Gaami movie review : గామి సినిమా రివ్యూ

Qubetvnews - March 8, 2024 / 11:54 AM IST

Gaami movie review : గామి సినిమా రివ్యూ

Gaami movie review : విశ్వక్ సేన్ అంటే అందరికీ కమర్షియల్ సినిమాలు, లవ్ స్టోరీ సినిమాలు గుర్తుకు వస్తుంటాయి. అయితే ప్రతి సినిమాలో కొత్తదనాన్ని కోరుకోవడం విశ్వక్ సేన్ కు చాలా అలవాటు. ఈ క్రమంలోనే ఆయన కొత్తదనంతో ఉన్న కంటెంట్ తో సినిమా చేశానని చెప్తున్నాడు. అదే గామి మూవీ. చాందిని చౌదరి హీరోయిన్ గా చేసిన ఈ సినిమా నేడు థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటికే ట్రైలర్, టీజర్ తో బాగానే ఆకట్టుకున్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ..

ఇది చాలా కొత్తరకమైన కథ. శంకర్ (విశ్వక్ సేన్) అఘోరా ఆశ్రమంలోనే జీవిస్తుంటాడు. కాగా అతనికి ఓ వింత సమస్య ఉంటుంది. ఎవరైనా అతన్ని తాకినా లేదంటే అతను ఎవరినైనా తాకినా సరే అస్సలు తట్టుకోలేడు. శరీరం వెంటనే రంగు మారిపోతుంది. దాంతో ఇది అతనికి మహా దేవుడు అతనికి ఇచ్చిన శాపం అని అఘోరాలంతా కలిసి ఆశ్రమం నుంచి బయటకు వెళ్లగొట్టేస్తారు. ఇది తాను ఎన్నడూ పరిష్కరించుకోలేనేమో అని బాధపడుతున్న సమయంలో అతనికి డాక్టర్ జాహ్నవి (చాందినీ చౌదరి) తోడుగా ఉంటుంది. ద్రోణ పర్వతంలో 36 ఏళ్లకు ఒకసారి వికసించే మాలపత్రాలను పొందితే ఆ సమస్య పోతుందని వారికి తెలిసి.. దాని కోసం బయలు దేరుతారు. అయితే శంకర్ కు పదే పదే ఓ బాలిక ఉమ (హారిక), సీటీ 333 (మహమ్మద్) వ్యక్తులు కాపాడమని వేడుకుంటున్నట్టుగా కనిపిస్తుంటారు. అసలు వారితో శంకర్ కు ఉన్న సంబంధం ఏంటి.. చివరకు మాల పత్రాలు సాధించి సమస్య నుంచి బయటపడ్డాడా లేదా అనేది తెరపై చూడాల్సిందే.

నటీనటుల పర్ఫార్మెన్స్..

శంకర్ పాత్ర విశ్వక్ సేన్ గతంలో చేసిన పాత్రలన్నింటికంటే భిన్నంగా ఉంటుంది. హైపర్ బాడీ లాంగ్వేజ్ కు పూర్తి భిన్నంగా నటించాడు. డైలాగ్ డెలివరీలో మూడీగా, విచారంగా, సున్నితంగా ఉంటూ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. నటుడిగా పెద్దగా ఎమోషనల్ డెప్త్ లేకపోయినా గామిలో అతని ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అతని కెరీర్ కు మంచి పేరు తెస్తుంది. హీరోయిన్ గా కంటే సపోర్టింగ్ రోల్ లోనే చాందిని చౌదరి ఎక్కువగా నటించింది. ఇందులో ఆమె పాత్రను రెండు కోణాల్లో చూపించి మెప్పించింది.

టెక్నికల్ పర్ఫార్మెన్స్..

కొత్త డైరెక్టర్ విద్యాధర్ కగితా చాలా క్లిష్టమైన కంటెంట్ ను ఎంచుకున్నాడు. మొదటి సినిమానే ఇలాంటి వెరైటీ కథలను ఎంచుకోవడం అంటే సాహసమే. అయితే దాన్ని హ్యాండిల్ చేయడంలో ఆయన బాగానే సక్సెస్ అయ్యాడు. హీరో గెటప్ నుంచే ఆయన దర్శకత్వాన్ని చూపించారు. అరుదైన సమస్యకు పరిష్కారం చూపిస్తూ మరింత ఆసక్తిని రేకెత్తించేలా దర్శకుడు దాన్ని మరింత పెంచాడు. ప్రధాన పాత్ర హిమాలయాల గుండా ప్రయాణించి, రకరకాల సవాళ్లను ఎదుర్కొంటూ ఉండటంతో సినిమాపై ఆసక్తి తగ్గదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు అద్భుతమైన విజువల్స్ సినిమాకి ప్రాణం పోశాయి. అక్కడక్కడా కొన్ని సీన్లు స్లోగా సాగడం, విజువల్ ఎఫెక్ట్స్ కొంత తక్కువగా ఉండటం లాంటివి ఉన్నా.. కథలో ఉండే ఆసక్తి వాటిని అధిగమిస్తుంది.

ప్లస్ పాయింట్లు..

కొత్త రకమైన కథ
కథనాన్ని నడిపించిన విధానం
ఫ్రెష్ ప్లాట్ VFX

మైనస్ పాయింట్లు..

అక్కడక్కడా లాగ్ ఉండటం
సీన్లు కొన్ని చోట్ల లింక్ లేకుండా ఉండటం

చివరగా..

కొత్త రకమైన కథలను ఇష్టపడేవారికి గామి సినిమా కచ్చితంగా నచ్చుతుంది. అక్కడక్కడా కొన్ని లోపాలు ఉన్నా సరే ఒకసారి చూసే విధంగా ఉంటుంది ఈ మూవీ.

రేటింగ్ః 2.75

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News