Kcr : కేసీఆర్ కు ఒకేసారి రెండు దెబ్బలు.. ఇటు రేవంత్.. అటు మోడీ..!
Qubetvnews - July 14, 2024 / 11:54 AM IST
Kcr : మాజీ సీఎం కేసీఆర్ రాజకీయ జీవితాన్ని చూసుకుంటే.. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి మొన్న అధికారం కోల్పోయే వరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కున్నారు. అసాధ్యం అనుకున్న రాష్ట్రాన్ని సాధించి చూపించారు. అంతే కాకుండా ప్రతి ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకుంటూ వచ్చారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆయన.. ఒకేసారి కుప్ప కూలిపోయారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి పార్టీ గ్రాఫ్ క్రమంగా తగ్గుతూనే వస్తోంది. ఎక్కడైనా సరే అధికారంలో ఉన్న పార్టీ గ్రాఫ్ తగ్గడాన్ని మనం చూస్తుంటాం.
కానీ ఇక్కడ మాత్రం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ ఎస్ గ్రాఫ్ తగ్గుతూ వస్తుండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. కేసీఆర్ తలచుకుంటే మళ్లీ పార్టీని గాడిలో పెడుతారని.. రాబోయే పదిహేనేళ్లు బీఆర్ ఎస్ అధికారంలో ఉంటుందని బీఆర్ ఎస్ నేతలు చెబుతున్నా.. ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఆగట్లేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 9 మందిని చేర్చుకుంది. ఈ అసెంబ్లీ సమావేశాల సమయానికి మొత్తం ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటారని తెలుస్తోంది. దాంతో బీఆర్ ఎస్ హైరానాలో పడిపోయింది. అంటే బీఆర్ ఎస్ ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలో కలిపేసుకుంటారన్నమాట.
ఇదే విషయం ఇప్పుడు బీఆర్ ఎస్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇదే సమయంలో ఇప్పుడు మరో కోలుకోలేని దెబ్బ తగులుతున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే.. బీఆర్ ఎస్ కు ఇప్పుడు రాజ్యసభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. వారంతా కూడా బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. బీజేపీలో చేరితేనే తమకు భవిష్యత్ ఉంటుందని వారు భావిస్తున్నారంట. ఇప్పటికే కేంద్ర పెద్దలతో చర్చలు కూడా జరుగుతున్నాయని.. త్వరలోనే నలుగురు ఒకేసారి చేరబోతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ ఎస్ కు ఇప్పటికే లోక్ సభలో సభ్యులు లేకుండా పోయారు.
ఇప్పుడు రాజ్యసభలో కూడా లేకుండా పోతే.. అసలు పార్లమెంట్ లోనే బీఆర్ ఎస్ కు సభ్యులు లేకుండా పోతారు. ఒక ప్రాంతీయ పార్టీకి పార్లమెంట్ లో సభ్యులు లేకుండా పోవడం అంటే.. ఆ పార్టీ ఉనికికే ప్రమాదం అని చెప్పుకోవాలి. ఇటు అసెంబ్లీలో అటు పార్లమెంట్ లో సభ్యులు లేకుండా పోవడం అంటే.. బీఆర్ ఎస్ పతనమే అని అంటున్నారు.
మరి దీన్ని కేసీఆర్ ఎలా ఎదుర్కుంటారనేది ఇంకా తెలియట్లేదు. కేసీఆర్ ఎంత చేసినా ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ మారకుండా ఉండట్లేదు. ఇలాంటి సమయంలో రాజ్యసభ ఎంపీలను కాపాడుకుంటారా లేదా అనేది చూడాలి.





