Vijayamma : విజయమ్మ మీదే అందరి చూపు.. మీడియా ముందుకు వస్తుందా..?
Qubetvnews - October 27, 2024 / 08:52 AM IST
Vijayamma : ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది జగన్, షర్మిల ఆస్తుల వివాదం. ఇన్ని రోజులు అంటే ఏదో రాజకీయ వైరం లాగానే వీరిద్దరి వ్యవహారం ఉండేది. కానీ ఇప్పుడు పర్సనల్ అయిపోయింది. ఆస్తుల వివాదాన్ని నాలుగు గోడల మధ్య పరిష్కరించుకుంటే అయిపోయేదేమో. కానీ అలా చేయకుండా వారిద్దరూ మీడియా కెక్కారు. అదే వైఎస్ కుటుంబ చరిష్మాను తగ్గిస్తోందనే వాదన కూడా ఉంది. ఈ వివాదమంతా సరస్వతి కంపెనీ షేర్ల బదిలీ మీదనే ఉంది. ఈ షేర్లను విజయమ్మ పేరు మీద నుంచి బదిలీ చేసుకోవడం వల్ల జగన్ బెయిల్ రద్దు అవుతుందనేదే అసలు వివాదానికి కారణం.
కానీ షర్మిల మాత్రం అసలు ఈ షేర్ల బదిలీకి జగన్ బెయిల్ రద్దుకు సంబంధమే లేదంటున్నారు. పైగా తన తండ్రి బతికి ఉన్నప్పుడు ఒక్క ఆస్తిని కూడా పంచివ్వలేదని.. తనకు ఇచ్చిన రూ.200 కోట్లు కూడా వాటాల కింద డివిడెండ్ రూపంలో ఇచ్చిందే తప్ప జగన్ సొంత ఆస్తి కాదంటున్నారు. వీటన్నింటికీ తన తల్లి విజయమ్మను ఆమె సాక్ష్యంగా చూపిస్తున్నారు. విజయమ్మ ముందే జగన్ విడిపోదామనే ప్రతిపాదన పెట్టాడని.. భారతి సిమెంట్స్, సాక్షి లో 60 శాతం వాటా కావాలంటే విజయమ్మ వద్దని చెప్పిందని.. చివరకు ఒప్పుకున్నామని ఆమె చెబతున్నారు.
జగన్ జరిగిన ఆస్తుల పంచాయితీలన్నింటికీ విజయమ్మనే ప్రధాన సాక్ష్యం అంటున్నారు షర్మిల. ఇక వివాదానికి అసలు కారణమైన సరస్వతి కంపెనీ షేర్లను విజయమ్మ పేరు మీద నుంచే మార్చుకున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజల చూపు, మీడియా చూపు మొత్తం విజయమ్మ మీదకు వెళ్లిపోయింది. ఓ వైపు వైసీపీ నేతలు జగన్ బెయిల్ రద్దు చేయడానికే షర్మిల షేర్లు బదిలీ చేసుకుందని ప్రచారం చేస్తున్నారు. వీటిని తిప్పి కొట్టడానికి షర్మిల ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఆమెకు సరైన మద్దతు దొరకట్లేదు. ఆమెకు ఉన్న ఏకైక ఆధారం విజయమ్మ మాత్రమే.
ఎవరెన్ని చెప్పినా.. విజయమ్మ బయటకు వచ్చి ఒక్క మాట చెబితే చాలు షర్మిలకు వెయ్యి ఏనుగుల బలం వస్తుంది. కానీ విజయమ్మ అసలు మీడియా ముందుకు వస్తుందా.. ఒకవేళ వస్తే షర్మిలకు మద్దుతుగా మాట్లాడుతుందా లేదంటే జగన్ కు మద్దతుగా మాట్లాడుతుందా అనేదే పెద్ద ప్రశ్న. ఎందుకంటే రాజకీయ వైరం వేరు.. కుటుంబ ఆస్తుల వైరం వేరు. ఇది కుటుంబ సమస్య కాబట్టి ఏ ఒక్కరి వైపు మాట్లాడినా ఆమెకు మరొకరు దూరం అయిపోతారు. అటు చూస్తే కొడుకు.. ఇటు చూస్తే కూతురు. కాబట్టి విజయమ్మ ఎవరి పక్షాన నిలబడ్డా అంతిమంగా పోయేది వైఎస్ కుటుంబ పరువే.
అందుకే ఈ విషయంలో వీరిద్దరూ ఎంత రచ్చ చేసినా సరే విజయమ్మ మౌనంగానే ఉంటున్నారని తెలుస్తోంది. ఆమె వివరణ కన్నా మౌనం అత్యంత ప్రమాదం. వీరిద్దరి మధ్య మరింత వివాదాన్ని రాజేస్తుంది. కాబట్టి విజయమ్మ చొరవ తీసుకుని ఈ వివాదాన్ని నాలుగు గోడల మధ్య పరిష్కరించాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు కోరుతున్నారు. అలా చేయకపోతే కుటుంబ పరువు మరింత దిగజారిపోతుందని సలహాలు ఇస్తున్నారు. మరి విజయమ్మ ఏం చేస్తుంది.. ఎటు నిలబడుతుంది అనేది వేచి చూడాలి.





