Ys Jagan : మంచి తనమే జగన్ కొంప ముంచుతోందా.. షర్మిల అర్థం చేసుకోదెందుకు..?
Qubetvnews - October 25, 2024 / 01:03 PM IST
Ys Jagan : మంచితనానికి రోజులు లేవు ఈ కాలంలో అనే సామెత జగన్ కు నిజంగా సరిపోతుందని అంటున్నారు వైసీపీ లీడర్లు. సొంత చెల్లిపై ఎనలేని ప్రేమనే ఆయన కొంప ముంచిందని అంటున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో తండ్రి సంపాదించిన ఆస్తుల్లో కూతుర్లకు ఎవరైనా వాటా ఇస్తున్నారా.. పెళ్లి సమయంలోనే ఎంతో కొంత ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. వారి పెళ్లి తర్వాత తండ్రి సంపాదించిన ఆస్తులు కూడా ఇవ్వట్లేదు. అలాంటిది తండ్రి చనిపోయిన పదేండ్ల తర్వాత.. తన చెల్లెలు పెళ్లి అయి 20 ఏండ్లు గడచిన తర్వాత కూడా జగన్ షర్మిలకు ఆస్తులు ఇవ్వాలనుకున్నారు.
అదే ఆయన కొంప ముంచింది. జగన్ చెబుతున్న దాంట్లో చాలా వాస్తవాలు ఉన్నాయి. ఆయన ఏమంటున్నారంటే.. మన నాన్న బతికి ఉన్నప్పుడు ఇద్దరికీ సమానంగా ఆస్తులు పంచేశారు. ఆ తర్వాత నేను సొంతంగా వ్యాపారాలు చేసి ఆస్తులు సంపాదించుకున్నాను. నీపై నాకు ఉన్న ప్రేమతో మన నాన్న చనిపోయిన పదేండ్లకు అంటే నీ పెళ్లి అయిన 20 ఏళ్లకు నా కంపెనీల్లో వాటా ఇస్తానని చెప్పాను. దానికోసం ఎమ్ వోయూ ఒప్పందం కూడా చేసుకున్నాను. ఈడీ అటాచ్ మెంట్ అయిపోయిన తర్వాత వాటిని నీ పేరు మీదకు బదిలీ చేస్తానని హామీ కూడా ఇచ్చాను.
కానీ ఇలా కేసులు ముగియక ముందే ఆస్తులను ట్రాన్స్ ఫర్ చేసుకోవడం ఏంటంటూ జగన్ ప్రశ్నిస్తున్నారు. ఆయన మాటల్లో నిజమే ఉంది కదా. తండ్రి సంపాదించిన ఆస్తులే ఈ రోజుల్లో చెల్లెళ్లకు, అక్కలకు ఎవరూ ఇవ్వట్లేదు. ఒక తండ్రికి వారసుడు ఉంటే తన సంపాదనలో కూతురు పెళ్లి సమయంలోనే కట్న కానుకల పేరుతో ఎంతో కొంత ఇచ్చేసి ఆమె బాధ్యతలు తీర్చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఎంత సంపాదించినా సరే వాటిల్లో చిల్లగవ్వ కూడా కూతుర్లకు ఇవ్వట్లేదు. అయినా సరే జగన్ తండ్రి బతికి ఉన్నప్పుడే ఆస్తుల్లో వాటా ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. అది సరిపోదని తాను సొంతంగా సంపాదించుకున్న ఆస్తుల్లో వాటా ఇవ్వడానికి ప్రధాన కారణం ఆయన గుండెల్లో చెల్లెలు మీద ఉన్న ప్రేమనే.
దాన్ని షర్మిల ఎందుకు అర్థం చేసుకోవట్లేదు. ఇంత చేసిన అన్నకు ఆమె కృతజ్ఞతాభావంతో ఉండాలి. సరే అలా లేకపోయినా కూడా జగన్ ను అయితే ఇబ్బందుల్లో పడేయొద్దు కదా. ఈడీ అటాచ్ మెంట్ అయిపోయిన తర్వాత ఆమె ఆస్తుల్లో వాటా గురించి ప్రస్తావించి ఉంటే బాగుండేది. కానీ అటాచ్ మెంట్ పూర్తి కాక ముందే ఇలా ఆస్తులను ట్రాన్స్ ఫర్ చేసుకుంటే జగన్ బెయిల్ రద్దవుతుందని ఆమెకు తెలియదా.. తెలిసే ఇలా చేశారా. అన్న జైలుకు వెళ్తే ఆమెకు కలిగే ఆనందం ఏంటి.. తన బాగు కోరే అన్నను ఇబ్బందుల్లో నెట్టడం వెనక అర్థం ఏంటి..?
ఆమె ఇంత చేసినా సరే జగన్ మాత్రం ఆమెను ఏమీ అనట్లేదు. ఈడీ అటాచ్ మెంట్ ఉండగా ఎందుకు చేసుకున్నారు అని అడుతున్నారు. అది ఆయన్ను జైలుకు వెళ్లేలా చేస్తుంది కాబట్టే జగన్ ప్రశ్నిస్తున్నారు. కుటుంబ వ్యవహారాలను రోడ్డుకు ఈడిస్తే అది ప్రత్యర్థులకు ప్రచార అస్త్రం అవుతుందని షర్మిల ఎందుకు మర్చిపోతున్నారు. తన అన్న బాగుంటే తనకే మేలు చేస్తాడనే విషయాన్ని షర్మిల ఎందుకు మర్చిపోతున్నారని అడుగుతున్నారు వైసీపీ లీడర్లు. ఇప్పటికైనా షర్మిల తన దూకుడు తగ్గించుకుని జగన్ కోసం ఒక అడుగు ముందుకు వేయాలని కోరుతున్నారు.



