Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జరిగిందేంటి.. కవిత పాత్ర నిజమేనా..?
Qubetvnews - March 16, 2024 / 10:19 AM IST
Kavitha : మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. చాలా రోజులుగా కవిత అరెస్ట్ పై ఊహాగానాలు వస్తున్నాయి. కానీ చివరకు అనుకున్నట్టు గానే.. ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ఒక రోజు ముందు కవిత అరెస్ట్ సంచలనం రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పాత్ర ఉందనేది సీబీఐ చేస్తున్న ప్రధాన ఆరోపణ. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటి.. అందులో నిజంగానే కవిత పాత్ర ఉందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం 2021 సెప్టెంబర్ 17న కొత్త లిక్కర్ పాలసీని తీసుకువచ్చింది.
అయితే ఈ లిక్కర్ పాలసీలో చాలా అవకతవకలు జరిగాయని.. అవినీతి జరిగింది అంటూ ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా 2022 జులైలో సీబీఐ విచారణకు ఆదేశించారు. కాగా ఎవరికైనా ఈ పాలసీని చూస్తే ఎవరికైనా అనుమానాలు రాక మానవు. ఎందుకంటే లిక్కర్ హోం డెలివరీ, తెల్లవారు 3 గంటల దాకా అమ్మకాలు, ఇష్టం వచ్చిన ధరకు అమ్ముకోవడాలు ఇవన్నీ వ్యాపారస్తుల ప్రయోజనాల కోసం చేశారనేది తీవ్ర విమర్శలకు దారి తీసింది. అంతే కాకుండా ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఎక్సైట్ శాఖ మంత్రిగా ఉన్న మనీస్ సిసోడియా కరోనా సమయంలో ఏకంగా రూ.144 కోట్ల లైసెన్స్ ఫీజును వ్యాపారస్తులకు రద్దు చేశారు.
క్యాబినెట్ అనుమతి, లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం లేకుండానే ఆయన రద్దు చేశారు. ఈ విషయాలన్నీ ఢిల్లీ సీఎస్ నరేష్ కుమార్ నివేదికలో బయట పడ్డాయి. దాంతో సీబీఐ వీటి ఆధారంగా పెద్ద ఎత్తున అవినీతి జరిగి ఉండొచ్చు అనే అనుమానాలతో విచారణ మొదలు పెట్టింది. సీబీఐ ఎంక్వయిరీ స్టార్ట్ కాగానే ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వం అలెర్ట్ అయిపోయింది. వెంటనే లిక్కర్ పాలసీని రద్దు చేసింది. కొత్త పాలసీని తెస్తామని కూడా చెప్పింది. కానీ అప్పటికే పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే అనుమానాలతో సీబీఐ విచారణ కొనసాగించింది. అసలే కేజ్రీవాల్ ప్రభుత్వానికి కేంద్రానికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది కాబట్టి ఈడీ, సీబీఐ వేగంగా విచారణ చేశాయి.
ఇందులో భాగంగా 2023 ఫిబ్రవరిలో డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియాను మొదటగా అరెస్ట్ చేశారు. అప్పటి నుంచే ఎమ్మెల్సీ కవిత పేరు ఈ లిక్కర్ కేసులో వినిపిస్తోంది. తనకు సంబంధం లేదని కవిత పదే పదే చెప్తోంది. కానీ ఈడీ చెప్తున్న దాని ప్రకారం.. ఢిల్లీ లిక్కర్ మార్కెట్ లో ఇండో స్పిరిట్ మద్యం కంపెనీ ఓనర్ సమీర్ మహేంద్రుకు 30 శాతం వాటా ఉంది. కాగా ఈ కంపెనీలో సౌత్ గ్రూప్ కు 65 శాతం వాటా ఉంది. ఈ సౌత్ గ్రూప్ లో ఎమ్మెల్సీ కవిత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఆయన కొడుకు రాఘవ్, అరవిందో ఫార్మా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఉన్నారు.
