Kcr plans about kaleshwaram issue : ఇమేజ్ ను కాపాడుకునే పనిలో కేసీఆర్.. మొన్న నల్గొండ.. ఇప్పుడు కరీంనగర్..!
Qubetvnews - March 4, 2024 / 09:21 AM IST
Kcr plans about kaleshwaram issue : రాజకీయాల్లో కేసీఆర్ కు ఉన్న చతురత అంతా ఇంతా కాదు. ఆవలించే లోపు పేగులు లెక్కపెట్టేయగల చాతుర్యం ఆయన సొంతం. అవతలి పార్టీ ఎలాంటి వ్యూహాలు పన్నుతుందో.. దాన్ని ఎలా తిప్పి కొట్టాలో ఆయనకు బాగా తెలుసు. పదేండ్లు పరిపాలించిన కేసీఆర్.. ఈ కాలంలో తన గురించి గొప్పగా చెప్పుకునే వాటిల్లో కాలేళ్వరం మొదటి స్థానంలో ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ కేసీఆర్ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఆయన గ్రాఫ్ కాస్త తగ్గిపోవడం స్టార్ట్ అయింది. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మరింతగా తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తోంది.
ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి సర్కార్ మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడాన్ని బాగా హైలెట్ చేసింది. మేడిగడ్డ సందర్శన ప్రోగ్రామ్ తీసుకోవడంతో పాటు అసెంబ్లీలో దానిపై చర్చ జరపడం అంతే కాకుండా మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోడంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంతో దానిపై ప్రజల్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కాళేశ్వరంతో ఎలాంటి ఉపయోగాలు లేవంటూ బాగానే మీడియాలో న్యూస్ కూడా కవర్ అయిపోయింది. దాంతో కేసీఆర్ వెంటనే అలెర్ట్ అయిపోయారు. తన పదేండ్ల కాలంలో ఎంతో గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇన్ని విమర్శలు వస్తుంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటారు.
అందుకే మొన్న ఛలో నల్గొండ సభను తీసుకున్నారు. ఆ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే కాదని.. ఇంకా చాలానే ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. దానిపై కట్టిన బరాజ్ లు, టన్నెల్స్, కాలువలు, ప్రాజెక్టులు ఇవన్నీ కలిపితేనే కాళేశ్వరం అంటూ తెలిపారు కేసీఆర్. ఒక మూడు నాలుగు పిల్లర్లు కుంగిపోతే వాటిని సరిచేయొచ్చని.. అదేమంత పెద్ద నష్టం కాదని తెలిపారు కేసీఆర్. కాబట్టి ఈ విషయంలో రైతులకు నష్టం చేయొద్దని తెలిపారు. కానీ కేసీఆర్ ఈ ఒక్క సభ పెట్టి ఊరుకుంటే సరిపోదని భావిస్తున్నారు.
అందుకే ఇప్పుడు మళ్లీ ఛలో కరీంనగర్ సభకు పిలుపునిచ్చారు. మార్చి 12న ఈ సభను నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఈ సభలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగడుతామంటూ చెబుతున్నాయి బీఆర్ ఎస్ వర్గాలు.
ఇలా మరో సభతో అసలు కాళేశ్వరాన్ని నిర్లక్ష్యం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వమే అని.. తన ఇమేజ్ ను కాపాడుకునే పనిలో పడ్డారు కేసీఆర్. ఇందుకోసం భారీగానే ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే కేసీఆర్ ఇలా తన ఇమేజ్ ను కాపాడుకునే పనులు బాగానే వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ నేతలు.