YS Bharathi Reddy : రాళ్ల దాడిపై భారతి రియాక్షన్.. ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..!

Qubetvnews - May 5, 2024 / 10:40 PM IST

YS Bharathi Reddy : రాళ్ల దాడిపై భారతి రియాక్షన్.. ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..!

YS Bharathi Reddy : ఏపీలో ఎన్నికల సమరం సాగుతోంది. ఈ క్రమంలోనే రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు హద్దులు మీరి విమర్శలతో రెచ్చిపోతున్నారు. అటు చంద్రబాబు నాయుడికి నారా భువనేశ్వరి సపోర్టుగా ప్రచారం చేస్తున్నారు. ఇంకోవైపు మంగళగిరిలో నారా లోకేష్ కు బ్రాహ్మణి ప్రచారం చేస్తున్నారు. కానీ వారిద్దరితో పోలిస్తే పులివెందులలో వైఎస్ భారతి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె మొదటిసారి డిజిటల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. క్యూబ్ టీవీ కంటెంట్ హెడ్ శ్రావణితో ఆమె తన మనసులోని మాటలను బయటపెట్టారు. ఆమె ఏం చెప్పారనేది ఇప్పుడు చూద్దాం.

శ్రావణిః ప్రచారంలో పులివెందులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది..

వైఎస్ భారతిః 2019లో జగన్ ప్రతిపక్ష నేతగానే ప్రజల ముందుకు వెళ్లారు. అప్పుడు ప్రజలు ఆదరించారు. ఇప్పుడు ఆయన పాలన ఎలా ఉందో చూసిన తర్వాత ప్రజల ముందుకు వెళ్లాం. జగన్ పాలనకు ప్రజలు ఆనందంగా ఉన్నారు. 85 శాతం మంది ప్రజలు మాకు మద్దతు ఇస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ప్రజలు మా ముందు సమస్యలు చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ప్రచారంలో అలాంటి సమస్యలు చెప్పట్లేదు. జగన్ పాలనలో అవన్నీ తీరాయి.

శ్రావణిః జగన్ పాలనలో దేని గురించి ప్రజలు బాగా మాట్లాడుకుంటున్నారు..?

వైఎస్ భారతిః జగన్ పాలనలో ఎక్కువగా మాట్లాడుకుంటుంది విద్య, వైద్యం గురించే. ఎందుకంటే గతంలో ఈ రెండింటి కోసమే అప్పులు చేసేవారు. కానీ జగన్ ఈ రెండింటినీ ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారు. అందుకే ప్రజలు వీటి గురించి చాలా సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత సొంత ఇండ్లు కట్టించడం గురించి, డ్వాక్రా రుణాల మాఫీ, సున్నా వడ్డీలు ఇవ్వడం, రైతులకు డబ్బులు జమ చేయడం, సున్నా వడ్డీ రుణాల గురించి ఎక్కువగా ప్రజలు ఆనందంగా ఉన్నారు.

శ్రావణిః ఈ ఎన్నికల్లో 175 సీట్లు అంటున్నారు.. సాధ్యమేనా..?

వైఎస్ భారతిః కచ్చితంగా సాధ్యమే. ఎందుకంటే గత ఎన్నికల్లో జగన్ ప్రతిపక్షంలో ఉండి భారీ మెజార్టీ సీట్లు సాధిస్తామని చెప్పారు. చేసి చూపించారు. ఈ సారి జగన్ పాలనను చూపించి మరీఎన్నికలకు వెళ్తున్నారు. కాబట్టి 175 సీట్లు సాధ్యమే.

శ్రావణిః ఓ వైపు కూటమి మరోవైపు దగ్గరి వాళ్లే శత్రువులుగా మారారు కదా.. భయం వేయట్లేదా..?

వైఎస్ భారతిః భయం వాళ్లకు వేస్తుంది కాబట్టే కట్టగట్టుకుని వస్తున్నారు. జగన్ కు భయం లేదు కాబట్టే ఒక్కడే వస్తున్నాడు.

