KCR : ఏం హాలత్ అయిపాయే.. 20 ఏళ్లలో తొలిసారి ఎంపీ బరిలో లేని కేసీఆర్, ఫ్యామిలీ…

Qubetvnews - April 26, 2024 / 09:58 PM IST

KCR : ఏం హాలత్ అయిపాయే.. 20 ఏళ్లలో తొలిసారి ఎంపీ బరిలో లేని కేసీఆర్, ఫ్యామిలీ…

KCR :

ఓడలు బండ్లవుతాయి. బండ్లు ఓడలవుతాయి అనే మాట అన్నిటిదగ్గరేమో గానీ రాజకీయాల్లో మాత్రం పర్ ఫెక్ట్ గా సూటవుతుంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి శాసించిన నేతలు కాస్తా జనాల నుంచి విముఖత ఎదుర్కొని ఉనికి కోసం పోరాడడానికే ఉన్నకాలం సరిపోయే పరిస్థితొస్తుంది. ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ లో గులాబీ నేతల సిచ్యుయేషన్ దాదాపు అదే. లోక్ సభ, అసెంబ్లీ, మున్సిపల్.. ఎన్నికలేవైనా సరే ఎగిరేది మాత్రం గులాబీ జెండానే అన్నట్టుగా దశాబ్ధకాలం పాటు రాజకీయాలను శాసించిన బీఆర్ఎస్ ఈ సారి మాత్రం చతికిలపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం చేతిలో ఓడిపోయాక కారు జోరు పూర్తిగా తగ్గిపోయింది. నామినేషన్ వేస్తేనే గెలుపు సంబరాలకు రెడీ అయిపోయినట్టే అన్నట్టుగా చెప్పుకున్న కేసీఆర్, ఆయన కుటుంబీకులు ఈ సారి ఎంపీ ఎన్నికల్లో అసలు బరిలోనే లేరు. ఇలా జరగడం ఈ రెండు దశాబ్ధాల్లో ఇదే తొలిసారి.

తెలంగాణ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో కేసీఆర్ గానీ, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఒక్కరు కూడా నిల్చోలేదు. నామినేషన్ వేయలేదు. 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ పరిస్థితి రావడం ఇదే ఫస్ట్ టైమ్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఉధ్రుతం చేసేందుకు టీడీపీ నుంచి బైటికొచ్చిన కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పార్టీ పెట్టారు. ఆ సమయంలోనే కరీనంగర్ నుంచి లోక్ సభ అభ్యర్థిగా, సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ప్రత్యేక రాష్ట్ర కాంక్ష ప్రజల్లో బలంగా ఉండడంతో కేసీఆర్ రెండు చోట్లా గెలుపొందారు. కానీ తెలంగాణ రాష్ట్రం రావాలంటే పార్లమెంటులో గొంతు వినిపించాలని, సిద్ధిపేట ఎమ్మెల్యే సీటును వదులుకొని కరీంనగర్ నుంచి ఎంపీగా పార్లమెంట్ కెళ్లి అప్పటి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రయ్యారు. దాంతో ఖాళీ అయిన సిద్ధిపేట స్థానం నుంచి బై ఎలక్షన్స్ లో కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఆ తర్వాత రాష్ట్ర విభజనపై ఆలస్యం చేస్తుండడంతో కాంగ్రెస్ తో విభేదించిన కేసీఆర్ 2006, 2008 బై ఎలక్షన్స్ లో కూడా కరీంనగర్ నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. 2009లో మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అదే ఏడాది తొలిసారి పోటీ చేసిన కేటీఆర్ సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 2010 బై ఎలక్షన్స్ లో కూడా సిరిసిల్ల నుంచే గెలుపొందాడు. ఇక ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాక 2014 లో మెదక్ పార్లమెంట్ నుంచి ఎంపీగా, గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కేసీఆర్ రెండు చోట్ల గెలుపొందారు. అసెంబ్లీ స్థానాల్లో గులాబీ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో స్టేట్ ఫస్ట్ సీఎంగా ఎన్నికయ్యారు.
అదే ఎలక్షన్లలో కేసీఆర్ కూతురు కవిత నిజామాబాద్ ఎంపీగా ఎన్నికైంది. కేటీఆర్ సిరిసిల్ల ఎంపీగా, హరీష్ రావు సిద్ధిపేట ఎమ్మెల్యేలుగా గెలపొంది క్యాబినెట్లో మినిష్టర్లయ్యారు. 2019లో రాష్ట్రంలో కారు పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే కవిత నిజామాబాద్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమిపాలవడంతో ఎమ్మెల్సీగా ఎన్నికైంది.

ఆ తర్వాత నేషనల్ పాలిటిక్స్ పై ఫోకస్ పెంచిన కేసీఆర్ 2022లో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. కానీ 2023 ఎన్నికల్లో పదేళ్లు పాలించిన గులాబీ పార్టీ కాంగ్రెస్ చేతిలో ఓడిపోయి ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. ఇదే ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్లా ఎమ్మెల్యేగా పోటీ చేసిన కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోయారు. 1985 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న కేసీఆర్ కి ఇదే తొలిఓటమి. పార్టీ ప్రాభవం తగ్గడంతో, కారు చరిష్మా కోల్పోవడంతో ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటాలని బలంగా పిక్సయ్యాడు గులాబీ బాస్. దాంతో ఈసారి నిజామాబాద్ నుంచి కవితని పోటీలో ఉంచుతారని చాలా వార్తలొచ్చాయి. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టవడంతో అదీ కుదరలేదు.

మరోవైపు కేసీఆర్ మెదక్, మల్కాజ్ గిరి ఈ రెండిట్లో ఏదో ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవాలనీ, లోకల్ గా మళ్లీ బలం పుంజుకోవాలని కేసీఆర్ ఎంపీ బరి నుంచి తప్పుకున్నారని ఓ టాక్. సో.. అలా ఈ ఇరవై ఏల్లలో కేసీఆర్ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఎంపీ బరిలో పోటీలేకపోవడం ఇదే తొలిసారి. మరి ఈ ఎంపీ ఎన్నికల్లో అయినా బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు దక్కించుకుని జోరు పెంచుతుందా అనేది చూడాలి.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News