Pushpa-2 Movie Review : పుష్ప-2 మూవీ రివ్యూ.. వైల్డ్ ఫైర్ పేలిందా..?

Qubetvnews - December 5, 2024 / 08:53 AM IST

Pushpa-2 Movie Review : పుష్ప-2 మూవీ రివ్యూ.. వైల్డ్ ఫైర్ పేలిందా..?

Pushpa-2 Movie Review : భారీ అంచనాల నడుమ, పాన్ ఇండియా వైడ్ గా ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది పుష్ప-2 మూవీ రివ్యూ. మూడేండ్లుగా తెరకెక్కిన ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రకే హైప్ ఎక్కువగా ఉంది. బన్నీ-రష్మిక జంటగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో తీసింది. పార్టు-1 హిట్ కావడంతో ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మరి ఆ అంచనాలను ఈ మూవీ అందుకుందా లేదా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.

కథ ఏంటంటే..?

పార్టు-1లో పుష్పరాజ్ శ్రీవల్లిని పెళ్లి చేసుకోవడంతో ఎండ్ అవుతుంది కదా.. కథ అక్కడి నుంచే రెండో పార్టులో స్టార్ట్ అవుతుంది. ఎర్రచందనం సిండికేట్ లో బాస్ గా ఎదిగిన తర్వాత పుష్పరాజ్ కథ వేరేలా ఉంటుంది. ఇంకోవైపు తన భార్య శ్రీవల్లి అడిగితే ఎంత వరకు అయినా వెళ్లేందుకు సిద్ధపడుతుంటాడు పుష్పరాజ్. దాంతో కథ అక్కడి నుంచే వేగం పుంజుకుంటుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూనే తన అన్న కుటుంబం మోహన్(అజయ్) నుంచి ఇంటిపేరును, గుర్తింపును సంపాదించుకోవడానికి ఆరాటపడుతుంటాడు. అయితే రష్మికకు ఇచ్చిన మాట కోసం పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ తో పాటు ఎలాంటి రాజకీయాలు చేశాడు, భన్వర్ సింగ్ షెకావత్ రివేంజ్ స్టోరీ, మంగళం శ్రీను పగ తీర్చుకోవడానికి వాళ్లు చేసే విలనిజం, బన్నీ తన కుటుంబం నుంచి గుర్తింపు కోసం చేసిన ఎమోషన్ ఎపిసోడ్స్ అన్నీ ఈ పార్టు-2లో చూపించారు.

ఎవరెలా చేశారంటే..?

ఇది ఒక రకంగా అల్లు అర్జున్ నట విశ్వరూపానికి నిదర్శనం అనేలా ఉంది. బన్నీ ఇంత వరకు చూపించని నటన మనకు ఇందులో కనిపిస్తుంది. యాక్షన్ సీన్లు, ఎమోషన్ సీన్లలో అతని హావభావాలు ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వవు. అంతగా మెప్పించేశాడు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్ లో మాత్రం బన్నీ నటన నభూతో నభవిష్యత్ అన్నట్టుగానే ఉంటుంది. ప్రతి ఫ్రేమ్ లో బన్నీ నటనతోనే సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లాడు. ఇంకా చెప్పాలంటే ఈ మూవీని తన భుజాల మీద మోశాడు. బన్నీ తర్వాత భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫహాద్ ఫాజిల్ నటన బాగుంది.

చాలా సీన్లలో అతని యాక్టింగ్ షేడ్స్ బాగున్నాయి. కొన్ని సీన్లలో విలనిజం, ఇంకొన్ని సీన్లలో ఎంటర్ టైన్ మెంట్ అందించాడు. ఇక రష్మిక శ్రీవల్లి పాత్రలో ఒదిగిపోయింది. సునీల్, అనసూయ, కేశవ పాత్రలు మొదటి పార్టు కన్నా ఇంకాస్త వపర్ ఫుల్ గా కనిపించాయి. వాళ్లు కూడా ఆయా పాత్రల్లో బాగానే చేశారు.

ఎలా ఉందంటే..?