శ్రావణిః ప్రజల్లో ఏ వర్గంలో కూడా జగన్ మీద వ్యతిరేకత లేదంటారా..?

వైఎస్ భారతిః నేను చూసినంత వరకు ఏపీలో లేని వారు, కొన్ని థియరీలు చెప్పుకునే వాళ్లు, అసలు సంక్షమ పథకాల గురించి అవగాహన లేని వాళ్లు కొందరు వ్యతిరేకిస్తున్నారు. కానీ జగన్ ఊరికనే డబ్బులు ఇవ్వట్లేదు. ఆయన పెట్టిన ప్రతి సంక్షేమ పథకం వెనకాల లోతైన ఆలోచన ఉంది. పేదింట్లో పిల్లలు ఇంగ్లిష్ విద్య చదువుకోవాలనే ఉద్దేశంతోనే విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు. అలాగే వైద్యం కోసం డబ్బులు ఇస్తున్నారు. ఈ రెండింటి కోసమే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. దాంతో పాటు వైఎస్సార్ చేయూత లాంటి వాటి వెనకాల కూడా పేదలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఆలోచన ఉంది. వాటిని మెజార్టీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కాబట్టే మద్దతు ఇస్తున్నారు.

శ్రావణిః మేనిఫెస్టోలో మీకు బాగా నచ్చిన స్కీమ్ ఏంటి..?

వైఎస్ భారతిః నాకు బాగా నచ్చింది పేదింటి మహిళల గురించి జగన్ ఆలోచించి పెట్టిన అమ్మవొడి, వైఎస్సార్ చేయూత. పిల్లలు స్కూల్ కు వెళ్లే సమయంలో ఆడవారికి అండగా అమ్మవొడి ఉంటుంది. పిల్లల చదువులు అయిపోయే సమయానికి ఆడవారికి వైఎస్సార్ చేయూత వస్తుంది. ఇలా రెండు రకాలుగా ఆడవారిని జగన్ ఆదుకోవడం బాగా నచ్చింది.

శ్రావణిః ఎన్నో కష్టాలు పడ్డా సరే జగన్ భయపడట్లేదు.. ఆయన గట్స్ ఏంటి..?

వైఎస్ భారతిః జగన్ దేవుడిని బాగా నమ్ముతారు. మన రాతలో ఉంటే ఏదైనా సరే తప్పదు అని అంటారు. దేనికైనా సరే సిద్ధంగా ఉంటారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ లాగా.. మోడీ వస్తేనే మాకు ఏదైనా జరుగుతుందేమో అని అనుకోరు. ఏదైనా సరే సొంతంగానే పోరాడుతారు. ఆయన మనోధైర్యమే ఆయన గట్స్.

శ్రావణిః రాజశేఖర్ రెడ్డి చనిపోయాక జగన్ ఇలా రాటుదేలారా.. అంతకు ముందే ఇలా ఉన్నారా..?

వైఎస్ భారతిః జగన్ మొదటి నుంచే ఇండిపెండెంట్ వ్యక్తి. ఏదైనా సరే ఆయన చేయాలనుకున్నది చేసేదాకా వదలరు. అంతే గానీ ఒకరి మీద ఆధారపడే వ్యక్తి కాదు. సొంతంగానే తాను అనుకున్నది సాధించే తత్వం ఉన్న వ్యక్తి.

శ్రావణిః జగన్ కాంగ్రెస్ ను వ్యతిరేకించి సీఎం అయ్యారు.. ఇప్పుడు అదే పార్టీ ఇక్కడ పాగా వేయాలని చూస్తోంది.. మీకెలా అనిపిస్తోంది..?

వైఎస్ భారతిః కాంగ్రెస్ ఎప్పుడూ కూడా మంచి పద్ధతిలో పోలేదు. రాష్ట్రాన్ని విభజించినప్పుడు గానీ, రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని వేధించినప్పుడు కూడా మంచి పద్ధతిలో పోలేదు. ఇప్పుడు కూడా ఆ పార్టీ వాళ్లు మంచి పద్ధతిలో రావట్లేదనే నాకు అనిపిస్తోంది.

