CM YS Jagan : సీమలో సమరానికి ‘సిద్ధం’!

Qubetvnews - February 17, 2024 / 12:39 PM IST

CM YS Jagan : సీమలో సమరానికి ‘సిద్ధం’!

CM YS Jagan :

ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తుల లెక్క తేలనేలేదు. అటు వైపు సీఎం జగన్ మాత్రం తన ఎన్నికల శంఖారావాన్ని పూరించేశారు. ఎన్నికల ప్రచారంలో తలమునకలైన సీఎం జగన్ ప్రచారాస్త్రాలను ఎక్కుపెడుతున్నారు. జగన్ అనంతపురం రాప్తాడు జిల్లా పర్యటనకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 7 విడతల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికల తరువాత మరికొందరిని ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే రాప్తాడులో సీఎం సిద్ధం సభ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏపీలో ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్.. సిద్ధం సభలతో కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు.

ఇప్పటికే విశాఖ, దెందులూరులో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. అయితే ఈనెల 18న అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్‌ సిద్ధం సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దెందులూరు సిద్ధం సభలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అనంతపురం జిల్లా పోలీసులు ఈ సారి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు . సీఎం జగన్ నడుచుకుంటూ వెళ్లే ర్యాంప్‌, గ్యాలరీలకు మధ్య దూరాన్ని భారీగా పెంచారు పోలీసులు. దెందులూరు సిద్ధం సభలో సీఎం జగన్.. ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళుతున్న సమయంలో ర్యాంప్ పైకి అభిమానులు, కార్యకర్తలు దూసుకొచ్చారు. ఓ అభిమానైతే అత్యుత్సాహంతో ర్యాంప్ పైకి సీఎం జగన్‌ను హగ్ చేసుకున్నాడు.

ఆ అభిమాని చేసిన పనికి ఒక్కసారిగా సీఎం సెక్యూరిటీ కంగుతిన్నారు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది పటిష్ఠమైన చర్యలను ప్రారంభించింది. ఇందులో భాగంగానే.. సీఎం జగన్ నడుచుకుంటూ వెళ్లే ర్యాంప్ కి, గ్యాలరీలకు మధ్య మరో రెండు ఫుట్ పాత్ లను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ చెప్పారు. ఫుట్ పాత్‎పై స్థానిక పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు ఉన్నతాధికారులు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భద్రత ఏర్పాటు చేస్తున్నారు.

గత ఎన్నికల్లో రాయలసీమ నాలుగు జిల్లాల్లోని 52 నియోజకవర్గాల్లో 49 స్థానాలు గెలిచిన వైయస్సాఆర్ కాంగ్రెస్ ఇప్పుడు ఆ మూడింటిని గెలిచి సీమను క్లిన్ స్వీప్ చేసే దిశగా వ్వ్యూహాలు రూపొందిస్తోంది. ఈ మేరకు శ్రేణులను కార్యోన్ముఖులను చేసేందుకు, రాష్ట్ర చరిత్రలో అత్యంత భారీ బహిరంగ సభగా దీన్ని నిర్వహించేందుకు సువిశాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి వైఎస్సార్‌, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి లక్షల సంఖ్యలో పార్టీ కేడర్‌, అభిమానులు, ప్రజలు తరలిరానున్నారు.

వైయస్ జగన్ ప్రసంగానికి ముందు కార్యకర్తలను అభివాదం చేస్తూ నడిచేందుకు వేదిక ముందు పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్‌ ఆకారంలో భారీ వాక్‌ వే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడే బహిరంగ సభా వేదికతో పాటు పదుల సంఖ్యలో గ్యాలరీలు నిర్మించారు. నియోజకవర్గాల వారీగా వచ్చే వారందరూ గ్యాలరీలకు చేరుకునేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణానికి వెనుక భాగంలో హెలిప్యాడ్‌ సిద్ధం చేశారు. ఇప్పటి వరకు 25కి పైగా పార్కింగ్‌ ప్రాంతాలు గుర్తించారు. దాదాపు పది లక్షల మంది కార్యకర్తలు వచ్చేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News