Chandrababu : చంద్రబాబులో గణనీయమైన మార్పు.. ఇమేజ్ పెంచుతోందా..?
Qubetvnews - October 25, 2024 / 01:08 PM IST
Chandrababu : గతంలో ఉన్న చంద్రబాబు వేరు.. ఇప్పుడు మనం చూస్తున్న చంద్రబాబు వేరు. ఇద్దరికీ చాలా తేడా ఉందని అంటున్నారు ఆయన సన్నిహితులు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చాలా విషయాల్లో మార్పును చూపిస్తున్నారు. ఆయన సీఎం అన్న అహం ఏ మాత్రం చూపించట్లేదు. తాను తగ్గి మరీ తన వాళ్లకు గౌరవం ఇస్తున్నారు. ఇదే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబును మించిన యోధుడు లేడు అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు చంద్రబాబు మాత్రం.. తన వాళ్ల వల్లే తనకు ఇదంతా అన్నట్టు మాట్లాడుతున్నారు.
దీనికి కారణం ఆయన జైలు జీవితం అంటున్నారు. చంద్రబాబు జైలులో గడిపి వచ్చిన తర్వాత ఆయనలో మానవతా దృక్పథం బాగా పెరిగినట్టు చెబుతున్నారు. ఆయన మనుషులకు ఇచ్చే విలువ బాగా పెరిగిందని.. తన వాళ్ల కోసం ఎంత తగ్గడానికి అయినా సిద్ధపడే నైజం ఆయన అలవాటు చేసుకున్నట్టు చెబుతున్నారు. ఒకప్పుడు తాను డిసైడ్ చేసిన పదవులను తీసుకోవాలి అనేలా చంద్రబాబు ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం సదరు నేతలను పిలిచి మాట్లాడి బుజ్జగించి మరీ పదవుల కేటాయింపులు చేస్తున్నారు.
పార్టీ కోసం కష్టపడేవారికి మాత్రమే అవకాశాలు ఇస్తున్నారు. అంతే తప్ప డబ్బు, పలుకుబడి ఉన్న వారికి ఇవ్వట్లేదు. ఇదే చంద్రబాబులో మార్పును చూపిస్తోంది. తనకు ఆపదలో అండగా ఉన్న వారిని గుర్తించి మరీ సాయం చేస్తున్నారు. పార్టీలో చిన్న స్థాయిలో ఉన్న వారికి కూడా గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నారు. స్నేహం విషయానికి వస్తే అందరినీ కలుపుకునిపోయేలా ప్రవర్తిస్తున్నారు. పవన్ కల్యాణ్ తో ఆయన వ్యవహరించే తీరు ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ఇలా చంద్రబాబు అన్ని విషయాల్లో మనుషులతో ప్రవర్తించే తీరులో మార్పును చూపిస్తున్నారు. అదే ఆయనకు ఇప్పుడు ఇమేజ్ ను పెంచుతోందని అంటున్నారు. ఒక మనిషిలో అహం పెరిగితే అతినిపై సొంత వాళ్లలో కూడా వ్యతిరేకత వస్తుంది. కానీ మానవత్వం చూపిస్తే శత్రువులు కూడా మెచ్చుకోకుండా ఉండరు.
ఇప్పుడు చంద్రబాబు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. జగన్ ను విమర్శించాలన్నా సరే గౌరవంగానే మాట్లాడుతున్నారు తప్ప.. ఇంకో పదజాలం మాత్రం వాడట్లేదు. చాలా సున్నితంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా జీవిత చరమాంక దశలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు ఆయన అనుభవాన్ని, ఆయన హుందాతనాన్ని చూపిస్తోంది.





