Memanth Siddham : మళ్లీ మనమే రావాలి.. మేమంతా సిద్ధం అంటూ జగన్ పిలుపు..!
Qubetvnews - March 28, 2024 / 12:22 PM IST
Memanth Siddham : జగన్ మళ్లీ జనంలోకి వచ్చారు. మొన్నటివరకు సిద్ధం సభలతో హోరెత్తించారు. జగన్ రాక ముందు ప్రజల్లో అంతో ఇంతో తిరుగుతూ తమకు తిరుగులేదని చెప్పారు ప్రతిపక్ష నేతలు. కానీ ఎప్పుడైతే జగన్ ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచే ప్రజల్లో అసలు ఆదరణ ఎవరికి ఉందనేది బయట పడిందని చెబుతున్నారు వైసీపీ నేతలు. సిద్ధం సభలు ఒకదాన్ని మించి మరొకటి పెద్ద సక్సెస్ అయిపోయాయి. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్సు యాత్రను చేపట్టారు. ఇంతకు ముందు సిద్ధం సభల్లో కార్యకర్తలకు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు.
ఇప్పుడు మేమంతా సిద్ధం పేరుతో జనాల్లోకి నేరుగా జగనే వెళ్లారు. ఇడుపులపాయలో దివంగత మహా నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించి తల్లి విజయమ్మ ఆశీస్సులు తీసుకుని యాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి నేరుగా ప్రొద్దుటూరులో సభ నిర్వహించారు. ఆ సభకు అశేష జనవాహిని సంద్రంలా తరలివచ్చింది. ఆ ప్రజలను ఉద్దేశించి జగన్ ఉద్వేగపూరితమైన స్పీచ్ ఇచ్చారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. గత ఐదేండ్లుగా తాను చేపట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని వివరించి చెప్పారు. ఇప్పటి వరకు ఎక్కడా అవినీతికి తావు లేకుండా చూశామన్నారు.
ఎక్కడా కూడా లంచాలకు చోటు లేకుండా సంక్షేమ పథకాలను అందించామని.. అర్హులకు లబ్ధి చేకూర్చామని స్పష్టం చేశారు. ఏపీలో ఇప్పుడు అందుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఇలాగే కొనసాగాలి అంటే కచ్చితంగా మళ్లీ మనమే రావాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. టీడీపీ.. దాని అనుకూల మీడియా ద్వారా ప్రభుత్వం మీద ఎలా దుష్ప్రచారం చేస్తున్నదీ అయన ప్రజలకు వివరించారు. వైసీపీ ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలతో మాత్రమే కాకుండా.. ఆస్పత్రులు, అభివృద్ధి పనులు, స్కూళ్ల అభివృద్ధి, పరిశ్రమలు ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధిని చాటామన్నారు.
చంద్రబాబుకు ప్రజల అవసరాలతో సంబంధం లేదని.. కేవలం పొత్తు రాజకీయాలతో అధికారంలోకి రావాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు సీఎం జగన్. ఎన్నికల ముందే ఏదో హడావిడి చేసేసి ఆకాశాన్ని చూపించి ఓట్లు అడుగుతారని.. తర్వాత పత్తా లేకుండా పోతారని విమర్శించారు జగన్.
అంతే కాకుండా రాజకీయాల కోసం కుటుంబంలో చిచ్చు పెడుతున్నారంటూ మండిపడ్డారు. వివేకానంద రెడ్డి జీవించి ఉన్నపుడు విలన్ గా చూపించి అయన మరణించాక అయన కుటుంబానికి మద్దతు తెలుపుతున్నారని మండి పడ్డారు. ఆనాడు సీనియర్ ఎన్టీఆర్ ను ఇలాగే నిందించి అధికారం, పార్టీని లాక్కున్నారని.. ఇప్పుడు అదే చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా మొత్తంగా ఈ మొదటి సభతో అటు ప్రజల్లో ఉత్సాహం నింపారు. అంతే కాకుండా వారికి తానున్నాననే భరోసా ఇచ్చారు. ఇటు కార్యకర్తలకు అభయం ఇచ్చారు. అటు ప్రతిపక్షాలకు వార్నింగ్ ఇచ్చారు.




