Bandi Sanjay : నాపై కేసులు పెట్టినా మీ కష్టాల్లో తోడుగా ఉన్నా : బండి సంజయ్
Qubetvnews - May 12, 2024 / 10:45 AM IST
Bandi Sanjay :
కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఎన్నికల ప్రచారం చివరి రోజు కూడా అదే ఉత్సాహంతో రోడ్ షో లో పాల్గొన్నారు. శనివారం బండి సంజయ్ కి మద్దతుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ హాజరు అయ్యారు. బండి సంజయ్, రాజా సింగ్ ల రోడ్ షో కు భారీ ఎత్తున కార్యకర్తలు మరియు ప్రజలు హాజరు అయ్యారు. రోడ్ షో లో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలపై బండి సంజయ్ మరియు రాజా సింగ్ లు నిప్పులు చెరిగారు.
తీవ్ర స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై విమర్శలు చేయడంతో పాటు బీజేపీకి ఓటు వేస్తేనే దేశం అభివృద్ది చెందుతుంది, లేదంటే దేశం మళ్లీ వెనక్కు వెళ్తుంది అన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… నేను అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే కేసీఆర్ కరీంనగర్ కు వచ్చి మత చిచ్చు పెట్టిండు. ముస్లింలంతా ఒక్కటై నన్ను ఓడించాలని పిలుపు నిచ్చాడు. కాబట్టి ఇప్పుడు హిందువులంతా ఒక్కటవ్వాలి. హిందువులంతా నా వెంట ఉన్నారనే ధైర్యంతోనే గల్లీగల్లీలో తిరిగి మీకోసం పోరాడుతున్నా. మీరే నా ధైర్యం… మీరే నా ఆశ… మీరే నా శ్వాస…నా పోరాటానికి అండ దండ మీరే. దేశంలో ముస్లింల జనాభా పెరిగితే.. హిందూ జనాభా 8 శాతానికి తగ్గింది. ఇదే జరిగితే భారత్ పరిస్థితి ఏమిటో, ఎలాంటి ప్రమాదకర స్థితిలోకి మారబోతుందో అర్ధం చేసుకోండి.
మీరు నన్ను ఎంపీగా గెలిపిస్తే… మళ్లీ కొట్లాడుడే, కరీంనగర్ కు ఇంకా నిధులు తీసుకొచ్చి, అభివృద్ధి చేసుడే. కేసీఆర్ సర్కార్ మెడలు ఎట్లా వంచానో… 6 గ్యారంటీలతో మోసం చేసిన కాంగ్రెస్ మెడలు కూడా వంచి, హామీలన్నీ అమలయ్యేలా చూస్తా. హిందూ బంధువులారా… కరీంనగర్ ఎంపిగా నన్ను గెలిపించి ధర్మరక్షకుల దమ్మేందో చూపించండి. మీకు రక్షణగా నిలిచేందుకు నేను ఎప్పటిలాగే సిద్ధంగా ఉంటాను. జైలుకు పోయినా సరే జనం కోసమే నిలబడ్డా… కేసులు పెట్టినా సరే కష్టాల్లో తోడుగా ఉన్నా… నా ప్రజల కోసం లాఠీ దెబ్బలు తిన్నా… నా వాళ్ల జోలికొస్తే లాగులు తడిసేలా ఉరికించిన…
నిత్యం మీతోనే ఉన్నా… మీతోనే ఉంటా అన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశ ద్రోహానికి పాల్పడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికిపోతారనే భయంతో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ వద్దనున్న దేశ భద్రత డేటాను ధ్వంసం చేశారన్నారు. అలాంటి దేశద్రోహిని ఇంత వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ లేని భారత్ దేశాన్ని ఊహించుకోలేమని చెప్పిన బండి సంజయ్.. మోదీ మళ్లీ ప్రధాని కాకుంటే భారత్ మరో పాకిస్తాన్ లా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.
కొన్ని ఇస్లామిక్ సంస్థలు భారత్ ను మరో ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు చేస్తున్న కుట్రలో భాగమే ముస్లిం జనాభా పెరుగుదల అని పేర్కొన్నారు. పొరపాటున కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిస్తే.. వాళ్లంతా ‘‘హమ్ చార్… హమారే చాలీస్ అనే విధానానికి ఓటేస్తారని ఎద్దేవా చేశారు. ఎన్ని పార్టీలు ఎంత ప్రచారం చేసినా ప్రజలంతా కోరుకునేది ఒక్కటే.. మోదీ మళ్లీ ప్రధాని కావాలని.. బండి సంజయ్ మళ్లీ ఎంపీ కావాలని కోరుకుంటున్నారన్నారు. నేనెవరో మీకు తెలుసు మీకోసం టవర్ సర్కిల్, రాంనగర్ చౌరస్తా, తెలంగాణ చౌరస్తా, బస్టాండ్ సహా గల్లీ గల్లీలో కొట్లాడిన. ధర్మానికి ఆపదొస్తే, హిందూ సమాజానికి విఘాతం కలిగిస్తే అడ్డుకుని నేను, రాజాసింగ్ పోరాడినం అన్నారు.
కరీంనగర్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటై 12 శాతం ఓటు బ్యాంకుతో నన్ను ఓడించే కుట్ర చేస్తున్నరన్నారు. నాకు మీరున్నారనే ధైర్యంతో కొట్లాడుతున్నానని, నా హిందువులంతా నా వెంట ఉన్నారనే ధైర్యంతోనే గల్లీగల్లీలో తిరిగి మీకోసం పోరాడుతున్ననన్నారు. ఓటుకు రూ.5 వేలిచ్చి గెలవాలని కుట్ర చేస్తున్నరన్నారు. ఈ సమయంలో హిందూ సమాజం ఏకం కాకుంటే.. ధర్మరక్షకులే కరువైతారన్నారు. దేశ వ్యాప్తంగా మోడీ ప్రభంజనం కొనసాగుతుంది. మళ్లీ మోడీ ప్రధాని అవ్వడం ఖాయం. అందుకే ఎంపీగా నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా మోడీ వద్ద కూర్చుని అయినా కరీంనగర్ కు పెద్ద ఎత్తున అభివృద్ది నిధులు మరియు ప్రాజెక్ట్ లను తీసుకు వస్తాను అంటూ బండి సంజయ్ హామీ ఇచ్చారు.





