Pawan kalyan : పవన్ కు ఘోర అవమానం.. బీజేపీకి అన్ని సీట్లా.. జనసైనికుల ఆగ్రహం..!
Qubetvnews - March 12, 2024 / 11:45 AM IST
Pawan kalyan : ఏపీలో బీజేపీతో పోలిస్తే జనసేన చాలా బలమైన పార్టీ. అందులో ఎలాంటి అనుమానాలు లేవు. ఎందుకంటే జనసేనకు ఉన్న కేడర్ బీజేపీకి లేదు. ఇంకా చెప్పాలంటే గట్టిగా పోరాడితే మాత్రం జనసేన ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో టీడీపీ గ్రాఫ్ పడిపోతోంది కాబట్టి.. ఈ సమయంలో జనసేన ఒంటరిగానే పోరాడితే మాత్రం కచ్చితంగా మూడో ప్రత్యామ్నాయం అయ్యేందుకు అవకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు రాజకీయ నిపుణులు. కానీ ఎందుకో పవన్ కల్యాణ్ మాత్రం ఈ సారి తాను ఓడిపోతే రాజకీయ భవిష్యత్ ఉండదని చంద్రబాబుతో పొత్తులు పెట్టుకున్నారు.
అయితే చంద్రబాబుతో పొత్తులను మొదటి నుంచే జనసైనికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు తమకు ఎక్కడ తక్కువ సీట్లు కేటాయిస్తాడో అనే భయం ఇప్పటికీ జనసైనికుల్లో ఉంది. అనుకున్నట్టు గానే చాలా దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత జనసేనకు 24 ఎమ్మెల్యే సీట్లు, మూడు ఎంపీ సీట్లు కేటాయించారు చంద్రబాబు. దాంతో అప్పటి నుంచే జనసైనికులు చంద్రబాబుపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎందుకంటే తమకు ఇంత తక్కువ సీట్లు కేటాయిస్తే తమ పార్టీకి రాజకీయంగా ఎదుగుదల ఉండదనేది వారి అభిప్రాయం.
అయితే ఇప్పుడు బీజేపీతో పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో అప్పటి నుంచి చంద్రబాబు మార్క్ రాజకీయం స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. బీజేపీతో పొత్తులో భాగంగా పురంధేశ్వరిని కలవకుండానే నేరుగా బీజేపీ జాతీయ నేతలతో మాట్లాడి సీట్లను ఖరారు చేశారు. ఈ సీట్లలో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ సీట్లు, 6 లోక్ సభ సీట్లను కేటాయించారు. దాంతో ఇప్పుడు జనసైనికుల్లో ఆగ్రహం మరింత పెల్లుబికుతోంది. ఇంకా చెప్పాలంటే ఇది జనసేనకు, పవన్ కల్యాణ్ కు అవమానమే అంటున్నారు.
ఎందుకంటే బీజేపీకి ఏపీలో అరశాతం ఓటు కూడా లేదు. అలాంటి బీజేపీకి పది ఎమ్మెల్యే సీట్లు, ఆరు ఎంపీ సీట్లు కేటాయించారు. కానీ ఆరున్నర శాతం ఓటు బ్యాంకు ఉన్న జనసేనకు మాత్రం కేవలం 24 ఎమ్మెల్యే సీట్లు, మూడు ఎంపీ సీట్లు కేటాయించారు. మరి బీజేపీతో పోలిస్తే ఇది చాలా తక్కువ.
ఎందుకంటే బీజేపీ లెక్కన తమకు మరిన్ని ఎమ్మెల్యే సీట్లు, మరిన్ని ఎంపీ సీట్లు రావాల్సి ఉంటుంది. కానీ అలా చేయట్లేదు అంటే ఇది కచ్చితంగా చంద్రబాబు తమను అవమానించినట్టే అంటున్నారు జనసైనికులు.




