YS Jagan : బిగ్ న్యూస్.. సీఎం జగన్ పై రాళ్ల దాడి.. కుడి కనుబొమ్మపై గాయం..!
Qubetvnews - April 14, 2024 / 11:22 AM IST
YS Jagan : ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మాటల దాడి నుంచి చివరకు చేతల దాడి వరకు వచ్చాయి. ఇప్పుడు సీఎం జగన్ బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా జగన్ బస్సు యాత్రలో రాళ్ల దాడి దుమారం రేపుతోంది. విజయవాడలో బస్సు యాత్ర చేస్తున్న సందర్భంలో కొందరు అగంతకులు సీఎం జగన్ మీద రాళ్ల దాడి చేశారు. బస్సు యాత్ర ఘనంగా సాగుతున్న సమయంలో పార్టీ కార్యకర్తలు పూలవర్షం కురిపించారు.
అదే అదునుగా అగంతకులు రాళ్ల దాడి చేశారు. ఒక రాయి జగన్ ఎడమ కంటిపై తాకడంతో గాయం అయింది. కను బొమ్మపై రక్తస్రావం అయింది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ జగన్ పై రాళ్లదాడిని అడ్డుకున్నారు. జగన్ చుట్టూ చేరి రాళ్లు జగన్ మీద పడకుండా అడ్డుకున్నారు. వెంటనే హుటాహుటిని బస్సును లోపలికి తీసుకెళ్లారు. జగన్ కు ప్రథమ చికిత్స చేయించిన తర్వాత మళ్లీ బస్సు యాత్రను ప్రారంభించారు. అయితే రాళ్ల దాడి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. అటు ఇదే రాళ్ల దాడిపై షర్మిల స్పందించారు.
రాళ్ల దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ విచారణ చేపట్టి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి దాడులను ప్రజాస్వామ్యంలో ఉపేక్షించేది లేదని ఆమె స్పష్టం చేశారు. అటు చంద్రబాబు నాయుడు కూడా దానిపై స్పందించారు. జగన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా లోకేష్ కూడా దానిపై స్పందిస్తూ కౌంటర్ వేశారు. రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావమ్మా అంటే.. నేను ఇంకెక్కడి నుంచి వస్తా.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చా అని రాసుకొచ్చారు.
దానికి 2019లో జరిగిన కోడికత్తిని, ఇప్పటిరాయి ఫొటోలను పోస్టు చేస్తూ వ్యంగ్యంగా స్పందించారు. ఇక జనసేన పార్టీ కూడా వ్యంగ్యంగానే స్పందించింది. జగన్ మీద జరిగిన దాడి వ్యూహమో, అబద్దమో, బూటకమో, నాటకమో వైసీపీనే చెప్పాలంటూ కౌంటర్ వేసింది. కానీ ఇటు వైసీపీ మాత్రం దానిపై తీవ్రంగా స్పందిస్తోంది.
విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ అగంతకులే జగన్ మీద దాడి చేశారంటూ మండిపడ్డారు. దాడులతో అధికారంలోకి రావాలని చూస్తున్నారంటూ తెలిపారు. ఈ విషయంపై ఈసీ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాగా తనపై జరిగిన దాడి పట్ల జగన్ ఇంకా స్పందించలేదు.