శ్రావణిః జగన్ ను రాళ్లతో కొట్టాలని చంద్రబాబు అంటున్నారు కదా.. ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది..?

వైఎస్ భారతిః అంత వయసులో ఉన్న వ్యక్తి, అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి అయితే అలాంటి మాటలు మాట్లాడొద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో చాలా హుందాగా ఉండాలని జగన్ ఎప్పుడూ చెబుతుంటారు. జగన్ నోటి నుంచి అలాంటి మాటలు ఎన్నడూ వినలేదు.

శ్రావణిః కడపలో జరిగిన అభివృద్ధిపై మీరేమంటారు..?

వైఎస్ భారతిః. కడపలో మాకు చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది. ఇక్కడి ప్రజలకు మంచి చేయాలని జగన్ మొదటి నుంచి అనుకున్నారు. మా మామ తర్వాత జగన్ ఆ బాధ్యతను తీసుకున్నారు. అందుకే కడప బాగా అభివృద్ధి జరిగింది.

శ్రావణిః పులివెందులలో చాలా ఇళ్లలో దేవుని ఫొటోల పక్కన జగన్ ఫొటోలు ఉంటాయంటారు నిజమేనా..?

వైఎస్ భారతిః అది ప్రజలు మాకిచ్చిన స్థానం. మా దృష్టిలో ప్రజలే మాకు దేవుళ్లు. వాళ్ల ప్రేమ, ఆదరణ మాపై ఉండటం అంటే ఆ దేవుని సంకల్పమే.

శ్రావణిః జగన్ ను మళ్లీ గెలిపిస్తే డబ్బులు పంచడం తప్ప అభివృద్ధి ఉండదంటున్నారు కదా..

వైఎస్ భారతిః డబ్బులు పంచుతున్నారని ఎందుకు అనుకోవాలి. సంక్షేమ పథకాలతో ఎంతో మందికి ఆర్థికంగా మంచి స్థాయిని కల్పిస్తున్నారు జగన్. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటున్నారు. కేవలం డబ్బులు పంచడమే కాదు. అభివృద్ధి కూడా ఎంతో జరిగింది. సంక్షేమం మాత్రమే కాదు. అభివృద్ధి కూడా ఎంతో జరిగింది. రాష్ట్రానికి చాలానే కంపెనీలు వచ్చాయి. గ్రామాల్లో అభివృద్ధి కూడా మీకు కనిపిస్తోంది. జగన్ అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నారు.

శ్రావణిః విద్య, వైద్యం, వ్యవసాయం మాత్రమే జగన్ కు ముఖ్యమా..?

వైఎస్ భారతిః ఈ రాష్ట్రంలో దేనిపై డబ్బులు ఖర్చు పెట్టాలో జగన్ కు బాగా తెలుసు. ఆ మూడింటిని బలోపేతం చేస్తే ఆటోమేటిక్ గా ప్రజలు ఆర్థికంగా మెరుగుపడుతారనేది జగన్ ఆలోచన. డబ్బులు ఎక్కడ పెట్టాలో జగన్ కు బాగా తెలుసనేది నా నమ్మకం.

శ్రావణిః జగన్ కు ఏదైనా సలహాలు, సూచనలు ఇస్తారా..?

వైఎస్ భారతిః నేను ఆయనకు సలహాలు ఏమీ ఇవ్వను. నాకు ఏదైనా నచ్చితే అది మాత్రమే చెప్తాను.

శ్రావణిః పిల్లలకు ఇంగ్లిష్ విద్యను ఎందుకు పెట్టారని అంటే ఏం చెప్తారు..?

