Chandrababu : రాజ్యసభ ఎన్నికలపై చంద్రబాబు యూటర్న్.. భయపడుతున్నాడా..?
Qubetvnews - February 17, 2024 / 07:03 AM IST
Chandrababu :
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాజ్యసభ ఎన్నికలు రాబోతున్నాయి. అయితే ఏ ఎన్నికలకు అయినా జగన్ సిద్ధంగానే ఉన్నారు. ఇప్పటికే ఈ మూడు రాజ్యసభ సీట్లకు వైసీపీ తరఫున నామినేషన్లు కూడా దాఖలయ్యాయి. మరి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు పార్టీ మాత్రం ఈ విషయంలో ఇంకా మౌనంగానే ఉండిపోయింది. చంద్రబాబు రాజకీయాల గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఏ పరిస్థితిని అయినా కూడా తన రాజకీయ కుతంత్రాలకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుంటారని వైసీపీ మొదటి నుంచి ఆరోపిస్తోంది.
ఇందుకు తగ్గట్టే చంద్రబాబు కూడా ఈ రాజ్యసభ ఎన్నికల్లో తన రాజకీయ కోణాన్ని బయట పెట్టాలనుకున్నారు. ఓ దళిత వ్యక్తితో నామినేషన్ వేయించాలని అనుకున్నారు. మరి రాజ్యసభకు ఎన్నిక కావాలంటే కనీసం 43 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. కానీ టీడీపీకి ఉన్నది కేవలం 18 మంది మాత్రమే. కాబట్టి వీరితో రాజ్యసభ సీటును సాధించడం అంత ఈజీ కాదని చంద్రబాబుకు తెలుసు. అందుకే ఆయన వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలకు గాలం వేస్తారని ప్రచారం జరిగింది. వైసీపీలో వచ్చే ఎన్నికలకు టికెట్లు రాని అసంతృప్త ఎమ్మెల్యేలతో రాజకీయ గేమ్ ఆడుతారని మీడియాల్లో కథనాలు వచ్చాయి.
వైసీపీలో కూడా చాలా మందికి టికెట్లు రావట్లేదు. దాదాపు 50 మందికి సిట్టింగ్ స్థానాలు పోతున్నాయి. కాబట్టి వారితో ఓట్లు వేయించుకుని ఒక స్థానం గెలవాలని చంద్రబాబు ఇన్ని రోజులు అనుకున్నారేమో. కానీ ఈ ఎమ్మెల్యేల ఓట్లు పడాలంటే పెద్ద ఎత్తున సంచులు కుమ్మరించాలి. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంత మందితో ఇంత రచ్చ అవసరమా అని చంద్రబాబు అనుకుంటున్నారు కాబోలు. 18 మంది మాత్రమే ఆయనకు ఉన్నారు. ఇంకా 25 మంది ఎమ్మెల్యేల ఓట్లు ఆయనకు కావాల్సి ఉంటుంది.
అంత మందికి టికెట్ హామీలు ఇవ్వడం అంటే పెద్ద రచ్చే అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఈ సారి రాజ్యసభ ఎన్నికలను ఆయన లైట్ తీసుకుంటున్నట్టు సమాచారం అందుతోంది. అందుకే ఈ రాజ్యసభ ఎన్నికలను పట్టించుకోవద్దని అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టాలని ఆయన టీడీపీ వర్గానికి చెప్పారంట.
అందుకే ఇప్పుడు టీడీపీలో రాజ్యసభ సీట్ల విషయంలో పెద్దగా ఎవరూ స్పందించట్లేదు. అసలు ఆ ఎన్నికలే తమకు తెలియదన్నట్టు సైలెంట్ అయిపోయారు. దాంతో ఇప్పుడు జగన్ కు తిరుగులేకుండా పోయిందని కామెంట్లు చేస్తున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు కుతంత్రాలు ఫలించలేదని.. అది తమ జగన్ సత్తా అని చెప్పుకుంటున్నారు.





