Shivananda reddy : భూ కబ్జా కేసులో టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి.. అసైన్డ్ ల్యాండ్ కాజేసేందుకు ప్లాన్..!
Qubetvnews - April 5, 2024 / 04:23 PM IST
Shivananda reddy : టీడీపీ నేత మాండ్ర శివానంద రెడ్డి ఇప్పుడు భూ కబ్జా కేసులో ఇరుక్కున్నారు. మొన్నటి వరకు ఆయన టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్ చార్జిగా ఉన్నారు. ఈ మాండ్ర శివానందరెడ్డి ఎవరో కాదండోయ్.. గతంలో ఆయన ఉమ్మడి ఏపీలో సీఐడీ సైబర్ క్రైమ్ ఎస్పీగా కూడా పని చేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చి పాలిటిక్స్ లో చేరారు. మొన్నటి వరకు కూడా నంద్యాల పార్లమెంట్ ఇన్‌చార్జిగా కొనసాగారు. ఆయన హైదరాబాద్ బుద్వేల్‌లోని అసైన్డ్ భూములు కాజేసినట్టు సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. బుద్వేల్ లో అసైన్డ్ భూములు చాలానే ఉన్నాయి.
అయితే వీటిని ఆయన కబ్జా చేసేందుకు ప్రయత్నించినట్టు సీపీఎస్ పోలీసులు గుర్తించారు. ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు నంద్యాల జిల్లా ఆళ్లూరుకు ఈ నెల 2వ తేదీన పోలీసులు వెళ్లగా.. అక్కడి నుంచి శివానందరెడ్డి పారిపోయినట్టు పోలీసులు చెబుతున్నారు. దాంతో ఆయన కోసం వెతుకులాడుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి శివానందరెడ్డి కబ్జా చేసేందుకు ప్రయత్నించిన భూములు ఉమ్మడి ఏపీలో బుద్వేల్ పరిసన ప్రాంతాల్లో కొంత మంది ఎస్సీలకు కేటాయించినవే. వాటికి పాస్ బుక్కులను కూడా జారీచేశారు. అయితే వాటిని తన సొంతం చేసుకునేందుకు శివానందరెడ్డి స్కెచ్ వేశారంట.
రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయిన టి.జె.ప్రకాష్, కోనేరు గాందీ, ఎస్.దశరథ రామారావులను రంగంలోకి దింపిన శివానందరెడ్డి.. వారి ద్వారా గేమ్ ఆడినట్టు తెలుస్తోంది. అసైన్డ్ భూములు తీసుకున్న దళితులకు ఏదో నామమాత్రపు రుసుము చెల్లించి వారి నుంచి 26 ఎకరాల భూములను తన కంపెనీల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతోపాటు రాత్రికిరాత్రే అనుమతి జీవోలు తెప్పించుకున్నట్టు సీసీఎస్ పోలీసుల విచారణలో వెల్లడైంది. అసైన్డ్ భూమిగా ఉన్న ఆ ల్యాండ్ ను తన కంపెనీల పేరు మీదకు మార్చుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు.
ఈ విషయాలు పోలీసుల విచారణలో వెళ్లడయ్యాయి. దాంతో వారు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ఈ నెల 2వ తేదీన అళ్లూరుకు వెళ్లగా.. పోలీసుల కళ్లుగప్పి ఆయన పారిపోయినట్టు చెబుతున్నారు పోలీస్ అధికారులు. శివానందరెడ్డి గురించి ఈ విషయం బయటకు రావడంతో.. సామాన్య ప్రజల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది.





