రజల్లో బలంగా నమ్మకం కలిగిన నేత జగన్ మాత్రమే అని అంటున్నారు.





