Revanth Reddy : గెలిచే వారికే టికెట్లు.. రేవంత్ మార్క్ యాక్షన్..!
Qubetvnews - March 23, 2024 / 11:41 AM IST
Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రతి విషయంలో తనదైన మార్క్ ను చూపిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై నడిపించి పార్టీని విజయతీరాలకు చేర్చిన రేవంత్.. ఇప్పుడు ప్రతి విషయంలో కూడా ఇలాగే తన మార్క్ ను చూపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించిన వ్యక్తిగా రేవంత్ కు పేరుంది. అందకే ఆయన మీద నమ్మకం ఉంచిన ఢిల్లీ అధిష్టానం పార్టీ ఎంపీ ఎన్నికల తెలంగాణ కమిటీ చైర్మన్ గా నియమించింది. అందుకే ఆయన ఈ సారి ఢిల్లీ పెద్దల నమ్మకాన్ని కాపాడుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల్లో గెలిచే నేతలు అన్ని నియోజకవర్గాల్లో లేరు.
ఈ విషయం రేవంత్ కు కూడా తెలుసు. అందుకే ఆయన బీఆర్ ఎస్ నుంచి కొంతమంది బలమైన నేతలను పార్టీలో చేర్చుకున్నారు. అంతే కాకుండా అన్ని విధాలుగా తన మార్క్ ను చూపిస్తున్నారు. కాగా ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ లో ఉన్న వారికే టికెట్లు ఇస్తే అనుకున్న స్థానాల్లో గెలపు సాధ్యం కాదని రేవంత్ కు బాగా తెలుసు. అందుకే పార్టీలో ఉన్న వారికి మాత్రమే కాకుండా గెలిచే సత్తా ఉన్న వారికే టికెట్లు కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే బీఆర్ ఎస్ నుంచి చేరిన లీడర్లకు టికెట్లు కట్టబెట్టారు. చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డికి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ కు టికెట్ కేటాయించారు.
వీరితో పాటు మరికొంతమందికి కూడా బీఆర్ ఎస్ నుంచి వస్తున్న వారికే టికట్లు కేటాయిస్తున్నారు. ఎందుకంటే రేవంత్ ఇక్కడ రెండు లక్ష్యాలను పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. అదేంటంటే కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆయన నిలబెట్టుకోవాలి. దాంతో పాటు కాంగ్రెస్ లో తన వర్గాన్ని పెంచుకోవాలి. కాంగ్రెస్ లో ఇప్పుడు ఆయన వర్గం మొన్నటి వరకు ఆర్థికంగా లేనివారే ఉన్నారు. కానీ ఇప్పుడు బీఆర్ ఎస్ నుంచి వస్తున్న ఆర్థికంగా బలంగా ఉన్న లీడర్లను ఇప్పుడు రేవంత్ తన వర్గంలో చేర్చుకుంటున్నారు. వారికి టికెట్లు కేటాయించి తన వెంట ఉండేలా చూసుకుంటున్నారు.
ఇది ఆయనకు రాజకీయంగా కలిసొచ్చే అంశం అని అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ లో మొన్నటి వరకు నల్గొండ నేతల హవానే సాగింది. కానీ ఇప్పుడు రేవంత్ వర్గం అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో బలంగా ఉంటే తనకు తిరుగు ఉండదని భావిస్తున్నారు రేవంత్ రెడ్డి.
ఇందులో భాగంగానే ఈ సారి ఎంపీ ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న వారికి మాత్రమే టికెట్లు కేటాయించి తన టార్గెట్ ను రీచ్ అవుతున్నారు. మరి ఇది రాజకీయంగా రేవంత్ రెడ్డికి ప్లస్ అవుతుందని భావిస్తున్నారే తప్ప.. ఏ మాత్రం మైనస్ కాదని అంటున్నారు. చూడాలి మరి ఆయన ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో.


