Revanth Reddy : కాంగ్రెస్ మంత్రి వర్గ విస్తరణ లేనట్టే.. ఆశావహులకు పెద్ద షాక్..?
Qubetvnews - June 27, 2024 / 09:06 PM IST
Revanth Reddy : తెలంగాణలో రేవంత్ సర్కార్ కొలువు దీరి ఏడు నెలలు గడుస్తోంది. అయితే ప్రభుత్వం ఏర్పడ్డ సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆ సమయంలోనే మరింత మంది మంత్రి పదవుల కోసం ఆశపడ్డారు. అందులో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. కానీ వారికి ఎవరికీ కూడా అప్పుడు మంత్రి పదవి దక్కలేదు. కానీ రెండో దఫా మార్పులో కచ్చితంగా తమకు మంత్రి పదవి వస్తుందనే ఆశలతో చాలా మంది ఉన్నారు. వారే కాకుండా కొంత మంది బీఆర్ ఎస్ నుంచి వచ్చిన బలమైన లీడర్లు కూడా మంత్రి పదవులను ఆశించి వచ్చినట్టు తెలుస్తోంది.
కానీ వారికి కూడా మంత్రి పదవి ఇంకా దక్కలేదు. వారు ఎంతగా రేవంత్ మీద ఒత్తిడి తెచ్చినా సరే.. ఇదిగో.. అదిగో అన్నట్టు రేవంత్ వర్గం నుంచి సంకేతాలు వెళ్లాయి. అయితే ఇప్పుడు వారందరికీ కూడా పెద్ద షాక్ తగిలింది. అసలు మంత్రి వర్గ విస్తరణే లేదని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాజాగా కాంగ్రెస్ లో అలకబూనిన జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ఢిల్లీ అధిష్టానం ఆయన్ను పిలిపించింది. ఇందులో భాగంగా వారితో భేటీ అయ్యాక ఢిల్లీలోని సీఎం రేవంత్ నివాసానికి జీవన్ రెడ్డి వెళ్లారు. హై కమాండ్ జీవన్ రెడ్డికి పెద్ద హామీ ఇచ్చిందని వార్తలు వచ్చాయి.
కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అంతా అనుకున్నారు. అయితే జీవన్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో ఆయన మాట్లాడుతూ.. జీవన్ రెడ్డికి ఇచ్చిన హామీ వేరే ఉందని చెప్పారు. ఇక మంత్రి పదవుల విస్తరణ ఉంటుందని కొందరు చెబుతున్నారని.. అలాంటిదేమీ లేదని కుండ బద్దలు కొట్టేశారు రేవంత్. మంత్రి పదవులు ఖాళీగా లేవని.. ఉన్న వారంతా సమర్థులే అని చెప్పారు. తన వద్ద ఉన్న శాఖలను తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు వివరించారు సీఎం రేవంత్. కాగా ఆయన వ్యాఖ్యలతో ఆశావహులు అందరూ షాక్ అవుతున్నారు.
ఇన్ని రోజులు మంత్రి పదవులు వస్తాయనే ఆశతో రేవంత్ కు సహకరించామని వారు చెబుతున్నారు. కాగా రేవంత్ మంత్రి పదవులు ఇవ్వకపోతే చాలా మంది వ్యతిరేకంగా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇన్ని రోజులు అన్ని విధాలుగా రేవంత్ కు అండగా ఉన్న వారు దూరంగా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, జానారెడ్డి, వీహెచ్ మనుమంతరావుతో పాటు మరికొంత మంది సీనియర్లు రేవంత్ పై తిరుగుబాటు జెండా ఎగరేసే అవకాశం కూడా ఉందంటున్నారు. మరి రేవంత్ వారికి వేరే పదవులు ఏమైనా ఇస్తారా లేదా అనేది మాత్రం చూడాలి.
