Tdp : టీడీపీ నేతల కోరికలు.. చంద్రబాబుకు కొత్త తలనొప్పులు
Qubetvnews - July 19, 2024 / 07:40 PM IST
Tdp : చంద్రబాబు నాయుడు ఈ సారి కూటమిలో సీఎంగా ఉన్నారు. గతంలో టీడీపీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి అప్పుడు కథ వేరే ఉండేది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి చంద్రబాబు మూడు పార్టీలను కలుపుకుని పోవాల్సి ఉంటుంది. అదే సమయంలో గతంలో వైసీపీ చేసిన పొరపాట్లను, టీడీపీ చేసిన పొరపాట్లను ఈ సారి అస్సలు రిపీట్ కానివ్వకుండా చూసుకోవాలని అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. ఇందుకోసం ఎంత చేయాలో అంత చేస్తున్నారు. గతం కంటే భిన్నమైన పాలన అందిస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించారు.
కక్షసాధింపు చర్యలు ఉండవని ఇప్పటికే పవన్ కల్యాణ్ ప్రకటించారు. కాబట్టి చంద్రబాబు కూడా అందుకు తగ్గట్టే మెదులుకోవాలని భావిస్తున్నారు. కక్ష సాధింపుకు పోతే ప్రజలు తీవ్రంగా తిరస్కరిస్తారని చంద్రబాబుకు కూడా తెలుసు. కానీ కొందరు టీడీపీ నేతల కోరికలు మాత్రం కక్ష సాధింపుకు అద్దం పడుతున్నాయి. అందులో జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన కొడుకు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీ నేతలను తరిమేయాలని కోరుతున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇందుకోసం చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు.
చంద్రబాబు స్పందించకుంటే తామే తరిమేస్తామంటూ ప్రకటిస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇక అటు పరిటాల శ్రీరామ్ కూడా ఇలాంటి కండీషన్లే పెడుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో తోదుపుర్తి ప్రకాశ్ రెడ్డిపై 307 పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆయన్ను అరెస్ట్ చేయాలని.. ఎన్నికల సమయంలో తమ వాళ్లను బెదిరించి, హత్యాయత్నానికి ప్రయత్నించారంటూ ఆరోపిస్తున్నారు పరిటాల శ్రీరామ్. అయితే ఇప్పటికే పరిటాల కుటుంబం చెప్పిన వారిపై కేసులు కూడా నమోదు చేశారు. కానీ ప్రకాశ్ రెడ్డిపై 307 పెట్టేంత పరిస్థితి లేదని చెబుతున్నారు.
ఇక రఘురామ కృష్ణం రాజు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తనను కొట్టారంటూ కొందరు ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టారు. వారిని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు ఇలాంటి డిమాండ్లు పెట్టడంతో చంద్రబాబు తల పట్టుకుంటున్నారు. వారు అడిగిందల్లా చేస్తే ప్రభుత్వంపై చెడ్డపేరు వస్తుందని చెబుతున్నారు.





