Kcr : ఇక అన్నీ కేసీఆర్ సమక్షంలోనే.. గులాబీ బాస్ కీలక నిర్ణయం…!
Qubetvnews - March 14, 2024 / 09:27 AM IST
Kcr : ఇన్ని రోజులు బీఆర్ ఎస్ లో కేటీఆర్ క్రియాశీలకంగా పని చేశారు. కేసీఆర్ గత పదేండ్లుగా ప్రగతి భవన్ కు మాత్రమే పరిమితం అయ్యారు. కానీ కేటీఆర్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ అన్నింటా తానై నిలిచారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించడం.. పార్టీలో నేతల మధ్య గొడవలు, పంచాయితీలు సెట్ చేయడం ఇలాంటివన్నీ ఆయనే దగ్గరుండి మరీ చూసుకున్నారు. కానీ కేసీఆర్ ఎన్నడూ కూడా పార్టీ పరమైన విషయాలు, ఇతర నేతల మధ్య సమన్వయాలు పెద్దగా పట్టించుకోలేదు. అన్నింటికీ కేటీఆర్ ను మాత్రమే పురమాయించేవారు.
అందులో ఎలాంటి అనుమానాలు లేవు. కాగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేసీఆర్ కంటే ఎక్కువగా కేటీఆర్ తిరిగారు. కేటీఆర్ ఎక్కువ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఓడిపోయింది. అప్పటి నుంచి కేసీఆర్ కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోగానే చాలా మంది లీడర్లు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. కేటీఆర్ వారికి నచ్చ జెప్పే ప్రయత్నాలు చేస్తున్నా సరే పెద్దగా సక్సెస్ కావట్లేదు. దాంతో ఇప్పుడు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది.
పార్టీలోని అసంతృప్తులకు కేసీఆర్ స్వయంగా నచ్చ జెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరైనా పార్టీని వీడే ఆలోచనలు చేస్తే వారిని స్వయంగా తన వద్దకు రప్పించుకుని మరీ భవిష్యత్ మీద భరోసా కల్పిస్తున్నారు. అంతే కాకుండా వారికి రాజకీయ పరమైన హామీలు కూడా ఇస్తున్నారు కేసీఆర్. సిట్టింగ్ ఎంపీల్లో నామా నాగేశ్వర్ రావు, మాలోత్ కవిత లాంటి వారు పార్టీని వీడుతారనే టాక్ రాగానే వెంటనే వారితో మాట్లాడి వారికి మళ్లీ ఎంపీ టికెట్లు కేటాయించారు కేసీఆర్. అంతే కాకుండా అటు పార్టీలో నుంచి వెళ్లిపోతున్న ఆరూరి రమేశ్ ను నిన్న స్వయంగా తన ఇంటికి పిలిపించుకుని మరీ బుజ్జగించారు.
ఇలా అన్ని విషయాల్లో అసంతృప్తులను కేటీఆర్ వెళ్లకుండా ఆపలేకపోతున్నారని గ్రహించారు కేసీఆర్. అందుకే ఇక నుంచి ప్రతి ఒక్కరికీ తానే స్వయంగా వెళ్లి మరీ హామీలు ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వారు పార్టీని వీడకుండా చూడాలన్నదే కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది.
ఎందుకంటే పార్టీని నేతలు వీడుతున్నారంటే అది పార్టీ గ్రాఫ్ ను తగ్గిస్తుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. అందుకే పార్టీని వీడే వారికి ఇలా తానే స్వయంగా హామీలు ఇచ్చి మరీ వారిని కాపాడుకుంటున్నారు. అందరికీ తనను కలిసేందుకు అవకాశాలు కూడా ఇస్తున్నారు కేసీఆర్.





