Ys Jagan : టీడీపీ, బీజేపీ, జనసేన హనీమూన్ నడుస్తోంది.. జగన్ కీలక వ్యాఖ్యలు..
Qubetvnews - June 13, 2024 / 04:50 PM IST
Ys Jagan : మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ పెద్దగా మాట్లాడట్లేదు. అయితే తాజాగా ఆయన గురువారం తన ఆఫీసులో ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరెన్ని చేసినా రాష్ట్రంలో వైసీపీ పాలనలో చేసిన మంచిని ప్రజలు మర్చిపోయేలా చేయలేరని అన్నారు. ఇప్పుడు ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ హనీమూన్ నడుస్తోందని.. వారికి కాస్త సమయం ఇద్దామని చెప్పారు. ఇప్పటికీ 40 శాతం ప్రజలు మనతోనే ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఎన్నికలు శకుని పాచికలలాగా అనిపిస్తున్నాయని.. దేశ వ్యాప్తంగా ఈవీఎంలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు జగన్.
వైసీపీ పాలనలో జరిగినంత మంచి గత చరిత్రలో ఎన్నడూ జరగలేదని చెప్పారు. చెప్పినట్టుగా మేనిఫెస్టోను 99 శాతం అమలు చేసిన ఏకైక పార్టీ వైసీపీ అని తెలిపారు. గతంలో ఏపార్టీ కూడా ఇలా అమలు చేయలేదని స్పష్టం చేశారు. ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా ప్రజల ఖాతాల్లోకి నేరుగా రూ.2.7 లక్షల కోట్లు జమ చేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, సుపరిపాలన, సామాజిక సాధికారత, మహిళా సాధికారత లాంటి ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. కానీ అదంతా ఏమైందో అర్థం కావట్లేదు. కానీ ఇప్పటికీ మనం చేసిన మంచి ప్రజల్లో ఉంది.
మనం అందించిన సంక్షేమ పథకాలు అన్నీ ప్రజలు గుర్తుంచుకున్నారు. కాబట్టి మనం పైకి లేవడం తథ్యం. కాకపోతే కొంత సమయం పడుతుంది. ఇప్పుడు అసెంబ్లీలో మనకు సంఖ్య తక్కువ ఉంది. కాబట్టి నోరు విప్పడానికి ఎక్కువ అవకాశం ఉండకపోవచ్చు. కానీ మండలిలో మాత్రం మనకు సంఖ్య ఎక్కువ ఉంది. కాబట్టి అక్కడ టీడీపీని గట్టిగా నిలదీయాలి అంటూ ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చారు జగన్. ఐదేండ్లు చూస్తుండగానే గడిచిపోతాయని.. కాబట్టి ఈ సమయంలో మనం ఎంత గట్టిగా పోరాడితే మళ్లీ అంత బలంగా పైకి లేస్తానమి చెప్పుకొచ్చారు వైసీపీ అధినేత.
రాష్ట్రంలో టీడీపీకి ఎంపీ సీట్లు బాగానే వచ్చాయి. అటు కేంద్రంలో బీజేపీకి 240 సీట్లు వస్తే.. టీడీపీ మద్దతుతోనే అధికారంలోకి వచ్చింది. కానీ ఇలాంటి సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు అడగకపోవడం అన్యాయం. ఇప్పుడు కాకపోతే ఇంకా ఎప్పుడు అడుగుతారు.. కాబట్టి ఆయన్ను ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు అని విమర్శించారు జగన్. అసెంబ్లలో మనకు ప్రతిపక్ష హోదా ఇస్తారో లేదో తెలియదు.
ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఓటు వేయలేదనే కారణంతో మనుషులపై దాడులు చేస్తున్నారు. అలాంటిది మనకు ప్రతిపక్ష హోదా ఇస్తారనేది అనుమానమే. గతంలో 14 నెలలు పాదయాత్ర చేశాను. ఆ వయసు, సత్తువ నాకు ఇంకా ఉన్నాయి. ఆ సమయం వచ్చే వరకు మీరు మీ పాత్ర పోషించాలి. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలు మరింత ముమ్మరం అవుతాయని చెప్పారు జగన్. ఇక టీడీపీ శ్రేణుల దాడుల్లో గాయపడ్డ వైసీపీ కార్యకర్తలను త్వరలోనే పరామర్శించడానికి కూడా జగన్ సమ్మతి తెలిపారు. త్వరలోనే ఆ కార్యక్రమం ఉండే అవకాశం ఉంది.





