Kadale Song : రిజర్వేషన్లు, కులం మీద కడలే కదిలే సాంగ్.. ఆలోచింపజేస్తున్న లిరిక్స్
Qubetvnews - August 17, 2024 / 04:22 PM IST
Kadale Song : బిగ్ బాస్ RJ సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ప్రస్తుతం కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ లో నటిస్తున్నాడు. ఇక తాజాగా ఆయన నటించిన కడలే కదిలే సాంగ్ అదిరిపోయింది. ఇందులో ఆయన సరసన తేజస్వి రావు నటించింది. ఆ పాటను గీతా ఆర్ట్స్-2, ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కలిసి నివృతి ఛానెల్ లో రిలీజ్ చేశారు. ఈ సాంగ్ సమాజంలో పాతుకుపోయిన లోతైన అన్యాయాలను వెలుగులోకి తెచ్చేలా, ముఖ్యంగా కులం మరియు రిజర్వేషన్లకు సంబంధించిన సమస్యలపై దృష్టి సారించేలా ఉందని వాళ్లు తెలిపారు.
మ్యూజిక్ డైరెక్టర్ పవన్ ఈ పాటకు హృదయాన్ని హత్తుకునేలా మెలోడీ ట్యూన్ ఇచ్చారు. ఈ పాటను భీమ్లా నాయక్ ఫేమ్ అరుణ్ కౌండిన్య ఆలపించారు. ఈ పాటకు డైరెక్టర్ వేద లిరిక్స్ అందించారు. ఇక పాటలో ఆర్జే సూర్య సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకున్నాడు. క్రికెటర్ కావాలనే తన లక్ష్యానికి కులం అనేది ఎలా అడ్డు వచ్చిందనేది ఇందులో చాలా చక్కగా చూపించారు. ట్యాలెంట్ ఉండి కూడా.. లక్ష్యాన్ని చేరుకోలేక యువకుడి పరిస్థితిని చక్కగా పాట రూపంలో వినిపించారు. ఇందులో ప్రతి లిరిక్ కూడా ఆలోచింపజేసేలా ఉంది.
పైగా పాట కూడా చాలా వినసొంపుగా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. ఈ పాట ఆర్జే సూర్యకు మంచి పేరు తెస్తుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఆర్జేసూర్య చేసింది ఒక ఎత్తు అయితే.. ఆ పాటతో ఆయన చేసింది మరో ఎత్తు అని అంటున్నారు. సమాజంలో ఉన్న అసమానతలను, రిజర్వేషన్లను, కులాలను ఎత్తి చూపించిన ఈ పాట ఇప్పుడు విన్న ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. మరి ఈ పాట విని మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.





