Revanth Reddy : రేవంత్ సవాల్.. కేటీఆర్ కు గొప్ప అవకాశమే..?
Qubetvnews - February 29, 2024 / 01:28 PM IST
Revanth Reddy :
ఇప్పుడు తెలంగాణలో బీఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు రాజకీయాలు సాగుతున్నాయి. అందులోనూ గత వారం రోజులుగా కేటీఆర్ కు రేవంత్ కు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇందులో భాగంగా మొన్న కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సీఎం అని కాంగ్రెస్ ముందే ప్రకటిస్తే ఆ పార్టీకి కనీసం మూడు సీట్లు కూడా వచ్చేవి కాదని తెలిపారు. అయితే ఆ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి ఘాటైన సమాధానమే ఇచ్చారు. మొన్న చేవెళ్లలో నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్ నిప్పులు చెరిగారు. తాను అయ్య పేరు చెప్పుకుని సీఎం కుర్చీలో కూర్చున్న వాడిని కాదని చెప్పారు రేవంత్.
తమ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని చాలానే ప్రయత్నాలు చేస్తున్నారని.. ఎన్ని కుట్రలు చేసినా కుర్చీని ముట్టుకోలేరంటూ హెచ్చరించారు రేవంత్. అంతే కాకుండా కేటీఆర్ వ్యాఖ్యలపై సవాల్ విసిరారు. ఎవడో సన్నాసి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి సీఎం అని ఎన్నికలకు ముందే చెబితే కాంగ్రెస్ కు మూడు సీట్లు కూడా వచ్చేవి కావని చెప్తున్నాడు. నేను కేటీఆర్ కు ఈ వేదిక మీద నుంచి చెబుతున్నా.. ఇప్పుడు ముఖ్యమంత్రిని నేనే, టీపీసీసీ చీఫ్ ను కూడా నేనే. నీకు దమ్ముంటే వచ్చే ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకుని నువ్వు మగాడివని నిరూపించుకో అంటూ సవాల్ విసిరారు.

Revanth Reddy Challenges KTR
ఈ సవాల్ ఇప్పుడు కేటీఆర్ కు గొప్ప అవకాశమే అని చెబుతున్నారు రాజకీయ నిపుణులు. ఎందుకంటే ఎంత లేదన్నా బీఆర్ఎస్ కు ఇంకా ప్రజల్లో బలం ఉంది. ఆపార్టీ సాధించిన ఎమ్మెల్యే సీట్లే ఈ విషయాన్ని చెబుతున్నాయి. కాబట్టి ఎంపీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఎన్నో కొన్ని సీట్లు సాధించడమే ఖాయమే. పైగా ఇప్పటికే అన్ని పార్టీల కంటే ముందే ఎంపీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి.. బలంగా పని చేసేందుకు అవకాశాలు కూడా ఉంటాయి. ఒక్క సీటు గెలవాలంటూ రేవంత్ విసిరిన సవాల్ ను గెలవడం కేటీఆర్ కు పెద్ద కష్టం కాదు.
అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి సవాల్ కేటీఆర్ కు అవకాశమే అంటున్నారు. ఒక్క సీటు కంటే ఎక్కువ గెలిచి బీఆర్ఎస్ సత్తా ఏంటో తన పనితనం ఏంటో చూపించుకోవచ్చు కేటీఆర్ కు. అంతే కాకుండా రేవంత్ సవాల్ ను గెలిస్తే మాత్రం రేవంత్ కు తన సమర్థత ఏంటో చెప్పే అవకాశం కూడా ఉంటుంది.
రేవంత్ విసిరింది పెద్ద సవాల్ కాదు. ఎందుకంటే గత ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లు తెచ్చుకోమని కేటీఆర్ కు చెబితే అది పెద్ద సవాల్ అయి ఉండేది. కానీ ఒక్క సీటు గెలిస్తే మగాడివే అంటూ చెప్పాడు కాబట్టి కేటీఆర్ కు దాన్ని అధిగమించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఇది రేవంత్ కు కౌంటర్ విసరడానికి కేటీఆర్ కు మంచి ఛాన్స్.



