Chandrababu : రేవంత్ నుంచి చంద్రబాబు బాకీ వసూలు చేస్తారా..?

Qubetvnews - June 30, 2024 / 08:09 PM IST

Chandrababu : రేవంత్ నుంచి చంద్రబాబు బాకీ వసూలు చేస్తారా..?

Chandrababu : ఇప్పుడు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి, ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. వీరిద్దరూ గురు, శిష్యులు అని అందరకీ తెలిసిందే. పైగా ఇద్దరి మధ్య మంచి సన్నిహిత్యం కూడా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి నుంచి పాత బాకీలన్నీ వసూలు చేస్తాడా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే ఇప్పుడు ఏపీ ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగా లేదు. అప్పులు తెచ్చి మరీ వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఉమ్మడి ఆస్తులన్నీ తెలంగాణలోనే ఉండిపోయాయి. విభజన చట్టంలో అవి పంచాలని ఉంది.

కానీ కేంద్రం వాటిని పంచకుండా.. మీరు, మీరూ చూసుకోండని వదిలేసింది. దాంతో ఏపీ గట్టిగా అడగలేకపోతోంది. గతంలో 2014లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ ఏపీ నుంచి కరెంట్ ను వాడుకుంది. ఆ బకాయిలు మొత్తం రూ.6వేల కోట్లకు పై మాటే. కానీ ఆ బకాయిలు కేసీఆర్ చెల్లించలేదు. జగన్ సీఎం అయిన తర్వాత కూడా అడగలేదు. ఈ ఆరువేల కోట్లే ఎక్కువ అనుకుంటే.. ఉమ్మడి ఆస్తులను పంచుకుంటే.. ఏకంగా లక్ష కోట్లకు పైగా వస్తాయని అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు. కాబట్టి ఆస్తులు అయినా పంచి ఇవ్వాలి.. లేదంటే వాటికి సరిపడా డబ్బులు అయినా ఏపీకి తెలంగాణ చెల్లించాలి.

ఇన్ని రోజులు కేసీఆర్ ను చంద్రబాబు, జగన్ అడగలేదు. కానీ ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ అయ్యారు. ఏపీకి చంద్రబాబు సీఎం అయ్యారు. కాబట్టి ఏపీకి రావాల్సిన ఆస్తులను అడుగుతారని అంతా అనుకుంటున్నారు. ఒకవేళ చంద్రబాబు అడిగితే మాత్రం రేవంత్ ఇరకాటంలో పడ్డట్టే అవుతుంది. ఎందుకంటే అటు చంద్రబాబు తన గురువు కాబట్టి.. ఆయన మాటను కాదనలేడు. అలా అని ఆస్తులు రాసిస్తే మాత్రం తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అటు కేంద్రంలో ఉన్న బీజేపీ మాత్రం ఆస్తుల పంపకాల విషయంలో జోక్యం చేసుకోవట్లేదు.

ఎందుకంటే బీజేపీకి తెలంగాణలో అధికారం మీద ఆశలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ న్యూట్రల్ గా ఉంది. ఆ పని రేవంత్ చేస్తే మాత్రం ఆయనకు తిప్పలు తప్పవు. కాబట్టి ఎటు చూసుకున్నా రేవంత్ ఇరకాటంలో పడాల్సి వస్తుందని అంటున్నారు. మరి చంద్రబాబు అడుగుతారా.. లేదా.. అడిగితే రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాలి.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News