Former ministers : మాజీ మంత్రులు ఎక్కడ.. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నారా..?
Qubetvnews - July 8, 2024 / 03:57 PM IST
Former ministers : ఏపీలో ఇప్పుడు రాజకీయాలు వేగంగా మారిపోతున్నారు. మొన్నటి వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ మంత్రులు అందరూ ఎంతో యాక్టివ్ గా ఉండేవారు. జగన్ కంటే ఎక్కువగా వారే మాట్లాడేవారు. అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వారే కనిపించేవారు. అలాంటి వారిలో రోజ, కొడాలి నాని, అనిల్ కుమార్, గుడివాడ అమర్ నాథ్, విడుదల రజినీ లాంటి వారు కూడా ఉన్నారు. వీరు జగన్ హయాంలో ఎంతగా రెచ్చిపోయారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతిపక్షాలపై దూకుడుగా వ్యవహరించడంలో వీరికి ప్రత్యేక స్థానం ఉంది.
అలాంటి వీరు ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. మొన్నటి ఎన్నికల్లో వీరంతా ఓడిపోయారు. మంత్రులలో ఒక్క పెద్దిరెడ్డి తప్ప మిగతా వారంతా ఓటమి పాలయ్యారు. ఓడిపోయినా సరే చాలా మంది మంత్రులు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. కానీ రోజా, కొడాలి నాని, రజినీ, అనిల్, అమర్ నాథ్ మాత్రం అడ్రస్ లేకుండా పోయారు. అసలు వీరి వాయిస్ ఎక్కడా వినిపించట్లేదు. ప్రభుత్వం లో ఉన్నప్పుడు పదే పదే మీడియా ముందుకు వచ్చిన వీళ్ళు ఇప్పుడు ఎందుకు ప్రజల ముందుకు రావట్లేదు.. కనీసం ప్రజల సమస్యలపై స్పందించేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపట్లేదు.
దాంతో వీరిలా సైలెంట్ అయిపోవడానికి కారణాలను వెతుకుతున్నారు. చూస్తుంటే వీరు రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తారా అనే అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ మీద వీరు చేసిన కామెంట్లు హద్దులు మీరిపోయాయి. వ్యక్తిగతంగా వీరు విమర్శలు చేయడం వల్లే అది ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత తీసుకొచ్చిందని.. వైసీపీ ఓటమికి ఈ మంత్రుల తీరు కూడా కారణం అనే చర్చ జరిగింది. ఇంతగా చంద్రబాబు కుటుంబాన్ని, పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశారు కాబట్టి.. వీరిని వారు అంత ఈజీగా వదిలేయరు అని అంటున్నారు.
రాబోయే రోజుల్లో వీరికి ఇబ్బందులు తప్పవేమో అనే సంకేతాలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఇంకా దూకుడుగా వ్యవహరించడం కంటే కూడా.. ఇక రాజకీయాలకు దూరంగా ఉండటమే బెటర్ అని వీరు భావిస్తున్నట్టు చర్చ సాగుతోంది. ఎందుకంటే వీరికి రాజకీయంగా ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి.
ఇప్పట్లో వీరు పొలిటికల్ గా కోలుకోలేరని అర్థం అవుతోంది. అందుకే వీరు కూడా ఇప్పట్లో రాజకీయంగా యాక్టివ్ గా ఉండటానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కానీ ఇలా మౌనంగా ఉంటే మాత్రం రాజకీయాల్లో వీరి ఉనికి ప్రశ్నార్థకమే అవుతుందని చెబుతున్నారు.





