Tdp : మాచర్లలో గొడవలు మరింత పెంచాలని చూస్తున్న టీడీపీ..?
Qubetvnews - May 24, 2024 / 12:32 PM IST
Tdp : మొన్న ఏపీలో పోలింగ్ సందర్భంగా మాచర్ల అంటేనే విధ్వంసక ప్రాంతంగా ముద్ర పడేలా చేశాయి రెండు పార్టీలు కూడా. వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగిన రాక్షస కాండలో ఎంతో మంది గాయాలపాలయ్యారు. వాస్తవానికి ఒక్క మాచర్లలోనే కాకుండా చాలా నియోజకవర్గాల్లో ఇలాగే దాడులు జరిగాయి. దాంతో పోలీసులు ఈ ప్రాంతాల్లో పరిస్థితులను చల్లబరిచేందుకు చాలానే ప్రయత్నాలు చేశారు. ఇప్పటికీ పోలీసులు అక్కడ బలగామలను మోహరించారు. మాచర్లతో పాటు చాలా ప్రాంతాల్లో 144 సెక్షన్ ను విధించారు. అయితే మాచర్లలో జరిగిన గొడవలు దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి.
ఇప్పటికీ అక్కడ రెండు పార్టీల నేతలు, కేడర్ ఉప్పు, నిప్పుగానే ఉన్నాయి. ఇలాంటి సమయంలో పోలీసులు కూడా బందోబస్తు బాగానే చేపడుతున్నారు. అయితే ఇంత భయంకర పరిస్థితుల నడుమ ఇప్పుడు టీడీపీ తీసుకున్న నిర్ణయం మాచర్లలో మరింత విధ్వంసాన్ని రేకెత్తించేలా కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో వైసీపీ నాయకుల దాడిలో గాయపడ్డ టీడీపీ నేతలు, కార్యకర్తలను వారు పరామర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. దేవినేని ఉమా మహేశ్వర్ రావు, వర్ల రామయ్య, అశోక్ బాబు, బోండా ఉమా, జీవీ ఆంజనేయులు, కొల్లు రవీంద్ర, నక్కా ఆనందబాబు పరామర్శించాలని అనుకున్నారు.
వీరంతా కూడా గుంటూరులోని మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి మాచర్లకు వెళ్లాలని అనుకున్నారు. అయితే దీన్నే ఇప్పుడు ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఎందుకంటే మాచర్లలో ఇంకా పరిస్థితులు చక్కబడలేదు. ఇలాంటి సమయంలో వెళ్లి పరామర్శించడం అంటే అక్కడి పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చడమే అంటున్నారు. దీన్ని బట్టి మాచర్లలో రెండు పార్టీల నడుమ మంటలను ఎగదోయడమే అని ఆరోపిస్తున్నారు. ఎంత పోలీసులు పహారా కాస్తున్నా.. అక్కడక్కడా ఇంకా కవ్వింపు చర్యలు సాగుతూనే ఉన్నాయని అంటున్నారు.
ఇలాంటప్పుడు టీడీపీ నేతలు వెళ్లి పరామర్శించి అక్కడ విమర్శలు చేస్తే గొడవలను మరింత పెంచినట్టే అవుతుంది కదా అని అంటున్నారు. ఒకవేళ ఇదే నిర్ణయం వైసీపీ తీసుకుని ఉంటే ఎలా ఉంటుంది.. టీడీపీ నేతల దాడుల్లో వైసీపీ వాళ్లు కూడా గాయపడ్డారు కదా అని గుర్తు చేస్తున్నారు.
నిజంగానే టీడీపీ నేతలకు పరామర్శించాలని ఉంటే ఫోన్ లో పరామర్శలు చేయవచ్చు కదా.. కానీ అలా చేయకుండా గొడవలను మరింత పెంచే విధంగా ఇలా చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ప్రస్తుతానికి టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. లేదంటే ఈ గొడవలు ఈ పాటికి ఉప్పెనలా మారిపోయేవేమో.





