Kavitha : కేసీఆర్ ముందు జాగ్రత్త.. అందుకే కవిత పోటీ చేయట్లేదా..?
Qubetvnews - March 15, 2024 / 09:24 AM IST
Kavitha : కేసీఆర్ అంటే రాజకీయాల్లో అపర చాణక్యుడు అని ఆయన గురించి బాగా తెలిసిన వారు చెబుతుంటారు. కాబట్టి కేసీఆర్ ఎవరిని ఎలా మెప్పించాలో.. ఎవరిని ఎలా దూరం పెట్టాలో బాగా తెలుసు. క్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది కూడా కేసీఆర్ బాగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఉద్యమంలో అంత వీరోచితంగా పోరాడి.. తెలంగాణ ప్రజలందరినీ కలుపుకుని పోయారంటే ఆయనకు ఎంత రాజకీయ పరిజ్ఞానం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా ఇప్పుడు కేసీఆర్ పదేళ్లుగా సీఎంగా పని చేశారు. కాబట్టి ఆయనకు రాజకీయ పరిజ్ఞానం ఇంకా ఎక్కవగానే ఉంటుందని చెప్పుకోవాలి.
అయితే కేసీఆర్ మొన్నటి ఎన్నికల్లో తన పార్టీ ఓడిపోయినప్పటి నుంచి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ మొదటి సారి ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అందుకే ఈ సారి ఆచితూచి అడుగులు వేస్తున్నారంట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను మరోసారి రిపీట్ కాకుండా ఎంపీ ఎన్నికల్లో చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు కేసీఆర్. వాస్తవానికి కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు ఎంపీగా పోటీ చేస్తూ వస్తున్నారు. గతంలో కేసీఆర్ చేస్తే.. ఆ తర్వాత కవిత రెండు సార్లు పోటీ చేసింది. రెండో సారి ఓడిపోయింది.
కాగా ఇప్పుడు మూడోసారి ఆమె నిజమాబాద్ లేదంటే మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేస్తుందని అంతా భావించారు. కానీ కేసీఆర్ ఎందుకో ఆమెను ఈ ఎంపీ ఎన్నికలకు దూరంగా ఉంచుతున్నారు. ఇందులో రాజకీయ చాణక్యం ఉందని చెబుతున్నారు. అదేంటంటే.. ఇప్పుడు కవిత లిక్కర్ కేసులో ఇరుక్కుపోయింది. ఆమె మీద ఆరోపణలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇలాంటి సమయంలో ఆమెను పోటీ చేయిస్తే కచ్చితంగా రాజకీయ పరమైన విమర్శలు వస్తాయని కేసీఆర్ భావిస్తున్నారు. పైగా తన కుటుంబ సభ్యులకే పదవులు ఇచ్చుకుంటున్నాడనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.
దాంతో పాటు ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఎంపీ ఎన్నికల్లో చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి తన కూతురును పోటీ చేయిస్తే.. కాంగ్రెస్, బీజేపీ కట్టగట్టుకుని మరీ కవితను ఓడించేందుకు అక్కడ ప్రచారం చేస్తాయి. ఆ రెండు పార్టీల దాటికి ఒకవేళ కవిత ఓడిపోతే మాత్రం కచ్చితంగా వ్యక్తిగతంగా కల్వకుంట్ల వారి ఫ్యామిలీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది.
ప్రజల్లో కల్వకుంట్ల ఫ్యామిలీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి ముందే ఇవన్నీ ఆలోచించిన కేసీఆర్ ఆమెను ఎంపీ ఎన్నికలకు దూరంగా ఉంచుతున్నట్టు తెలుస్తోంది. రాబోయే ఎంపీ ఎన్నికల్లో కవితతో ప్రచారం మాత్రం చేయిస్తారని తెలుస్తోంది.





