Congress : ఆ విషయంలో కేసీఆర్ ను టార్గెట్ చేయబోతున్న కాంగ్రెస్..!
Qubetvnews - March 25, 2024 / 09:44 AM IST
Congress : రాజీకీయాల్లో ఎప్పుడు ఎవరు ఏ విషయంలో టార్గెట్ చేయాలో ముందే డిసైడ్ చేసుకుంటారు. గతంలో సదరు రాజకీయ నేత అనుసరించిన విధానాలను మళ్లీ దృష్టిలో ఉంచుకుని మరీ.. అలాంటి సందర్భం వచ్చినప్పుడు దాన్ని అస్త్రంగా బయటకు తీస్తుంటారు. ఇప్పుడు కేసీఆర్ విషయంలో కూడా అలాంటి పని చేయడానికి రెడీ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకోసం పెద్ద ప్లానే వేస్తున్నారు. ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆమెను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు ఈడీ అధికారులు.
ఇప్పుడు ఆమెను బయటకు తీసుకురావడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు కేటీఆర్. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోనే ఉంటూ కవితను బయటకు తీసుకువచ్చేందుకు పెద్ద పెద్ద లాయర్లతో మాట్లాడుతున్నారు. అయినా సరే ఇప్పట్లో కవిత బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదని అంటున్నారు. కాగా గతంలో కేసీఆర్ ఈటల రాజేందర్ విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈటల అప్పట్లో మంత్రిగా ఉన్నప్పుడే ఏదో భూములు కబ్జా చేశాడంటూ ఆరోపనలు వచ్చాయని.. ఆయన్ను మంత్రి పదవి నుంచి తీసేశారు.
అంతే కాకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరి అప్పుడు ఈటల రాజేందర్ మీద ఆరోపణలు వస్తేనే ఆయన్ను మంత్రి పదవి నుంచి తీసేసిన కేసీఆర్.. ఇప్పుడు కూతురు కవితను ఏకంగా ఈడీ అరెస్ట్ చేసినా సరే ఎందుకు స్పందించట్లేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఇదే అంశాన్ని రేపు ఎన్నికల్లో వాడుకోవాలని భావిస్తున్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈటలపై యాక్షన్ తీసుకున్నట్టే కవిత మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా.. అంటే ఈటలకు ఒక రూల్.. కవితకు ఒక రూలా అని రేవంత్ త్వరలోనే ఈ విషయంపై టార్గెట్ చేయబోతున్నారు.
ఇందుకోసం అన్ని విధాలుగా సోషల్ మీడియా అకౌంట్లను కూడా సిద్ధం చేసుకుంటున్నారంట రేవంత్ రెడ్డి. త్వరలోనే కేసీఆర్ ను ఈ విషయంలో పెద్ద ఎత్తున విమర్శించడానికి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు.
కనీసం కూతురు తప్పు చేయలేదని కూడా చెప్పకుండా నిమ్మకుండిపోయారు. దాంతో కవిత నిజంగానే తప్పు చేసిందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇదే అంశాన్ని ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో క్యాష్ చేసుకోవడానికి రేవంత్ వ్యూహాలు రచిస్తున్నారంట. చూడాలి మరి ఆయన ఏం చేస్తారో.





