Tollywood  : కాంగ్రెస్ ప్రభుత్వానికి టాలీవుడ్ టార్గెట్ కాబోతోందా.. అనవసర స్టెప్ తీసుకున్నారా..?

Qubetvnews - October 5, 2024 / 02:22 PM IST

Tollywood  : కాంగ్రెస్ ప్రభుత్వానికి టాలీవుడ్ టార్గెట్ కాబోతోందా.. అనవసర స్టెప్ తీసుకున్నారా..?

Tollywood  : ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అన్నట్టు సీన్ మారిపోయింది. కొండా సురేఖ కేటీఆర్ ను విమర్శించే క్రమంలో అక్కినేని కుటుంబంపై చేసిన కామెంట్స్ ను టాలీవుడ్ మొత్తం ఖండించింది. హీరోలు, డైరెక్టర్లు, హీరోయిన్లు, నిర్మాతలు అందరూ బయటకొచ్చి సోషల్ మీడియాలో ధ్వజమెత్తారు. అక్కినేని కుటుంబానికి అంతా అండగా నిలబడ్డారు. రేవంత్ ప్రభుత్వంపై ఇన్ డైరెక్టుగానే వారంతా సీరియస్ అయ్యారు. అయితే కొండా సురేఖ కూడా తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం కొన్ని పాయింట్లను రైజ్ చేస్తోంది.

టాలీవుడ్ స్టార్లు కొండా సురేఖపై ఇంత పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు కదా.. మరి ఇంతకు ముందు జరిగిన విషయాలపై ఎందుకు ఇలా సీరియస్ గా స్పందించలేదు అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. గతంలో డ్రగ్స్ కేసులో చాలా మంది పట్టుబడినప్పుడు టాలీవుడ్ ఎందుకు మౌనంగా ఉంది అని అడుగుతున్నారు. అంతే కాకుండా టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై కూడా అనేక మంది అమ్మాయిలు కామెంట్లు చేసినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని అంటున్నారు. ఏపీ ప్రభుత్వం రేట్లు పెంచినప్పుడు, ఇతర విషయాల్లో టాలీవుడ్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఇదే విధంగా ఎందుకు అందరూ స్పందంచలేదు అని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది.

ఇలా కాంగ్రెస్ మొత్తం టాలీవుడ్ ను టార్గెట్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించడాన్ని బట్టి చూస్తుంటే.. ఇప్పుడు టాలీవుడ్ మొత్తం టార్గెట్ కాబోతోందనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే టాలీవుడ్ దూరంగా ఉంటుంది. రేవంత్ ను కనీసం కలవలేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి విషెస్ కూడా ఎవరూ చెప్పలేదు. పైగా ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంపై పరోక్షంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ పరిశీలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. త్వరలోనే టాలీవుడ్ పెద్దలను టార్గెట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

టాలీవుడ్ స్టార్ల భూములు, ఇతర కంపెనీలు, ఇండ్లు, వ్యాపారాల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉందేమో అంటున్నారు. సెలబ్రిటీలు అనవసరంగా రేవంత్ ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరించి ఇబ్బందులు కోరి తెచ్చుకుంటున్నారేమో అంటున్నారు. ఈ విషయంలో రేవంత్ ప్రభుత్వానికి వారంతా టార్గెట్ అవుతున్నారనే ప్రచారం మొదలైంది. ఇక నాగార్జున విషయానికి వస్తే.. ఆయన్ను కూడా ప్రభుత్వం టార్గెట్ చేస్తుందనే కథనాలు వస్తున్నాయి. జాగ్రత్తగా గమనిస్తే.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడం, ఇప్పుడు కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీని టార్గెట్ చేయడం ఇందులో భాగంగానే కనిపిస్తున్నాయి.

టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఏ హీరో కుటుంబంపై కూడా ఇలాంటి ఆరోపణలు రావట్లేదు. కేవలం నాగార్జున మీదనే వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఎన్ కన్వెన్షన్ ను చెరువును ఆక్రమించి కట్టారనే ఆరోపణల నేపథ్యంలో నాగార్జునపై కేసు కూడా బుక్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అటు నాగార్జున కూడా ఈ విషయంలో సీరియస్ గానే ఉంటున్నారు. ఎన్ కన్వెన్షన్ విషయంలో ఇప్పటికే ఆయన కోర్టులో కేసు వేశారు. ఇటు కొండా సురేఖ తన కుటుంబాన్ని అవమానించింది అంటూ కోర్టులో కేసు వేశారు. ఇలా ఎక్కడికక్కడ నాగార్జున కూడా లీగల్ గానే పోరాడుతున్నారు.

అటు ఏపీ ప్రభుత్వంలో టాలీవుడ్ చాలా మర్యాదగా, స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోంది. కానీ ఎటొచ్చి తెలంగాణ ప్రభుత్వంతో టాలీవుడ్ వైరం పెట్టుకునేలా వ్యవహరించడం అస్సలు మంచిది కాదంటున్నారు. మరి ఈ వివాదాలు ఇక్కడితోనే ఆగిపోతాయా.. లేదంటే ఇంకా ముందుకు సాగుతాయా అనేది చూడాలి.

 

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News