Revanth Reddy : ఈవీఎంలపై రేవంత్ సంచలనం.. ఆయన గెలుపుపైనే అనుమానాలు..?
Qubetvnews - July 5, 2024 / 11:18 AM IST
Revanth Reddy : 2024 ఎన్నికల తర్వాత దేశ వ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఇండియా కూటమి నేతలు ఈవీఎంలను ఎన్నికల్లో బ్యాన్ చేయాలని.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు. ఎందుకంటే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని.. బీజేపీ అలాగే అధికారంలోకి వస్తోందని పదే పదే అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు ఆ ఇండియా కూటమిలోని లోకల్ పార్టీలు ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. అయితే ఇక్కడ ఓ విషయం జాగ్రత్తగా గమనించాలి. అదేంటంటే.. ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు కేవలం జాతీయ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది.
అంతే తప్ప ఏ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో.. ఆ రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు గానీ, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు గానీ ఈ ట్యాంపరింగ్ ఆరోపణలు చేయట్లేదు. ఇండియా కూటమిలోని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న లోకల్ పార్టీలు కూడా ఈ ట్యాంపరింగ్ ఆరోపణలు చేయలేదు. ఎందుకంటే అప్పటికే రాష్ట్రాల్లో తాము అధికారంలో ఉన్నాం కాబట్టి.. ఆ ఆరోపణలు చేస్తే తమ గెలుపుపైనే అనుమానాలు వ్యక్తం అవుతాయనేది వారికి తెలుసు. కానీ ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మర్చిపోయినట్టు ఉన్నారు. నిన్న ఢిల్లీలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల రోజున ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చు అంటూ బాంబు పేల్చారు. 15 శాతం ఈవీఎంలను పోలింగ్ రోజున ట్యాంపరింగ్ చేయొచ్చని ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఛాన్స్ దొరికిదే రేవంత్ మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ ఆడేసుకుంటోంది బీఆర్ ఎస్ పార్టీ. ఇలాంటి సమయంతో బీఆర్ ఎస్ పార్టీకి ఒక అస్త్రం ఇచ్చినట్టు అయిపోయింది రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు ఇలా ట్యాంపరింగ్ ఆరోపణలు చేస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఓడిపోయింది కాబట్టి రాహుల్ గాంధీ ఈ ఆరోపణలు చేయడంలో ఓ అర్థం ఉంది.
కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ ఆరోపణలకు ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అని అంటున్నారు రాజకీయ నాయకులు. ఎందుకంటే ట్యాంపరింగ్ చేయొచ్చు అని రేవంత్ ఎలా అంటారు.. అలా అంటే ఆయన కూడా ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చారా అనే అనుమానాలకు తావు ఇచ్చినట్టు అవుతుంది.
ఏ ఈవీఎంల ఆధారంగా అయితే కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉందో.. వాటి మీదనే ఆరోపణలు చేస్తే మాత్రం కచ్చితంగా తమ గెలుపు మీదనే ప్రశ్నలు వస్తాయనేది వారు గుర్తుంచుకోవాలి.




