Revanth Reddy : ఫిరాయింపు ఎమ్మెల్యేలకు రేవంత్ షాక్.. ఆ పదవులు లేనట్టే..?
Qubetvnews - June 29, 2024 / 08:01 PM IST
Revanth Reddy : ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఎంతైనా అధికారంలో ఉన్న పార్టీలోకి ప్రతిపక్షంలో ఉన్న నేతలు వెళ్లడం కామన్. అయితే ఎమ్మెల్యేలు వెళ్తున్నారంటే మాత్రం వారికి కచ్చితంగా ఏదో ఒక పదవి ఆశ ఉంటుందని అందరూ భావిస్తుంటారు. అది వాస్తవంగా కూడా జరిగేదే. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే కాంగ్రెస్ లో చేరేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇతర పార్టీల నేతలు. ఎక్కువగా బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ లో చేరుతున్నారు. అయితే ఇలా వారందరూ చేరడానికి ముఖ్య కారణం ఉందంట.
అదేంటంటే.. చేరుతున్న ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదో ఒక కీలక పదవి అయితే ఖాయం అని వారంతా నమ్ముతున్నారంట. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ తక్కువ మెజార్టీతో అధికారం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ కంటే కొంత మంది ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నారు. అందుకే కాంగ్రెస్ ఇప్పుడు ఇతర పార్టీ ల నుంచి వచ్చే ఎమ్మెల్యేలకు రెడ్ కార్పెట్ వేస్తుందని రాష్ట్ర రాజకీయాల్లో చర్చలు జరుగుతున్నాయి. అందరూ రేవంత్ ను కలుస్తున్నారు. ఎవరు చేరాలన్నా సరే రేవంత్ హామీ మీదనే పార్టీలో చేరుతున్నారు. మరీ ముఖ్యంగా అందరూ మంత్రి వర్గ విస్తరణపై ఆశలు పెట్టుకుంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కువగా మంత్రులు లేరు కాబట్టి.. త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని.. తమకు పదవులు వస్తాయని అందరూ ఆశలు పెంచుకుంటున్నారు. అయితే వారి ఆశలపై రేవంత్ రెడ్డి తాజాగా నీళ్లు చల్లాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని కొందరు ఇష్టం వచ్చిన ప్రచారాలు చేస్తున్నారని.. వాస్తవానికి అందులో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడున్న మంత్రులు అందరూ సమర్థవంతంగా పనిచేస్తున్నారని.. మంత్రి వర్గ విస్తరణ ఉండదని తెలిపారు. ఒకవేళ ఉన్నా సరే పార్టీ ఫిరాయించి వచ్చిన వారికి అవకాశం ఉండదన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఉండే వారికి మాత్రమే అవకాశాలు ఉంటాయని తెలిపారు రేవంత్. దాంతో ఫిరాయింపు దారులకు అతిపెద్ద షాక్ తగిలినట్టు అయింది. ఇన్ని రోజులు ఏదో ఆశ పెట్టుకుని కాంగ్రెస్ లోకి వస్తే.. ఇలా చేశారేంటని అంతా మండిపడుతున్నారు.





