Chandrababu : చంద్రబాబుకు సవాల్ గా మారిన అభ్యర్థుల ప్రకటన.. రోజుకో షాక్..!
Qubetvnews - March 30, 2024 / 12:32 PM IST
Chandrababu : చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. ఒక పార్టీకి ఎక్కువ కాలం పాటు అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. అంతే కాకుండా మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది. ఇలాంటి వ్యక్తికి ఒక పార్టీ మీద ఎంత పట్టు ఉండాలి. ఆ పార్టీలో ఆయన ఒక మాట చెబితే చిన్న కార్యకర్త నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఆ మాటకు కట్టుబడి ఉండాలి. అలా ఉంటేనే ఆయనకు ఆ పార్టీ మీద పూర్తి పట్టు ఉన్నట్టు. లేదంటే మాత్రం ఆయన మాట ఎవరూ వినట్లేదనే అర్థం చేసుకోవాలని చెబుతున్నారు రాజకీయ నేతలు.
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఇప్పుడు టీడీపీ మీద ఎలాంటి పట్టు లేదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు కూటమిలో భాగంగా కొన్ని చోట్ల జనసేనకు టికెట్లు కేటాయించిన చోట టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఇప్పటికే చాలా చోట్ల పార్టీలకు రాజీనామాలు చేస్తున్నారు. పార్టీ ఆఫీసులోకి వెళ్లి నానా రచ్చ చేస్తున్నారు. చంద్రబాబు ఫొటోలు, ఫ్లెక్సీలను కాల్చివేస్తున్నారు. అనపర్తి, అనంతపురం అర్బన్, గుంతకల్లు, చీపురుపల్లి నియోజకవర్గాల్లో ఇప్పటికే ఆశావహులు ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఇప్పుడు తాజాగా మరో నియోజకవర్గం కూడా ఇదే లిస్టులో చేరిపోయింది. అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీ ఇన్ చార్జిగా బత్యాల చెంగల్రాయుడు టికెట్ ఆశించారు. కానీ ఆయన్ను కాదని రాయచోటికి చెందిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యానికి టికెట్ కేటాయించారు చంద్రబాబు. దాంతో చెంగల్రాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అంతే కాకుండా తన అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెబుతున్నారు. ఇక ఆయన తాజాగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాజంపేట నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు.
దాంతో ఇప్పుడు చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఇలా చాలా చోట్ల టీడీపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లోనే టీడీపీ ఆశావహులు ఇండిపెండెంట్లుగా పోటీ చేయడం ఆయనకు కోలుకోలేని షాక్ కలిగిస్తోంది. ఇలా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తుంటే టీడీపీ అభ్యర్థులు ఓడిపోయే ప్రమాదం ఉంది.
ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న ఓట్లు రెండు వర్గాలుగా చీలిపోతాయి. దాంతో టీడీపీ నుంచి పోటీ చేసే వారు ఓడిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇలా మొత్తానికి ఇప్పుడు చంద్రబాబుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆయన ఒకటి ఆశిస్తే మరొకటి జరుగుతుంది.





