Sharmila : కడప ఎంపీగా షర్మిల.. ఎవరికి నష్టం..?
Qubetvnews - April 1, 2024 / 01:33 PM IST
Sharmila : అందరూ ఊహించినట్టే జరిగింది. వైఎస్ షర్మిల కడప నుంచిఎంపీగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. వైఎస్ ఫ్యామిలీకి కడప అంటే కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైఎస్సార్ కూతురు అనే సింపతీ ఆమెను గెలిపిస్తుందని భావిస్తోంది వైఎస్ షర్మిల. వాస్తవానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అంతా అనుకుంటే.. ఆమె ఎంపీగా పోటీ చేస్తున్నారు.
అయితే ఇదే కడప నుంచి వైసీపీ తరఫున వైఎస్ అశినాశ్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వివేకా హత్య కేసులో ముద్దాయిగా ఉన్నారు. అయితే వివేకా హత్య కేసులో అవినాశ్ అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఆ సింపతీ తనకు వర్కౌట్ అవుతుందని షర్మిల భావిస్తున్నట్టు తెలుస్తోంది. పైగా ఇప్పుడు వివేకా కూతురు సునీత కూడా షర్మిలకు మద్దతు ఇస్తున్నారు.
దాంతో పాటు అటు కడపలో ముస్లిం ఓటర్లు చాలా కీలకం. ఇప్పుడు ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ కు ఓటేయాలని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ గెలిస్తే కచ్చితంగా సీఏఏ అమలు చేస్తుందని ముస్లింలు భయపడుతున్నారు. అందుకే వారంతా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు ఓటేయాలని డిసైడ్ అయ్యారు.
ఇది కూడా షర్మిలకు కలిసి వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు అటు విజయమ్మ కూడా ఇప్పుడు ఎటువైపు నిలుస్తారనే టెన్షన్ అందరిలోనూ ఉంది. మొన్న జగన్ బస్సు యాత్రకు వచ్చి ఆమె మద్దతు తెలిపారు. మరి ఇప్పుడు కూతురు ప్రచారానికి కూడా ఆమె వస్తే మాత్రం కచ్చితంగా వైసీపీకి నష్టమే జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే షర్మిల గెలుపును పక్కన పెడితే.. సొంత సోదరుడిపైనే ఆమె పోటీ చేస్తున్నారనే అంశం మాత్రం వైసీపీకి నష్టం చేకూర్చే అవకాశమే ఉంది. అంతే కాకుండా మెజార్టీ కూడా తగ్గిస్తుందని అంటున్నారు.





