Ys Jagan : జగన్ కు తప్పుడు సలహాలు.. వైసీపీలో జోరుగా చర్చ..
Qubetvnews - July 19, 2024 / 07:37 PM IST
Ys Jagan : మొన్నటి ఎన్నికల్లో వైఎస్ జగన్ వ్యూహాలు చాలా దారుణంగా బెడిసికొట్టాయి. వైసీపీలో చాలా రకాల మార్పులు చేశారు. ఇక్కడి వారిని అక్కడ.. అక్కడి వారిని ఇక్కడకు మార్పులు చేయడంతో ప్రజల్లో కూడా తీవ్రమైన గందరగోళం నెలకొని.. పార్టీని ఘోరంగా ఓడించారు. అయితే జగన్ ఇప్పటి వరకు ఏది చేసినా సరే అది ఆయన సలహాదారులను నమ్మి చేశారనే చర్చ నడుస్తోంది. జగన్ ఇప్పటి వరకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేసినా.. సలహాదారులను కాదని ఆయన ఏమీ చేయట్లేదనే వాదన కూడా ఉంది. అయితే అలాంటి సలహాదారుల వల్లే జగన్ నిండా మునిగారనే అపవాదు కూడా వైసీపీలో ఉంది.
ఎన్నికల ముందు జగన్ కు లేనిపోని దిక్కుమాలిన సలహాలు ఇచ్చి ఆయన్ను నిండా ముంచేశారని అంటున్నారు. వారి సలహాల వల్లే జగన్ ఓడిపోయారని వైసీపీలో చర్చ సాగుతోంది. కాగా ఇప్పుడు వారిని పక్కన పెట్టాలని జోరుగా చర్చ నడుస్తోంది. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని.. పార్టీని మళ్లీ గాడిలో పెట్టాలంటూ కోరుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను కలుసుకోవాలని ముందు నిర్ణయం తీసుకున్నారు. అయితే దీన్ని కొందరు కావాలనే వద్దని చెప్పారంట. గతంలో జగన్ కు సలహాలు ఇచ్చిన వారే.. మళ్లీ వద్దని చెప్పారంట.
ఇప్పుడు అప్పుడే ప్రజల్లోకి వెళ్లొద్దని.. పరిస్థితులు బాగా లేవని చెప్పారంట. దాంతో జగన్ కూడా వెనకడుగు వేసినట్టు చెబుతున్నారు. ఇదే కాకుండా జగన్ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని కూడా అనుకున్నారు. గత ఐదేండ్లు కార్యకర్తలకు దూరంగా ఉండటంతో వారు అసంతృప్తిలో ఉన్నారని.. కాబట్టి వారితో జిల్లాల వారిగా సమావేశాలు నిర్వహించాలని జగన్ భావించారు. అయితే దీనికి కూడా ఓ కీలక సలహాదారు గండి కొట్టారంట. ఇప్పుడు అప్పుడే వద్దని చెప్పడంతో జగన్ ఆగిపోయారంట. ఇలా జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే కీలక సలహాదారులుగా ఉండే కొందరు చెడగొడుతున్నట్టు చెబుతున్నారు.
కాబట్టి జగన్ అర్జెంటుగా వారిని పక్కన పెట్టాలని.. అప్పుడే వైసీపీ బాగుపడుతుందని వైసీపీలో జోరుగా చర్చ నడుస్తోంది. జగన్ అర్జెంటుగా ఈ పని చేయాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు. మరి జగన్ వారిని దూరంగా పెట్టి పార్టీ నిర్మాణంలో కీలకంగా వ్యవహరిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.





