Ap Bjp : బీజేపీకి పవన్ కల్యాణ్ కనిపించట్లేదా.. ఎందుకీ పక్షపాతం..!
Qubetvnews - March 23, 2024 / 01:50 PM IST
Ap Bjp : రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీల నేతలను ఎవరైనా టార్గెట్ చేస్తుంటారు. అందులోనూ నేతల ఆర్థిక వృద్ధిని దెబ్బ కొట్టేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా ఆ నేతల వ్యాపారాలను కూడా ఆక్షేపించడం గతంలో మనం అనేకం చూశాం. ఇప్పుడు బీజేపీ కూడా ఇలాంటి పనే చేస్తోంది. బీజేపీకి ఇప్పుడు సౌత్ ఇండియాలో పెద్దగా పట్టు లేకుండా పోతోంది. మొన్నటి వరకు అధికారంలో ఉన్న కర్నాటకలో కూడా ఇప్పుడు ప్రతిపక్షంలోనే ఉంది. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను దెబ్బ తీసేందుకు చాలానే ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ పార్టీ.
ఇందులో భాగంగా కర్ణాటక స్టార్ హీరో శివరాజ్ కుమార్ కు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. శివరాజ్ కుమార్ సినిమాల ప్రచారాలు ఆపేయాలంటూ, ఆయన సినిమా పోస్టర్లు, హోర్డింగులు కనిపించకుండా చేయాలంటూ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది కర్నాటక బీజేపీ. ఎందుకంటే శివరాజ్ కుమార్ భార్య ఇప్పుడు శివమొగ్గలో ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. అందుకే ఇప్పుడు ఆయన మీద బీజేపీ ఇలాంటి ఫిర్యాదులు చేస్తోంది. ఎందుకంటే శివరాజ్ కుమార్ ఒక పెద్ద స్టార్ హీరో. ఆయన ప్రజలను ప్రభావితం చేయగలరు. పైగా ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి ఆయన ప్రజలను ప్రభావితం చేసి కాంగ్రెస్ కు ఓటేసేలా చేయొద్దనే ఉద్దేశంతో ఆయన మీద బీజేపీ ఇలాంటి ఫిర్యాదు చేసింది. మరి ఇప్పుడు ఇదే బీజేపీకి ఏపీలో పవన్ కల్యాణ్ ఎందుకు కనిపించట్లేదని అంటున్నారు వైసీపీ నేతలు. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో కూడా ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. కర్నాటకలో శివరాజ్ కుమార్ పోటీ చేయకున్నా ఆయన మీద ఫిర్యాదులు చేసినప్పుడు.. పవన్ కల్యాణ్ నేరుగా పోటీ చేస్తున్నా సరే ఎందుకు ఆయన మీద ఫిర్యాదులు చేయట్లేదని అడుగుతున్నారు. పైగా పవన్ కల్యాణ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పొలిటికల్ టచ్ ఇస్తున్నారు.
అందులో ఆయన డైలాగులు ఆయన రాజకీయ భవిష్యత్ ను ఉద్దేశించి ఉన్నాయి. గాజు గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుతుందనే డైలాగ్ ఆయన పార్టీని ఉద్దేశించి చేశాడని అంటున్నారు. ఇలా సినిమాలను రాజకీయ జీవితం కోసం పవన్ కల్యాణ్ వాడుకుంటున్నా సరే ఆయన మీద మాత్రం బీజేపీ ఫిర్యాదు చేయట్లేదు.
ఎందుకంటే ఇప్పుడు ఏపీలో పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. కాబట్టి ఫిర్యాదు చేయకపోవచ్చు. అవకాశాన్ని బట్టి ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బీజేపీకి అలవాటే అని అంటున్నారు వైసీపీ నేతలు. ఇలా పవన్ కల్యాణ్ కు ఒక విధంగా, శివరాజ్ కుమార్ కు ఒక విధంగా విధానాలు పాటించడం ఏంటని మండిపడుతున్నారు.




