Pawan Kalyan : పిఠాపురం నుంచి జనసేనాని? ఇక్కడా కష్టమేనా…?
Qubetvnews - February 28, 2024 / 02:41 PM IST
Pawan Kalyan :
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో నెలన్నర మాత్రమే సమయముంది. ఇప్పటికే తెలుగు దేశం, జనసేన పార్టీల పొత్తు ఖరారైంది. రెండు పార్టీలు ఇప్పటికే కొన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశాయి. అయితే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం జనసేనాని పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అనే. ఈ విషయంలో మాత్రం క్లారిటీ లేదు. మొన్నటి వరకు భీమవరం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ కార్యకర్తలు భావించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ భీమవరం, గాజువాక నియోజక వర్గాల నుంచి పోటీ చేసి కూడా పరాజయం పాలయ్యారు.
ఈసారి ఒక్క స్థానం నుంచే పోటీ చేయాలని పవన్ భావిస్తున్నారని, అది భీమవరం అంటూ బలంగా ప్రచారం జరిగింది. కానీ భీమవరం నుంచి పోటీ చేస్తే గెలుపు అంత సులభం కాదని, అక్కడ అర్బన్ ఓటర్లు ఎక్కువగా ఉన్న కారణంగా పవన్ కు ఓట్లు ఎక్కువగా పడే అవకాశం లేదు అన్నట్లుగా సొంత సర్వేల్లో వెళ్లడయ్యిందట. అందుకే రూరల్ ఓటర్లు ఎక్కువగా ఉండే పిఠాపురం నుంచి పోటీ చేయాలని పవన్ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అక్కడ రెండు సార్లు వేర్వేరు సంస్థలతో పవన్ సర్వే చేయించుకున్నారని, అక్కడ పోటీ చేస్తే గెలుపు సులభం అంటూ సర్వే లో వెళ్లడయ్యిందని సమాచారం. అక్కడ పోటీ చేస్తే తెలుగు దేశం పార్టీ ఓటు బ్యాంక్ ట్రాన్స్ ఫర్ కాకున్నా కూడా పవన్ గెలిచే అవకాశాలు ఉన్నాయని అక్కడి నాయకులు అనుకుంటున్నారు.
పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు పవన్ గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారట. ఇప్పటికే అక్కడ హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం ప్లేస్ ను లీజ్ కు తీసుకున్నారని, అక్కడ పార్టీ ఆఫీస్ ను పెద్దగా ఏర్పాటు చేయడంతో పాటు పవన్ కోసం నివాసం ఏర్పాటు చేయాలని కూడా స్థానిక జనసేన నాయకులకు ఆదేశాలు వెళ్లాయని తెలుస్తోంది. మొత్తానికి పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం దాదాపుగా కన్ఫర్మ్ అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ ఈసారి ఏమాత్రం ఛాన్స్ తీసుకోకుండా, రిస్క్ చేయకుండా ఈజీగా గెలిచే స్థానం ని ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే పిఠాపురం ను ఎంపిక చేసుకున్నట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
అయితే పిఠాపురం నుంచి పవన్ పోటీలో ఉండాలని నిర్ణయించుకోవడానికి కారణం కాపులు అధికంగా ఉన్నారనే. పవన్ అంచనా, సర్వేలు ఆ విధంగా ఉన్నప్పటికీ గతంలో భీమవరం, గాజువాకలో కూడా కాపుల ఓట్లు అధికంగా ఉన్నాయనే పోటీలో ఉన్నారు. అయినా రెండు చోట్ల ఓడిపోయారు. ఒక్క కాపుల ఓట్లతోనే గెలుస్తారా? అనేది పవన్ ఆలోచించుకోవాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ నిలకడలేమి తనం కాకపోతే గతంలో పోటీ చేసి ఓడిపోయినా స్థానాల నుంచే మళ్లీ పోటీ చేస్తే కనీసం సానుభూతితోనైనా గెలిచేవారు. ఇలా నియోజవర్గాలను మార్చుకుంటూ వెళ్తే తనకంటూ ఓ నియోజకవర్గం లేకుండా పోతోంది. చంద్రబాబుకు కుప్పం, జగన్ కు పులివెందుల, బాలకృష్ణకు హిందూపురం, లోకేశ్ మంగళగిరి అన్నట్టుగా పవన్ కు ఇప్పటికీ ఒక సొంత నియోజకవర్గం లేకపోవడాన్ని బట్టే పవన్ రాజకీయాలు ఎలా ఉన్నాయో తెలుస్తోంది.
కాపులు ఎక్కువగా ఉన్నారనే కారణంతో పిఠాపురం నుంచి పోటీ చేసినా అక్కడా గెలుస్తారనే నమ్మకం కలగడం లేదు. ఎందుకంటే ఆయన ఎన్నడూ కాపుల ఓట్లపైనే ఆధారపడితే అలాంటి ఫలితాలే వస్తాయి. నాయకుడు అంటే జనాలకు ఒక నమ్మకం కలిగించాలి. ఒక్క మాట మీద నిలబడాలి. ఏదైనా హామీ ఇస్తే దాని కోసం ప్రాణాలైన ఇవ్వగలగాలి. అలాంటి వారినే జనాలు తమ నాయకుడిగా గుర్తిస్తారు. అలాంటి వారినే గెలిపిస్తూ ఉంటారు. మరి ఈ లక్షణాల్లో పవన్ కు ఎన్ని ఉన్నాయో తరచి చూసుకుంటే మంచిది.



