Allu Arjun : తప్పులేకపోయినా అల్లు అర్జున్ ను వెంటాడడం ఏంటి..?
Qubetvnews - December 30, 2024 / 02:58 PM IST
Allu Arjun : అల్లు అర్జున్ ఎలాంటి వ్యక్తి అనేది ఆయన గతం చూస్తేనే అర్థం అవుతుంది. ఆయన ఎప్పుడూ ఎవరినీ కించ పరిచే విధంగా మాట్లాడిన దాఖలాలు లేవు. కనీసం ఎవరి జోలికి వెళ్లే వ్యక్తి కాదు. వివాదాలకు ఆమడ దూరంలో ఉండే హీరో. ఎంత సేపు తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు. ఎవరికైనా ఆపద వస్తే సాయం చేస్తుంటాడు. గతంలో వరదలు, ప్రకృతి ప్రమాదాలు జరిగినప్పుడు అతని సాయం మనం చూశాం. అలాంటి అల్లు అర్జున్ ను ఇప్పుడు కావాలని కొందరు టార్గెట్ చేస్తున్నారు. జరిగిన ఓ ఉదంతాన్ని పట్టుకుని పదే పదే అల్లు అర్జున్ ను తిడుతున్నారు. అనుకోకుండా ఓ ప్రమాదం జరిగింది. అందులో ఓ ప్రాణం పోయింది.
మరొకరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఇది ఎవరూ పూడ్చలేని నష్టం. దాన్ని ఎవరూ కాదనలేరు. అలాంటి సమయంలో ఆ కుటుంబానికి అందరూ అండగా నిలబడాలని అనుకుంటారు. అంతే తప్ప దీన్ని ఆసరాగా చేసుకుని ఓ వ్యక్తిని టార్గెట్ చేయాలని అనుకోవడం దుర్మార్గం. అల్లు అర్జున్ ఇప్పటికే ఆ కుటంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కనీవినీ ఎరగని స్థాయిలో రెండు కోట్ల సాయం అందించాడు బన్నీ. ఇప్పటికీ శ్రీతేజ్ ట్రీట్ మెంట్ కోసం అన్నీ తానై చూసుకుంటున్నాడు. ఇంత చేస్తున్నా సరే అల్లు అర్జున్ ను మాత్రం కొన్ని శక్తులు వెంటాడుతున్నాయి.
పనిగట్టుకుని మరీ అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయడం.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం చూస్తున్నాం. అతని ప్రమేయం లేకుండా జరిగిన ప్రమాదానికి అల్లు అర్జున్ బాధ్యతగా వ్యవహరిస్తూ వస్తున్నారు. గతంలో చాలా సార్లు తొక్కిసలాటలు జరిగాయి. సినిమా ఈవెంట్లలో, ప్రభుత్వ పరమైన కార్యక్రమాల్లో కూడా తొక్కిసలాటలు జరిగాయి. కానీ అప్పుడు ఎవరూ ఇంత రచ్చ చేయలేదు కదా.. పైగా ఈ సారి డైరెక్టర్లు, నిర్మాతలను వదిలేసి కేవలం అల్లు అర్జున్ వెంట పడటం వెనక లక్ష్యం ఏంటి అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. చేయని తప్పుకు ఇప్పటికే బన్నీ జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడు.
అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు తప్పించుకునే ప్రయత్నం చేయట్లేదు. చట్టానికి కట్టుబడి నడుచుకుంటున్నాడు. ఇంటి మీద దాడి చేసినా సరే ఇప్పటి వరకు దాని గురించి ఏమీ అనలేదు. ఓర్పుతో మెదులుతున్నాడు. అతను ఇంత ఓర్పుతో ఉంటున్నా సరే.. ఇంకా కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. వేల మందితో వచ్చి ఇంటి మీద దాడి చేస్తాం అని మీడియా ముందే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిని కూడా చట్ట పరంగానే బన్నీ ఎదుర్కుంటున్నారు. అది ఆయన సంస్కారంగా గుర్తించాలి. ఒక పెద్ద స్టార్ హీరోనే ఇలా వేధిస్తే అందరూ కచ్చితంగా వ్యతిరేకించాలి.





