Revanth reddy : రేవంత్ మార్క్ రాజకీయం.. అందుకే మోడీకి సెండాఫ్‌..!

Qubetvnews - March 6, 2024 / 11:35 AM IST

Revanth reddy : రేవంత్ మార్క్ రాజకీయం.. అందుకే మోడీకి సెండాఫ్‌..!

Revanth reddy : ప్రతిపక్షంలో ఉండటం వేరు. అధికారంలో ఉండటం వేరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత దూకుడుగా వ్యవహరించినా సరే నడుస్తుంది. కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఆచితూచి అడుగులు వేయాలి. నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు కట్టుబడి ఉండాలి. ఈ విషయం రేవంత్ రెడ్డికి కూడా బాగానే వంటబట్టినట్టుంది. అందుకే ఆయన ఇప్పుడు సీఎం అయిన తర్వాత ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రతి విషయంలో ప్రజల ఆదరణ పొందే విధంగా మాట్లాడుతున్నారు. ఆయన మాటలే కాకుండా చేస్తున్న పనులు కూడా అందరినీ ఆకట్టుకునేలా ఉంటున్నాయి.

ఒకప్పుడు పక్కా రాజకీయాలు చేసిన రేవంత్.. ఇప్పుడు మాత్రం ప్రజల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధే ముందే ఆ తర్వాతనే రాజకీయాలు అన్నట్టు నడుచుకుంటున్నారు. ఇందులో భాగంగానే కేంద్రంలో తమ ప్రత్యర్థి పార్టీ బీజేపీ ఉన్నా సరే వారితో కలిసి పనిచేసేందుకు తమకు అభ్యంతరం లేదని చెబుతున్నారు. గత పదేండ్లు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా నరేంద్రమోడీ తెలంగాణకు వచ్చారు. కానీ కేసీఆర్ ఎన్నడూ కూడా స్వయంగా మోడీని రిసీవ్ చేసుకోలేదు. ఎవరో ఒక మంత్రిని పంపించి వెల్కమ్ చెప్పించేవారు. కానీ ఇప్పుడు రేవంత్ ఆ విధానాన్ని పక్కన పెట్టేశారు.

తాజాగా నరేంద్రమోడీ తెలంగాణకు వచ్చినప్పుడు ఆయనే అన్నీ దగ్గరుండి మరీ చూసుకున్నారు. స్టేజిపై మాట్లాడేటప్పుడు కూడా నరేంద్రమోడీ తనకు పెద్దన్నలాంటి వాడని.. అందుకే తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అంతే కాకుండా మోడీని ప్రత్యేకంగా సన్మానించారు. అయితే ఇక్కడితో రేవంత్ ఆగిపోలేదు. మోడీ పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో కూడా రేవంత్ ఎయిర్ పోర్టుకు వెళ్లి మరీ సెండాఫ్‌ ఇచ్చి వచ్చారు. అంతే కాకుండా మోడీకి తెలంగాణ ప్రతిమను బహూకరించారు. ఈ సందర్భంగా మోడీతో ప్రత్యేకంగా మాట్లాడారు రేవంత్.

వాస్తవానికి రేవంత్ స్వయంగా వెళ్లి సెండాఫ్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆయన స్వయంగా వెళ్లి ఇలా సెండాఫ్‌ ఇవ్వడం వెనక తనకు రాజకీయాల కంటే కూడా తెలంగాణ అభివృద్ధి ముఖ్యం అని రేవంత్ చెప్పదలచుకున్నాడని తెలుస్తోంది. తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరితో అయినా కలిసి పనిచేస్తానంటూ చెబుతున్నారు.

ఇందులో భాగంగానే రేవంత్ ఇలా ప్లాన్ వేశాడని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఒక సీఎంగా తన గ్రాఫ్ ను మరింత పెంచుకునే క్రమంలో ఇలాంటి పనులు చేశాడని అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి ముందు ముందు ఇలాంటి పనులు చేసుకుంటూ వెళ్తే ఆయన గ్రాఫ్‌ మరింత పెరగడం ఖాయం అంటున్నారు రాజకీయ నిపుణులు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News