వైఎస్ భారతిః మన పిల్లలకు ఇంగ్లిష్ విద్యనే నేర్పిస్తున్నాం కదా. మన పిల్లల్లాగా పేదింటి పిల్లలు కూడా ఇంగ్లిష్ విద్యను చదువుకోవాలన్నదే జగన్ ఆలోచన. ఎందుకంటే ఒక మెడిసిన్, లా, ఇంజనీరింగ్ లాంటివి చదవాలంటే ఇంగ్లిష్ మాత్రమే రావాలి. కాబట్టి పిల్లలకు చిన్నప్పటి నుంచే ఇంగ్లిష్‌ విద్య నేర్పించాలని జగన్ ఆలోచన.

శ్రావణిః గోశాల ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు..?

వైఎస్ భారతిః గోశాలలో మన జాతి ఆవులే ఉంటాయి. మేం విజయవాడలో ఉన్నప్పుడు పాలు బయట నుంచి తెచ్చుకుంటే క్వాలిటీగా ఉంటాయో లేదో అనే అనుమానంతోనే ఆవులను పెంచుకుంటున్నాం. గోశాలలో ఉండే ఆవులకు మంచి పేర్లు కూడా పెట్టాం. వారానికి ఒకసారి నేను ఇప్పటికీ గోశాలకు వెళ్తుంటాను.

శ్రావణిః మీరు ఖాళీగా ఉన్న సమయంలో ఏం చేస్తుంటారు..?

వైఎస్ భారతిః నేను చాలా వరకు బిజీగానే ఉంటాను. కానీ ఖాళీగా ఎప్పుడైనా ఉంటే మాత్రం కచ్చితంగా పుస్తకాలు చదువుతుంటాను.

శ్రావణిః జగన్ మీద రాళ్ల దాడి జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు..?

వైఎస్ భారతిః విజయవాడలో ర్యాలీ జరుగుతున్నప్పుడు మా ఇంటి ముందు నుంచే వెళ్లారు. ఆయనకు సెండాఫ్ ఇచ్చి నేను కారులో వేరే దగ్గరకు వెళ్తున్నాను. అప్పుడు మాకూతురుతో మాట్లాడుతుండగా జగన్ పై దాడి జరిగిందని తెలిసింది. నేను వెంటనే రిటర్న్ అయ్యాను. కానీ జగన్ తన బస్సుయాత్రను కంటిన్యూ చేస్తున్నారని తెలిసింది. అయిపోయాక క్యాంప్ కు వెళ్లి కలిశాను.

శ్రావణిః రాళ్లదాడి డ్రామా అని ప్రతిపక్షాలు అంటున్నాయి కదా.. మీరేమంటారు..?

వైఎస్ భారతిః రాళ్లదాడి జగన్ కావాలని చేయించుకుంటే దెబ్బ తగిలిన వెంటనే చేతిని అడ్డం పెట్టుకుని హాస్పిటల్ కు వెళ్లి హంగామా చేసేవారు కదా. కానీ ఆయన అలాచేయలేదు. అక్కడే చిన్న ట్రీట్ మెంట్ తీసుకుని మళ్లీ బస్సుఎక్కారు. వీలైతే క్యాంప్ లోనే కుట్లు వేయమని చెప్పారు. అంతేగానీ దాన్ని పెద్ద హంగామా చేయలేదు. అప్పుడు కత్తిదాడి జరిగినప్పుడు కూడా ఎయిర్ పోర్టులోనే షర్టు మార్చుకుని సింపుల్ గా వచ్చేశారు. వేలమందిలో ఒక రాయిదాడి ఎవరైనా చేయించుకుంటారా.. ఎందుకంటే ఎక్కడి నుంచో రాయి విసిరితో అది ఎక్కడ తగులుతుందో తెలియదు. అలాంటి ప్రమాదకరమైన దాడిని ఎవరూ చేయించుకోరు కదా. కావాలంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ ను దాడి చేయించుకోమనండి వారికి సింపతీ వస్తుంది. కానీ జగన్ సింపతీ కోసం డ్రామాలు ఆడరు.స

శ్రావణిః జగన్ ను పాతాళానికి తొక్కేయడమే నా లక్ష్యం అని పవన్ అంటున్నారు.. మీరేం చెబుతారు..?

