Pawan Kalyan : అనుచరులపై పవన్ ఆగ్రహం.. మరీ అంత చులకనా

Qubetvnews - February 17, 2024 / 07:42 AM IST

Pawan Kalyan : అనుచరులపై పవన్ ఆగ్రహం.. మరీ అంత చులకనా

Pawan Kalyan :

ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికారపార్టీ సింగిల్ గా పోటీ చేస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం సాధ్యమైనన్ని పార్టీతో పొత్తుకు సై అంటున్నాయి. పొత్తులకు ఓకే అంటున్నాయి కానీ ఇంతవరకు సీట్ల సర్ధుబాటు మాత్రం కాలేదు. సీట్ల విషయమై చర్చల మీద చర్చలు జరుపుతున్నారు కానీ ఏదీ తేలడం లేదు. ఈ క్రమంలోనే పొత్తు నిబంధనలు పట్టించుకోకుండా ఎవరికి తోచిన విధంగా వారు తమ అభ్యర్థులను ప్రకటించుకుంటున్నారు. ఇదేందని ప్రశ్నించిన పార్టీ కార్యకర్తలపై అగ్రనేతలు మండిపడుతున్నారు. వాస్తవానికి కార్యకర్తలే పార్టీకి బలం అన్న సంగతి అగ్రనేతలు గుర్తుంచుకోవాలి. కాదు, నా మాటే వేదం.. నేను చేసిందే శాసనం అంటే అదే వారికి మైనస్ అవుతుంది.

ఇప్పుడు జనసేన పార్టీ అధినేత కూడా కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చెప్పింది మాత్రమే చేయండంటూ గుస్సాయించాడట. తను ఒకర్ని తీసుకురమ్మంటే వారెల్లి నలుగురిని తీసుకువచ్చారంట. అందుకే జనసేనానికి కోపం వచ్చిందట. అసలు విషయం ఏమిటంటే జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఓ విషయమై తన అనుచరుల మీద కోపోద్రిక్తుడు అయ్యాడట. తూర్పుగోదావరి మండపేట నియోజకవర్గానికి టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ తరఫున నిలబడే అభ్యర్ధిని ప్రకటించాడట. ఈ విషయం జనసేన పార్టీకి చెప్పలేదు. ఏం చేసినా, ఎలా చేసినా జనసేన చచ్చినట్లు తమతోనే ఉంటుందని తెలుగుదేశం పెద్దలు చాలా ఈజీగా తీసుకున్నట్లున్నారు. కానీ ఓట్ల బదిలీ, జనసేన జనాలు అసంతృప్తి చెందకుండా చూడాల్సిన బాధ్యత పవన్ మీద వున్నాయి కదా? అందుకే మండపేటలో జనసేన టికెట్ ఆశించిన వ్యక్తిని తీసుకువస్తే, బుజ్జగిద్దామని ఆయన అనుకున్నారట.

ఈ విషయమై ఆయనను తీసుకురమ్మని తన అనుచరులను పురమాయించినట్లు తెలుస్తోంది. వాళ్లు వెళ్లి ఏకంగా ముగ్గురు నలుగురిని తీసుకువచ్చారట. వాళ్లు పాపం, అమాయకంగా తమ నేత మనోగతం తెలియకుండా, మండపేటలో తెలుగుదేశం చేస్తున్న పనులు, తమ విజయావకాశాలు, వివరించి, జనసేన పోటీ చేయాల్సిందే. గెలుపు పక్కా అంటూ చకచకా మాట్లాడేశారని తెలుస్తోంది. అన్నీ విని, వాళ్లకు చెప్పాల్సింది చెప్పి పంపించి, ఆ తరువాత వారి తీసుకుని వచ్చిన తన అనుచరుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒక్కరిని తీసుకురమ్మంటే మీరెళ్లి అంత మందిని ఎందుకు తెచ్చారని పవన్ తన అనుచరులపై మండిపడ్డాడట.

మీరు టికెట్ ఆశించిన వారిని తీసుకురమ్మన్నారని తెచ్చామని వారు బదులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద పవన్ కోపానికి అనుచరులు కాస్త అసహనం వ్యక్తం చేశారని.. అందువలనే ఈ వార్త బయటకు పొక్కినట్లు తెలుస్తోంది. అలాగే పొత్తులపై విమర్శలు చేయవద్దని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ మేరకు జ‌న‌సేన పార్టీ ఫేస్‌బుక్ పేజీలో కూడా ఓ లేఖ విడుదల చేశారు. జనహితం, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పొత్తుల దిశగా ముందుకు వెళుతున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్న దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News