ఈ నలుగురు ఢిల్లీ లిక్కర్ పాలసీ తెస్తున్న సమయంలోనే ఇండో స్పిరిట్ కంపెనీలో భాగస్వాములుగా చేరారు. అయితే ఢిల్లీని 32 మద్యం జోన్లుగా విభజిస్తే అందులో 9 జోన్లలో ఇండో స్పిరిట్ కు లైసెన్స్ లు ఇచ్చారు. ఇలా లైసెన్స్ లు ఇవ్వడం కోసం సౌత్ గ్రూప్ సభ్యులు కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి అయిన విజయ్ నాయర్ కు రూ.100 కోట్లు లంచంగా ఇచ్చారని ఈడీ ప్రధానంగా తన చార్జిషీట్ లో పేర్కొంది. ఈ డబ్బులో రూ.70లక్షలను గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు చేసిందని ఈడీ చెబుతోంది. ఈ సౌత్ గ్రూప్ లో ఉన్న వారిలో ఇప్పటికే మాగుంట రాఘవ్ రెడ్డిని, శరత్ చంద్రారెడ్డిని ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఇక ఇండో స్పిరిట్ కంపెనీ ఓనర్ సమీర్ మహేంద్రును కూడా ముందే ఈడీ అరెస్ట్ చేసింది.
వీరిని అరెస్ట్ చేసిన సమయంలోనే కవితను పలుమార్లు ఈడీ విచారించింది. అయితే కవితను అరెస్ట్ చేయడానికి ముందే హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై, చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబును కూడా ఈడీ అరెస్ట్ చేసింది. అయితే ఈ ఇద్దరి ఆధారంగానే కవిత తన వ్యాపారాన్ని నడిపించింది అనేది ఈడీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఈ అరుణ్ రామచంద్ర పిళ్లై కవితకు అత్యంత సన్నిహితుడు. చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు ఎవరో కాదు కవిత సొంత చార్టెడ్ అకౌంటెంట్.
కాగా అరుణ్ రామచంద్ర పిల్లైని ఇండో స్పిరిట్ ఓనర్ సమీర్ కు కవితనే పరిచయం చేసిందని.. అరుణ్ తో వ్యాపారం చేస్తే తనతో చేసినట్టే అని కవిత చెప్పిందని ఈడీ ఆరోపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన బుచ్చిబాబుతో కవితకు దగ్గరి సంబంధాలు ఉన్నాయనేది ఈడీ ప్రధాన ఆరోపణ.
పైగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి విజయ్ నాయర్ ఒత్తిడితో పాటు కవిత కూడా తన ఇంట్లో మనిషిలా చూడటం వల్లనే తన వ్యాపారంలో సౌత్ గ్రూప్ సభ్యులను భాగస్వాములుగా చేర్చుకున్నానని సమీర్ మహేంద్ర వాంగ్మూలం ఇచ్చారని ఈడీ తన చార్జిషీట్ లో పేర్కొంది. కాబట్టి ఇలా ఇండో స్పిరిట్ కంపెనీలో నేరుగా భాగస్వామ్యం ఉన్న ఈ సౌత్ గ్రూప్ సభ్యులు రూ.100 కోట్ల లంచం ఇచ్చి అవినీతికి పాల్పడ్డారని.. అందుకే వారిని అరెస్ట్ చేస్తున్నామని ఈడీ చెబుతోంది. ఇదంతా ఈడీ తన చార్జిషీట్ లో చెబుతున్న మాట. కానీ అసలు కవితకు ఇండో స్పిరిట్ కంపెనీలో నేరుగా భాగస్వామ్యం లేదు. అంతే కాకుండా ఆమె అకౌంట్ నుంచి విజయ్ నాయర్ కు గానీ, ఇతర భాగస్వాములకు గానీ డబ్బులు బదిలీ కాలేదు. ఈ రెండు కారణాలు ఆమె తప్పు చేయలేదని చెబుతున్నాయి. కాకపోతే రాజకీయ కారణాలతోనే ఆమె అరెస్ట్ అయిందని చెబుతున్నారు. ఎందుకంటే కేంద్రం తనకు అవసరం అయినప్పుడు ఈడీ, సీబీఐని వాడుకుటుందనేది బీఆర్ ఎస్ ప్రధాన ఆరోపణ. తమను రాజకీయంగా టార్గెట్ చేయడంలో భాగంగానే ఈడీ, సీబీఐతో కవితను అరెస్ట్ చేయించారని బీఆర్ ఎస్ చెబుతోంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈడీ, సీబీఐ 2014 నుంచి 2024 వరకు చేపట్టిన కేసుల్లో 95 శాతంగా అపోజిషన్ పార్టీ లీడర్ల మీదనే ఉన్నాయి. దాన్ని బట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ ఎవరి మీద ఈడీ, సీబీఐ కొరడా విసురుతోందో అర్థం చేసుకోవచ్చని బీఆర్ ఎస్ ఆరోపిస్తోంది.

