Kcr : తెలంగాణలో విద్యుత్ రగడ.. కేసీఆర్ లేఖతో ఆగుతుందా..?
Qubetvnews - June 15, 2024 / 04:26 PM IST
Kcr : తెలంగాణలో ఇప్పుడు విద్యుత్ కొనుగోళ్ల మీద రగడ సాగుతోంది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై రేవంత్ రెడ్డి సర్కార్ కమిషన్ వేయడం సంచలనం రేపింది. ఈ విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం ఈ కమిషన్ ను వేసింది. అయితే దానిపై కమిషన్ కూడా కొన్ని కామెంట్లు చేసింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో టెండర్ల మాదిరి కాకుండా నామినేషన్ల ప్రక్రియలో దీన్ని చేశారని.. అంతే కాకుండా విద్యుత్ శాఖతో సంబంధం లేకుండా ప్రభుత్వమే దీన్ని ఎలా చేసిందని.. అంతే కాకుండా ఛత్తీస్ ఘడ్ తో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై కేసీఆర్ తన పాత్రను తెలియజేయాలని కోరింది.
జూన్ 15లోపు సమాధానాలు ఇవ్వాలని నోటీసులు కూడా ఇచ్చింది కమిషన్. అయితే ఇప్పుడు దానిపై కేసీఆర్ సంచలన లేఖ రాశారు కమిషన్ కు. 12 పేజీల లేఖను విడుదల చేశారు కేసీఆర్. ఈ లేఖలో అటు రేవంత్ సర్కార్ ను, ఇటు కమిషన్ ను ఏకిపారేశారు. అసలు విద్యుత్ కొనుగోళ్ల మీద రాజకీయ కక్షతోనే కమిషన్ వేశారని.. తమ ప్రభుత్వ హాయంలోనే విద్యుత్ విషయంలో గనణీయమైన మార్పులు తెచ్చామని చెప్పారు కేసీఆర్. తెలంగాణలో 24 గంటల కరెంట్ తమ ప్రభుత్వంలోనే జరిగిందని తెలియజేశారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా కమిషన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందని తెలిపారు.
కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి స్వచ్ఛందంగా కమిషన్ నుంచి వైదలగాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ వ్యవహరించిందని తప్పుబట్టారు. వాస్తవానికి తాను జూన్ 15లోగా సమాధానం ఇవ్వాలనుకున్నానని.. కానీ కమిషన్ విచారణ న్యాయబద్ధంగా లేదని కేసీఆర్ తప్పుబట్టారు. అందుకే తాను కమిషన్ విచారణ కమిషన్ ముందు హాజరుకాలేదంటూ ఆయన వివరించారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం విషయంలో విద్యుత్ విచారణ కమిషన్ ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో సమాధానం ఇచ్చారు కేసీఆర్.
అయితే ఇప్పుడు దీనిపై రేవంత్ రెడ్డి సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే కాళేశ్వరం విషయంలో నానా రచ్చ జరగ్గా.. ఇప్పుడు కొత్తగా విద్యుత్ కొనుగోళ్లపై జరుగుతోంది. రాను రాను మిగతా వాటిపై కూడా కమిషన్లు వేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
అయితే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ హయాంటో జరిగిన వాటిపై రేవంత్ రెడ్డి సర్కార్ అడగడం.. కేసీఆర్ సమాధానాలు చెప్పడం.. ఇదే రాజకీయం నడుస్తోంది. కానీ బీఆర్ ఎస్ ను కొత్త రాజకీయాలు తెరమీదకు రావట్లేదు. ఎంపీ ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి బీఆర్ ఎస్ సైలెంట్ గానే కనిపిస్తోంది.





