Raghu rama krishnam raju : ఆర్ఆర్ఆర్ దింపుడుకళ్లెం ఆశలు.. సీటిస్తారా.. చీటి చించేస్తారా..?

Qubetvnews - April 4, 2024 / 11:36 AM IST

Raghu rama krishnam raju : ఆర్ఆర్ఆర్ దింపుడుకళ్లెం ఆశలు.. సీటిస్తారా.. చీటి చించేస్తారా..?

Raghu rama krishnam raju : రఘురామ కృష్ణం రాజు ఆశలు ఇంకా చావట్లేదు. కట్టతెగి చెరువులో నీళ్లు అన్ని వెళ్లిపోయాక.. కట్ట వేస్తే ఏంటి లాభం.. ఇప్పుడు రఘురామ కూడా అలాంటి పనే చేస్తున్నారు. ఇప్పుడు ఏపీలో ఉన్న అన్ని పార్టీల నుంచి అభ్యర్థులు దాదాపు పూర్తిగా ఖరారు అయిపోయారు. అయినా సరే నామినేషన్ సమయానికి ఒకటో రెండో మార్పులు ఉంటే ఉండొచ్చు. కానీ ఇప్పుడు కూటమిలో అన్ని పార్టీల నుంచి చాలా పోరాటాలు చేసిన తర్వాతనే టికెట్లు దక్కించుకున్న వారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పక్కకు తప్పుకోమంటే ఒక్కరు కూడా తప్పుకునే పరిస్థితి ఉండదని అందరికీ తెలిసిందే.

అయినా సరే రఘురామ ఆశలు మాత్రం చావట్లేదు. కచ్చితంగా తాను ఈ ఎన్నికల్లో పోటీచేస్తానంటూ చెబుతున్నారు. అయితే ఇక్కడే ఆయన ఓ ట్విస్ట్ ఇస్తున్నారు. ఇంతకీ ఏ పార్టీనుంచి పోటీ చేస్తారో తెలియదంట. ఎంపీగా పోటీ చేస్తారో లేక ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో కూడా తెలియదంటున్నారు. ఇంతకీ ఈ ఊక దంపుడు మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్థం కావట్లేదు. వాస్తవానికి ఆయన ముందు నుంచి నర్సాపురం ఎంపీగానే పోటీ చేస్తానంటూ ప్రకటించుకున్నాడు. కూటమిలో ఏ పార్టీకి నర్సాపురం టికెట్ వచ్చినా సరే.. తానే పోటీ చేస్తానని చెప్పుకున్నాడు.

తీరా బీజేపీ నుంచి నర్సాపురం టికెట్ ను శ్రీనివాసరాజుకు ఇచ్చారు. దాంతో ఇప్పుడు రఘురామ నర్సాపురం ఆశలు గల్లంతు అయ్యాయి. దాంతో ఇప్పుడు మరో రాగం ఎత్తుకుంటున్నాడు. ఎమ్మెల్యేగానో, ఎంపీగానో ఏ పార్టీ నుంచో కూడా తెలియదని.. కచ్చితంగా పోటీ మాత్రం చేస్తానంటున్నాడు. ఇన్ని రోజులు వ్యక్తిగతంగా చంద్రబాబును పొగుడుతూ వచ్చాడు. చంద్రబాబు తనకు న్యాయం చేస్తాడని మాత్రం చెప్పుకున్నాడు. అంతే గానీ.. చంద్రబాబు పార్టీలో మాత్రం చేరలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు కూడా రఘురామ ఆశలపై నీళ్లు కుమ్మరిస్తున్నాడని ఆయనకు అర్థం అయింది.

అందుకే ఇప్పుడు చంద్రబాబు పేరు ఎత్తట్లేదు. పైగా ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో కూడా తనకు తెలియదని చెబుతున్నాడంటే చంద్రబాబు నుంచి కూడా సానుకూల స్పందన రావట్లేదని ఆయనకు అర్థం అయిపోయింది. దాంతో ఇప్పుడు మూడు పార్టీల నేతలను.. నాకు టికెట్ ఇవ్వండి మహాప్రభో అంటూ వేడుకుంటున్నాడని అంటున్నారు.

కానీ రఘురామకు టికెట్ ఇచ్చేందుకు మాత్రం ఎవరూ ముందుకు రావట్లేదని పరిస్థితులను బట్టి అర్థం అవుతోంది. ఇన్ని రోజులు బీజేపీని నమ్ముకుంటే.. అందులోనూ టికెట్ రాలేదు. ఇటు కూటమి పార్టీలో ఎవరూ దగ్గరకు చేరనివ్వట్లేదు. కాబట్టి రఘురామకు ఈ ఎన్నికల్లో టికెట్ మాత్రం డౌటే అంటున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News