Revanth Reddy : కేసీఆర్ సభకు రేవంత్ కౌంటర్.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో చెక్..?
Qubetvnews - February 17, 2024 / 07:37 AM IST
Revanth Reddy :
ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ ఎస్ అన్నట్టు పోరు సాగుతోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టాలని బీఆర్ ఎస్ పెద్ద ప్లానే వేస్తోంది. తెలంగాణలోని ప్రాజెక్టులను కేఆర్ ఎంబీకి అప్పగించడం మీద బీఆర్ ఎస్ పెద్ద ఎత్తున పోరాటానికి రెడీ అవుతోంది. అది తెలంగాణ ప్రజల హక్కులకు విరుద్ధంగా ఉందని.. రేవంత్ సర్కార్ ప్రజా వ్యతిరేక చర్యలకు దిగుతోందంటూ బీఆర్ఎస్ బాగానే ప్రచారం చేస్తోంది. అంతే కాకుండా దీనిపై పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రచారం చేయడానికి రెడీ అవుతోంది. స్వయంగా కేసీఆర్ దీని మీద మాట్లాడబోతున్నారు.
మొన్నటి వరకు తుంటి ఆపరేషన్ వల్ల ఇంటికే పరిమితం అయిన కేసీఆర్.. ఇప్పుడు దాదాపు కోలుకున్నారు. అందుకే ఆయన రేపు అంటే మంగళవారం రోజున నల్గొండలో భారీ సభను ప్లాన్ చేస్తున్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడంపై నల్గొండలో బహిరంగ సభను పెట్టి పెద్ద ఎత్తున ప్రజలకు వివరించబోతున్నారు. మరి కేసీఆర్ ఇలాంటి ఉద్యమానికి తెరలేపితే నేనెందుకు ఊరుకోవాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారేమో.. అందుకే ఇప్పుడు ఆయన కూడా కేసీఆర్ సభకు కౌంటర్ వేయాలని అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు తన మంత్రివర్గంతో రెడీ అయిపోయారు.
కేసీఆర్ తన సర్కార్ ను ఇరుకున పెట్టాలని అనుకుంటే.. కాళేశ్వరం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో ఆయనకు కౌంటర్ వేయాలని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఇందుకోసం కేసీఆర్ సభ పెడుతున్న రోజునే రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు తన మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లబోతున్నారు. కుంగిన మేడిగడ్డ బ్యారేజీని, మునిగిన పంప్ హౌస్ లను పరిశీలించబోతున్నారు. లక్ష కోట్లు పెట్టి తాము అద్భుతమైన ప్రాజెక్టును కట్టామని చెప్పుకుంటున్న బీఆర్ ఎస్ కు.. ఎలాగైనా చెక్ పెట్టేయాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేసుకుంటున్నారు.

Revanth Reddy To Inspect Kaleshwaram Project
అందుకే కాళేశ్వరం మీద ఆ ప్రాజెక్ట్ వద్దనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అసలు కాళేశ్వరం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి.. కాళేశ్వరం మీద నేషనల్ డ్యామ్ అథారిటీ ఇచ్చిన లోపాలను కూడా ప్రజలకు వివరించబోతున్నారు. నాణ్యతా లోపాలు, ఇతరత్రా సమస్యలను వివరించబోతున్నారు.
కాళేశ్వరం వల్ల కలిగిన అప్పులు.. అసలు కాళేశ్వరం వల్ల ఎక్కడ పొలాలు పారాయో కూడా రేవంత్ రెడ్డి వివరించబోతున్నారు. దీని వల్ల కేసీఆర్ సభ ఎఫెక్ట్ ప్రజల మీద పడకుండా చూసుకోబోతున్నారు. అది ఒక రకంగా కేసీఆర్ పార్టీకి మైనస్ అనే అంటున్నారు రాజకీయ నిపుణులు.