ఒక సినిమాను మూడేండ్లు తీశారంటే అందులో ఊహించని సీన్లు కచ్చితంగా ఉండాలని కోరుకుంటారు ప్రేక్షకులు. ఆ విషయంలో సుకుమార్ అస్సలు తగ్గలేదు. హైప్ ఎక్కించే సీన్లు, గూస్ బంప్స్ తెప్పించే ఎలివేషన్లు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీన్లు సినిమాకు ప్రధాన బలంగా మారాయి. ఇందులో బన్నీ ఎలివేషన్ సీన్లు కూడా ఊహించని విధంగానే ఉంటాయి. యాక్షన్ సీన్లలో బన్నీ నట విశ్వరూపం మామూలుగా ఉండదు. అందులోనూ జాతర సీన్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక యాక్షన్ కు సరిసమానంగా ఎమోషన్ ను నడపించాడు సుకుమార్. యాక్షన్, ఎమోషన్లు, ఎలివేషన్ల చుట్టూ సినిమా సాగినట్టు అనిపిస్తుంది. కానీ ఒక సినిమాలో ఒక పాత్రనే హైలెట్ చేసినట్టు కనిపిస్తుంది.

కేవలం పుష్పరాజ్ పాత్రకు హైప్ తెచ్చేందుకు సీన్లు రాసుకున్నట్టు కనిపిస్తుంది. అంతే గానీ మిగతా పాత్రలకు అంతప్రాధాన్యం ఇచ్చినట్టు అనిపించదు. ఒక హీరో పాత్ర బలంగా కనిపించాలంటే.. అంతే బలంగా విలన్ పాత్ర కథలో ఉండాలి. అప్పుడే కథలో బేస్ ఉంటుంది. ఈ విషయంలో సుకుమార్ డిసప్పాయింట్ చేశాడనే అనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ పార్టులో మెయిన్ విలన్ ఫహాద్ ఫాజిల్ అయినా.. అతని పాత్ర రాను రాను కమెడియన్ లా అనిపిస్తుంది. అదే అంసతృప్తిని ఇస్తుంది. ఫహాద్ ఫాజిల్ పాత్రను మరింత భయంకరంగా చూపించి ఉంటే పుష్పరాజ్ పాత్రకు మరింత హైప్ వచ్చేది. దాంతో పాటు చాలా సీన్లు సాగదీసినట్టు అనిపిస్తాయి. ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా చేయాల్సింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. కథలో బలమైన పాయింట్ లేదనే ఫీలింగ్ కలుగుతుంది. అసలు పుష్పరాజ్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడో ఓ బలమైన పాయింట్ ఇందులో చూపిస్తే బాగుండేది. ఆ ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగిస్తే అప్పుడు కథకు బాగా కనెక్ట్ అయ్యేవారు.

టెక్నికల్ గా ఎలా ఉందంటే..?

సుకుమార్ డైరెక్షన్ మరో లెవల్ లోనే ఉంది. అతని క్రియేటివిటీ మనకు ఈ సినిమాలో కనిపిస్తుంది. సినిమా చూశాక ఇలాంటి సీన్లు తీయాలంటూ మూడేండ్లు కావాల్సిందే అనేలా ఉంటుంది. ఈ సారి మాస్ ఎలివేషన్లు, ఎమోషన్లు, యాక్షన్ సీన్ల చుట్టూ కథను రాసుకున్నాడు సుకుమార్. అదే సినిమాకు ప్రధాన బలం అయింది. మ్యూజిక్ పరంగా దేశి మార్కులు కొట్టేశాడు. థియేటర్లలో అతని మ్యూజిక్ వినసొంపుగా ఉంటుంది. మైత్రీ నిర్మాతలు సినిమాకోసం భారీగానే ఖర్చు చేశారు. అది ప్రతి ఫ్రేమ్ లో మనకు కనిపిస్తుంది. ఎడిటింగ్ లోపాలు చాలానే ఉన్నాయి. చాలా సీన్లు ల్యాగ్ అనిపిస్తాయి. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్లు

బన్నీ నట విశ్వరూపం
సుకుమార్ క్రియేటివ్ నెస్
యాక్షన్, ఎమోషన్ సీన్లు
రష్మిక, శ్రీలీల అందాలు

మైనస్ పాయింట్లు

చాలా సీన్లు సాగదీతగా అనిపించడం
కథలో బలమైన పాయింట్ లేదనే ఫీలింగ్

చివరగా..

పుష్ప-2 సినిమాను చూస్తే పుష్పరాజ్ మాస్ జాతర అనేలా ఉంటుంది. చాలా సీన్లు ల్యాగ్ అనిపించినా.. కథలో ఏదో బలమైన పాయింట్ మిస్ అయినట్టు ఫీల్ అయినా.. వాటిని బన్నీ ఎప్పటికప్పుడు తన పర్ఫార్మెన్స్ తో మర్చిపోయేలా చేస్తాడు. ప్రేక్షకుల చూపు పుష్పరాజ్ పాత్రమీదనే ఉండేలా చేశాడు. మొత్తంగా ఇది మాస్ జాతర.

రేటింగ్ః 3/5

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News