Prashanth Kishore : పీకే పలుకుల్లో నిజమెంత.. అవన్నీ నిజం కాలేదెందుకు..?

Qubetvnews - May 22, 2024 / 01:09 PM IST

Prashanth Kishore : పీకే పలుకుల్లో నిజమెంత.. అవన్నీ నిజం కాలేదెందుకు..?

Prashanth Kishore : దేశ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ అంటే తెలియని వారు ఉండరు. అంతగా ఆయన ఒకప్పుడు ప్రభావం చూపించారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఇప్పుడు ఆయన కాలం చెల్లిన నేతగా మారిపోయారు. ఒకప్పుడు బీజేపీని కేంద్రంలో గెలిపించడంలో పాత్ర పోషించిన ఆయన.. తర్వాత బెంగాల్ లో మమతా బెనర్జీ కోసం, ఆ తర్వాత ఏపీలో జగన్ కోసం కూడా పని చేశారు. అయితే అనేక రాజకీయ కారణాల వల్ల 2021 నుంచి తాను వ్యూహకర్తగా ఉండనని ప్రతిన బూని అప్పటి నుంచి ఐ ప్యాక్ నుంచి తప్పుకున్నారు. అయితే ఇందుకు వేరే కారణాలు ఉన్నాయి.

ఆయన రాజకీయంగా ఎదగాలనుకున్నారు. అందుకే బీహార్ లో ముందుగా నితీష్ సరసన చేరి కీలక నేతగా మారిపోయారు. కానీ నితీష్ తో పడకపోవడంతో సొంతంగా పార్టీ స్థాపించి పాదయాత్ర చేశారు. కానీ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోవడంతో అప్పటి నుంచి ఎవరు ప్యాకేజీ ఇస్తే వారికి వంత పాడుతుండటం ఆయనకు అలవాటు అయిందనేది ప్రతిపక్షాలు చెబుతున్న మాట. ఇందులో భాగంగానే ఎవరు కాస్త ఎక్కువ ప్యాకేజీ ఇస్తే ఆ పార్టీ గెలుస్తుందని వంత పాడటం ఆయనకు అలవాటు అయిందనే ఆరోపనలు వినిపిస్తున్నాయి. ఇక చాలా రోజులుగా ఆయన ఇలాగే మాట్లాడుతున్నారు.

అయితే ఆయన ఈ మధ్య చేస్తున్న ప్రకటనలు అన్నీ తప్పే అవుతున్నాయి. ఒక్కటి కూడా నిజం కావట్లేదు. ఆ మధ్య రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ఇలాంటి కామెంట్లే చేశారు. కానీ ఒక్కటి కూడా నిజం కాలేదు. తెలంగాణలో బీఆర్ ఎస్ గెలుస్తుందని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అటు రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ గెలుస్తుందన్నాడు. కానీ ఆ రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. మిజోరాంలో కూడా అలాగే జరిగింది. ఇలా ప్రతిసారి తప్పుడు ప్రకటనలు చేస్తున్నట్టే ఇప్పుడు ఏపీలో కూడా టీడీపీ కూటమి గెలుస్తుందని ఆయన చెబుతున్నారు.

దాంతో వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ తీసుకుని పీకే ఇలా మాట్లాడుతున్నాడని అంటున్నారు. ఒకప్పుడు పీకే వద్ద బలమైన టీమ్ ఉంది కాబట్టి గ్రౌండ్ లెవల్లో ఆయన సర్వేలు చేసుకుని ఫలితాలు చెప్పేవారు. అందువల్ల అవి దాదాపు నిజం అయ్యేవి.

కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. ఆయన వద్ద ఎలాంటి టీమ్ లేదు. పైగా ఏదో ఇంతకు ముందు వ్యూహకర్తగా చేశాడు కాబట్టి ఆ అనుభవంతో ఏదో ఒక పార్టీకి వత్తాసు పలుకుతున్నాడు తప్ప ఆయన మాటలకు ఒకప్పుడు ఉన్న విలువ ఇప్పుడు లేదని చెబుతున్నారు. ఆయన మాటలు అన్నీ నిజమే అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎందుకు ఫెయిల్ అవుతాయని అడుగుతున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News