AP BJP : పవన్ కు షాక్ ఇస్తున్న కమలనాథులు.. ఇక చంద్రబాబు ఆశలు గల్లంతేనా..?
Qubetvnews - February 17, 2024 / 11:26 AM IST
AP BJP :
ఏపీలో వైసీపీ చాలా బలంగా ఉంది. ఎవరు ఔనన్నా కాదన్నా ఇది నిజం. వైసీపీ పార్టీ రీసెంట్ గా పెట్టిన సభలకు వస్తున్న జనాలే దీనికి సాక్ష్యం. అందుకే వైసీపీని ఓడించాలంటే తన ఒక్కటి వల్ల కాదని పవన్ కు తెలుసు. వాస్తవానికి పవన్ కల్యాణ్ తన పార్టీ రాజకీయంగా ఎదగడం కంటే కూడా చంద్రబాబును సీఎం చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఈ క్రమంలోనే జగన్ ను ఓడించి చంద్రబాబుకు అధికారం కట్టబెట్టడం అంటే తన ఒక్కడి వల్ల కాదని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. మొన్నటి వరకు బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ సడెన్ గా రూట్ మార్చి చంద్రబాబు పంచన చేరారు.
చంద్రబాబుతో పొత్తులు అయితే పెట్టుకున్నారు తప్ప ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే ఇదిలా ఉంటే చంద్రబాబును సీఎం చేయడం కోసం టీడీపీ-జనసేన బలం కలిపినా సరిపోదనే భావనలో ఉన్నారు పవన్ కల్యాణ్. అందుకే తమ జట్టులో బీజేపీని కూడా కలుపుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇందుకోసం ఢిల్లీలో మొన్నటి వరకు ఉండి విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే తాజాగా ఆ పార్టీ మాజీ ఏపీ అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు అయిన సోము వీర్రాజు చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది. ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ సొంతంగా పోటీ చేస్తుందని తెలిపాడు.
25 ఎంపీ సీట్లలో, 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపాడు సోము వీర్రాజు. దాంతో పవన్ కు ఇది షాక్ అనే చెప్పుకోవాలి. పవన్ చేస్తున్న ప్రయత్నాలన్నీ ఉత్తవే అని తేలిపోయింది. అసలు సోము వీర్రాజును అధ్యక్ష పదవి నుంచి తప్పించి పురంధేశ్వరికి పగ్గాలు అప్పగించడం వరకు బీజేపీలో ఉన్న చంద్రబాబు కోవర్టులు చక్రం తిప్పారనే ప్రచారం ఉంది. అందుకు తగ్గట్టే పురంధేశ్వరి కూడా చంద్రబాబుకు అనుకూలంగా ముందుకు సాగుతున్నారు. అందుకే సోము వీర్రాజు చంద్రబాబుతో కలిసి వెళ్లడానికి ఇష్టపడట్లేదు. బీజేపీలో చాలామంది నేతలు పురందేశ్వరికి వ్యతిరేకంగానే ఉన్నారు.
ఆమె రీసెంట్ గా మాట్లాడుతూ ఏపీలో పొత్తుల గురించి తాము అధిష్టానానికి చెప్పేశామని.. వారు నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. అయితే జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న సోము వీర్రాజు ఈ ప్రకటన చేశారు అంటే ఆయనకు అధిష్టానం నుంచి సంకేతాలు ఉంటేనే మాట్లాడుతారు కదా.
అంటే చంద్రబాబు, పవన్ కోసం పని చేయడానికి బీజేపీ నేతలు సిద్ధంగా లేరని దీన్ని బట్టి అర్థం అవుతోంది. ఇది పవన్ కు మాత్రమే కాదు చంద్రబాబుకు కూడా కోలుకోలేని దెబ్బ అనే చెప్పుకోవాలి. అయోధ్యలో రామ మందిరం కట్టిన తర్వాత మోడీ ఇమేజ్ పెరిగింది. అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి ఓటు బ్యాంకు కూడా పెరిగింది. కాబట్టి ఏపీలో కూడా ఆ పార్టీకి ఓటు బ్యాంకు పెరిగి ఉంటే దాన్ని తన ఖాతాలో వేసుకోవాలిన చంద్రబాబు ఆశపడ్డారు. కానీ బీజేపీ ఆయనకు ఇలా షాక్ ఇచ్చేసింది.




