Dr Botsa Jhansi Lakshmi : సూపర్ సిక్స్ అంటున్న కూటమి డక్ అవుట్ ఖాయం : బొత్స ఝాన్సీ
Qubetvnews - May 10, 2024 / 09:47 AM IST
Dr Botsa Jhansi Lakshmi :
చంద్రబాబు హయాంలో ఎటువంటి సంక్షేమ పథకమైనా అందాలంటే జన్మభూమి కమిటీలకు చేయి తడపాల్సి వచ్చేదని, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా నేరుగా గడప ముంగిటికే అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఇది జగనన్న మార్కు పాలన అని, అందుకనే జగనన్న ను మరోసారి సీఎం చేసుకోవాలని విశాఖపట్నం పార్లమెంట్ వైకాపా అభ్యర్థి బొత్స ఝాన్సీ విజ్ఞప్తి చేశారు. ప్రజలను మభ్య పెట్టడానికి సూపర్ సిక్స్ అంటూ వస్తున్న కూటమిని ప్రజలు డక్ అవుట్ చేస్తారని ఆమె అన్నారు.
ప్రచారంలో భాగంగా గంగవరం పోర్టు నుంచి గాజువాక బీసీ రోడ్డు వరకు సుమారు నాలుగు గంటల పాటు రోడ్ షో ప్రచారపు హోరెక్కించారు. విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి బొత్స,ఝాన్సీ, గాజువాక అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ ఓపెన్ టాప్ జీప్ లో ఈ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ తమకు ఓటు వేయమని అభ్యర్థించారు. అనేక మంది యువకులతో పాటు, యువతులు కూడా స్వయంగా బైక్ నడుపుతూ వైయస్సార్సీపీకి మద్దతుగా సందడి చేశారు. ఈ ప్రాంత వీధులన్నీ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలనే నినాదాలు మిన్నంటాయి.
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తూ, అన్ని వర్గాల పురోభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ రోడ్ షో నిర్వహించారు. గంగవరం, గాజువాక ఇండస్ట్రియల్ ఏరియా, యాతపాలెం, బాపూజీ విద్యాలయం, ఆర్ హెచ్ కాలనీ, అశోక్ నగర్, ప్రియదర్శిని కాలనీ, వికాస్ నగర్, భవాని నగర్, బానోజీ తోట, కాకతీయ ఐటిఐ ఆర్చ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ముస్లింల ప్రయోజనాలు కాపాడటంతో పాటు, హక్కులు సంక్షేమాన్ని పరిరక్షించే వారికే ఎన్నికల్లో మద్దతు పలకాలని గాజువాక ప్రాంత ముస్లిం పెద్దలు తీర్మానించారు. గాజువాక ప్రాంతంలో జరిగిన ముస్లింల ఆత్మీయ సమావేశంలో పలువురు ముస్లిం మైనార్టీల పెద్దలు పాల్గొని ప్రసంగించారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తే, వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అన్ని సంక్షేమ పథకాలను గడపగడపకు అందించడమే కాకుండా, కులం, మతము,పార్టీలు అని చూడకుండా అర్హులైన అందరికీ అందించారని అందుకనే ఆయనకు అండగా నిలవాలని నాయకులు పిలుపునిచ్చారు. రిజర్వేషన్లకు ఎసరు పెడుతున్న పార్టీలకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని వారు పేర్కొన్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తానని, సమగ్రంగా అభివృద్ధి చేస్తానని ప్రకటించిన జగన్ మోహన్ రెడ్డికి ప్రజలందరూ మద్దతు పలకాలని, ఆయన ప్రతినిధులుగా ఎన్నికలలో పోటీ చేస్తున్న తమకు ఓటు వేసి ఆశీర్వదించాలని ఆమె అభ్యర్థించారు. మేనిఫెస్టో లో పొందు పరచిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కిందని, రాబోయే రోజుల్లో కూడా మేనిఫెస్టోలోని అన్ని హామీలను అమలు చేసి తీరుతామని జగన్ గారు ధీమాగా హామీ ఇస్తున్నారు. వైజాగ్ ను పరిపాలన రాజధానిగా చేయడంతో పాటు అన్ని ప్రాంతాల అభివృద్దికి జగన్ మోహన్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు. అందుకే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్ మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని, తనను ఎంపీగా గెలిపించాలని బొత్స ఝాన్సీ విజ్ఞప్తి చేశారు.


