Etala Rajender : ఈటల రాజేందర్ కు బీజేపీ పగ్గాలు.. అసలు ప్లాన్ అదేనా..?
Qubetvnews - June 19, 2024 / 09:45 PM IST
Etala Rajender : ఈటల రాజేందర్ పేరు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోవడంతో ఆయన పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ మల్కాజిరిగిరికి పోయి ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచి చూపించడంతో ఆయన గ్రాఫ్ మళ్లీ పెరిగిపోయింది. దాంతో ఇప్పుడు ఈటల రాజేందర్ పేరు మళ్లీ తెరమీదకు వచ్చింది. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి దక్కింది. దాంతో ఆయన త్వరలోనే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం తెరమీదకు వచ్చింది.
ఎందుకంటే బీజేపీలో ఒక వ్యక్తికి రెండు పదవులు ఉండవు. కాబట్టి త్వరలోనే కిషన్ రెడ్డి తప్పుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్ పేరు తెరమీదకు వచ్చింది. మొన్న ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో గెలిచిన వెంటనే ఈటల రాజేందర్ వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈటల రాజేందర్ కే పగ్గాలు కన్ఫర్మ్ అని దాంతో క్లియరెన్స్ వచ్చింది. అయితే ఈటల రాజేందర్ కంటే సీనియర్లు బీజేపీలో చాలా మందే ఉన్నారు. రఘునందన్ రావు, అరవింద్, డీకే అరుణ లాంటి వారు ఉన్నారు. కానీ వారందరితో పోలిస్తే ఈటల రాజేందర్ రాజకీయాల్లో చాలా సీనియర్.
పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉంది. ఉద్యమ కారుడిగా ఎక్కువ గుర్తింపు ఆయనకే సొంతం. పైగా ఇప్పుడు తెలంగాణలో ఉన్న బీఆర్ ఎస్ నేతలతో ఈటల రాజేందర్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే ఆయన బీఆర్ ఎస్ నుంచి చాలా మంది నేతలను బీజేపీలోకి తెచ్చారు. అయితే ఇప్పుడు పార్టీ అధ్యక్ష పగ్గాలు ఈటల రాజేందర్ కు ఇచ్చి.. బీఆర్ ఎస్ లో ఉన్న కీలక నేతలందరినీ బీఆర్ ఎస్ లోకి తేవాలని చూస్తోంది ఆ పార్టీ. ఇప్పుడు బీఆర్ ఎస్ గ్రాఫ్ క్రమంగా పడిపోతోందని.. ఎంపీ సీటు ఒక్కటి కూడా రాకపోవడంతో ఆ పార్టీ నేతలు పక్క చూపులు చూస్తున్నారని బీజేపీ అంచనా వేసింది.
కాబట్టి ఇలాంటి సమయంలో ఈటల రాజేందర్ ను ముందు ఉంచి ఆపరేషన్ బీఆర్ ఎస్ ను చేపట్టాలని అనుకుంటోంది. ఈటలకు మంచి సంబంధాలు వారితో ఉన్నాయి కాబట్టి.. ఆయన హయాంలో చేరికలు ఎక్కువ జరుగుతాయని భావిస్తోంది. అలా పార్టీని రాబోయే ఎన్నికల్లో బలంగా తయారు చేసి అధికారంలోకి తేవడం కోసం ఇప్పటి నుంచే ప్లాన్లు వేస్తోంది బీజేపీ.