వైఎస్ భారతిః పవన్ కల్యాణ్‌ స్పీచ్ లు నేను చూడను. చంద్రబాబును సీఎం చేయడమే ఆయన లక్ష్యం కావచ్చు. ఆయనకు నేను ఏం చెప్పదలచుకోవట్లేదు.

శ్రావణిః వైఎస్ భారతిని భవిష్యత్ లో రాజకీయాల్లో చూడొచ్చా.. ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారా..?

వైఎస్ భారతిః నాకు వ్యక్తిగతంగా ప్రైవేట్ లైఫ్‌ అంటేనే ఇష్టం. పబ్లిక్ లైఫ్ నాకు నచ్చదు. అందుకే నేను ఇప్పటి వరకు రాజకీయాల్లో పోటీ చేయలేదు. భవిష్యత్ లో కూడా నేను రాజకీయాల్లో ఎక్కడి నుంచి కూడా పోటీ చేయను.

శ్రావణిః జగన్ కు బాగా ఇష్టమైన ఆహారం ఏంటి..?

వైఎస్ భారతిః జగన్ ఏదైనా సరే మితంగానే తింటారు. ఏదీకూడా అతిగా తినరు. ఆయనకు ఇది తినాలి, అది తినొద్దు అని ఏమీ ఉండదు. ఏది నచ్చితే అది తెప్పించుకుని తినేస్తుంటారు. కాకపోతే ఏదైనా మితంగానే తినడం ఆయనకు అలవాటు.

శ్రావణిః ఈ రోజుల్లో ట్రోలింగ్ వల్ల ఒక మహిళ ప్రాణమే పోయింది.. అసలు ట్రోలింగ్ మీద మీ అభిప్రాయం ఏంటి..?

వైఎస్ భారతిః ఆడవారికి ఎక్కడైనా సరే గౌరవం ఇవ్వాలి. అది ఇంట్లో అయినా సోషల్ మీడియాలో అయినా సరే. కానీ ఇలా ఆడవారిని అవమానించే విధంగా చేస్తున్న ట్రోలింగ్ ను కొందరు పార్టీ అధినేతలే ప్రోత్సహించడం చాలా తప్పు. ఆడవారు కూడా ట్రోలింగ్ ను భరించాల్సిన అవసరం లేదు. కచ్చితంగా దానిపై యాక్షన్ తీసుకోవాలి. ఏం జరిగినా సరే మనోధైర్యం కోల్పోవద్దు.

శ్రావణిః ఈ సారి జగన్ కు ఎంత మెజార్టీ వస్తుంది..?

వైఎస్ భారతిః కచ్చితంగా గత ఎన్నికల కంటే ఎక్కువగానే వస్తుంది. ఈ సారి లక్ష మెజార్టీ దాటుతుందని నేను నమ్ముతున్నాను.

శ్రావణిః చివరగా జగన్ కు ఎందుకు ఓటేయాలంటే ఏం చెబుతారు..?

వైఎస్ భారతిః జగన్ ది నమ్మదగిన క్యారెక్టర్. ఒక మాట ఇస్తే దాన్ని నెరవేర్చేతత్వం ఉండే వ్యక్తి. అందుకే ఆయన ఎన్నికల్లో నెరవేర్చగలిగే హామీలను ఇస్తున్నారు. వాటిని కచ్చితంగా నెరవేరుస్తున్నారు. అంతే కాకుండా చాలా మంచి విజన్ ఉన్న వ్యక్తి. ఈ రాష్ట్రానికి ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు. 25 నుంచి 30 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రానికి ఏం కావాలో ఆ ముందు చూపుతోనే ఆయన పనులు చేస్తున్నారు. అందుకే ఆయనకు ఓటేయాలని నేను చెబుతాను.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News